Begin typing your search above and press return to search.

ఆ యువ న్యాయవాదిని బాబు మోసం చేశారా?

By:  Tupaki Desk   |   18 March 2016 4:31 AM GMT
ఆ యువ న్యాయవాదిని బాబు మోసం చేశారా?
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్త తలనొప్పి ఒకటి మొదలైనట్లే. ఎన్నికల వేళ వెనుకా.. ముందు చూసుకోకుండా ఇష్టారాజ్యంగా హామీలు ఇచ్చేస్తే ఎన్ని తలనొప్పులన్నది ఆయన ప్రాక్టికల్ గా ఎదుర్కొంటున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ.. బాబు వస్తే జాబు వస్తుందని జనాలు అనుకుంటున్నారంటూ చంద్రబాబు తాను ప్రసంగించిన ప్రతి సమావేశంలో ప్రస్తావించటమే కాదు.. ‘‘తమ్ముళ్లు.. మీరు కోరుకున్నట్లే చేస్తా’’ అంటూ గొప్పగా హామీ ఇచ్చేయటం తెలిసిందే.

తాజాగా తిరుపతికి చెందిన యువ న్యాయవాది ఒకరు సూసైడ్ అటెమ్ట్ చేశారు. ఎందుకంటే.. బాబు వస్తే జాబు గ్యారెంటీ అన్నారని.. అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తి అయినా జాబులు వచ్చింది లేదని.. ఒకవేళ జాబు రాకున్నా.. నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారని.. అలాంటిదేమీ లేకుండా తనను మోసం చేశారని ఆరోపిస్తూ ఆత్మహత్యా యత్నం చేయటం సంచలనం సృష్టించింది.

తిరుపతికి చెందిన పోతులూరు మాసుమయ్య అలియాస్ మాసుం ఇండియా అనే యువ న్యాయవాది బాత్రూం క్లీనర్ ను తాగి సూసైడ్ అటెమ్ట్ చేయటం.. చావు బతుకుల మధ్య రుయా ఆసుపత్రిలో కొట్టు మిట్టాడుతున్నారు. చదువుల కోసం అప్పులు చేయటం.. చదువు పూర్తి అయ్యాక ఉద్యోగం రాకపోవటంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. ఏమీ చేయలేని దుస్థితిలో తాను చనిపోవాలని అనుకున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. బాబు ఇచ్చిన జాబు డిమాండ్ కానీ పెద్ద ఎత్తున తెర మీదకు వస్తే.. ఇప్పుడున్న కష్టాలు బాబుకు రెట్టింపు అయినట్లే.