Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఓ సీటు నాకే అంటోన్న యువ‌నేత‌...!

By:  Tupaki Desk   |   30 Aug 2021 11:30 AM GMT
జ‌గ‌న్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఓ సీటు నాకే అంటోన్న యువ‌నేత‌...!
X
జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపడితే చాలు తాను మంత్రిని అవడం ఖాయమని విశాఖ జిల్లా వైసీపీ యువ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ భావిస్తున్నారు. ఆయన అనకాపల్లి నుంచి మంచి మెజారిటీతో గెలిచారు. మంత్రి పదవి కోసం ఆయన చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. దాని కోసం తెర వెనక చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ఇక తెర ముందు కూడా ప్రభుత్వ గొంతుగా మారి సర్కార్ విధానాలను డిఫెండ్ చేయడంలో ఆయనే ముందుంటారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ విషయంతో పాటు ఇతర అనేక సమస్యల పైన టీడీపీ తెలివిగా వైసీపీ మీదనే బురద జల్లుతోంది.

అసెంబ్లీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ తీర్మానం చేయించినా కూడా టీడీపీ తప్పు వైసీపీదే అంటోంది. దాన్ని కౌంటర్ చేసేవారు విశాఖ జిల్లా వైసీపీలో ఎవరూ లేరు. అయితే గుడివాడ మాత్రం దూకుడుగా ముందుకు వస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టి మరీ టీడీపీకి సవాల్ చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు హయాంలోనే విశాఖ స్టీల్ అన్నది ప్రైవేట్ పరం కావడానికి రంగం సిద్ధం అయిందని కూడా ఆయన అంటున్నారు. విశాఖను అన్ని రకాలుగా అనాధను చేసి వదిలేసిన టీడీపీ ఇపుడు తమపైన నిందలు వేస్తుందా అని ఆయన గర్జిస్తున్నారు.

ఇక ఈ ఒక్క విషయమే కాదు జగన్ని కానీ వైసీపీ సర్కార్ ని కానీ ఏమన్నా కూడా ముందుగా గుడివాడే రంగలోకి దిగిపోతున్నారు. అదే సమయంలో మంత్రిగా ఉంటున్న అవంతి శ్రీనివాసరావు మాత్రం ఖండించడానికి ఎందుకో వెనకడుగు వేస్తున్నారు. ఆయన ఎపుడూ గుడివాడ తరువాతనే మీడియాకు వస్తారని ఈ పాటికే పేరు తెచ్చుకున్నారు. ఇక తన పదవీకాలం ఎటూ ముగుస్తోండడం, మరో మారు రెన్యూల్ చేయరన్న గ్యారంటీ ఉండబట్టే అవంతి అలా వ్యవహరిస్తున్నారు అంటున్నారు.

ఇక గుడివాడతో పాటు తామూ మంత్రి పదవికి రేసులో ఉన్నామని చెబుతున్న వారంతా కూడా ప్రభుత్వం మీద విమర్శలు వచ్చినపుడు గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేవు. అంతకంటే కూడా వారు మౌనంగానే ఉంటారు. దాంతో గుడివాడకు మంత్రి పదవి ఇస్తే విశాఖ జిల్లా రాజకీయాల్లో దుమ్ము రేపుతాడు అని ఆయన వర్గం చెబుతోంది. మరి ఈ విషయాలు అన్నీ కూడా వైసీపీ హై కమాండ్ దృష్టిలో కూడా ఉంటాయి కాబట్టి గుడివాడకు మంత్రి పోస్ట్ ఖాయమే అంటున్నారు.