Begin typing your search above and press return to search.

సీనియర్లకు ఝలక్.. వారసులకు నో టికెట్...?

By:  Tupaki Desk   |   22 April 2022 2:30 PM GMT
సీనియర్లకు ఝలక్.. వారసులకు నో టికెట్...?
X
చంద్రబాబు మొత్తానికి ఒక సత్యాన్ని తెలుసుకున్నారు. పార్టీకి సీనియర్లే బరువు అన్నది ఆ సత్యం. ఏళ్ళు ఏళ్లు పార్టీలో ఉంటూ అధికారంలోకి వస్తే తామే పదవులు అనుభవిస్తున్న వారు అదే పార్టీ విపక్షంలోకి వస్తే మాత్రం జనాల్లోకి అసలు ఏ కోశానా  వెళ్ళడంలేదు. అంతే కాదు, సీనియర్లలో చాలా మందికి జనాలతో కనెక్షస్ కట్ అయి ఏళ్లు అవుతోంది. చంద్రబాబే చెప్పినట్లుగా నాలుగు ఓట్లు కూడా తేలేని వారు కీలక పదవుల్లో కుదురుకుంటున్నారు.

దాంతో చంద్రబాబు సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా కీలకమైన కామెంట్స్ చేశారు. సీనియర్లకు ఈసారి టికెట్లు ఇవ్వమని చెప్పేశారు. తనకు సీనియర్ల మీద గౌరవం ఉందని బాబు చెబుతూనే అయితే ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించారు. ఎన్నికల్లో పార్టీ గెలుపే ముఖ్యమని ఆయన అంటున్నారు. అలా కాకుండా సీనియర్లు టికెట్ల కోసం పట్టుబట్టకుండా  గమ్మున ఉండాలని గొప్ప సందేశాన్ని బాబు పంపించేశారు.

ఈ నేపధ్యంలో సీనియర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అంటున్నారు. సీనియర్లు అంటే శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే అనంతపురం దాకా చాలా మంది ఉన్నారు. వారిలో కిమిడి కళా వెంకటరావు, యనమల రామక్రిష్ణుడు వంటి ఉద్ధండులూ ఉన్నారు. కళా వెంకటరావు అయితే గతం కంటే కూడా ఇపుడు తన సీట్లో  పట్టు కోల్పోయారు అని అంటున్నారు.

ఇక తునిలో గతంలో బాగా గెలుస్తొ వచ్చిన యనమల రామక్రిష్ణుడు తన సోదరుడికి టికెట్ అంటూ పట్టు పడుతూ ఇప్పించుకుంటున్నారు. అలా తునిలో చాలా సార్లు టీడీపీ ఓటమి పాలు అవుతోంది. మరో వైపు చూస్తే చాలా మంది సీనియర్లకు సొంత బలం తగ్గింది. పార్టీ వేవ్ ఉంటేనే గెలుస్తున్నారు. అయితే గతానికి ఇప్పటికీ పోటీ పెరిగింది. వైసీపీ ఎంట్రీతో మరింత ధాటీగా పాలిటిక్స్ చేయాల్సి వస్తోంది.

దాంతో చంద్రబాబు యువత మీద మక్కువ చూపిస్తున్నారు అంటున్నారు. దాంతోనే ఆయన సీనియర్లకు టికెట్లు ఇవ్వమని చెప్పేశారు అని తెలుస్తోంది. ఇంకో వైపు చూసుకుంటే తమకు కాకపోయినా తమ వారసులకు టికెట్లు అయినా ఇవ్వరా అని సీనియర్ల నుంచి డిమాండ్ వస్తోందిట. మరి దీనికి కూడా బాబు తలొగ్గే చాన్స్ అయితే లేదు అంటున్నారు. వారికి జనాదరణతో పాటు పార్టీ మీద  పట్టు ఉంటే చూడవచ్చు కానీ ఊరికే వారసులను ప్రోజెక్ట్ చేయాలని నాయకులు  చూస్తే పార్టీ ఇబ్బందులో పడుతుంది అన్నది బాబు మార్క్ పాలిటిక్స్ లా ఉంది.

దాంతో వారసులలో కూడా చాలా మందికి నో టికెట్ అంటున్నారు. ఇక న్యూట్రల్ గా ఉన్న వారితో పాటు యువతకు టికెట్లు పెద్ద ఎత్తున ఇస్తేనే వైసీపీని ఢీ కొట్టగలమని  బాబు బలంగా నమ్ముతున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే టీడీపీలో వచ్చిన గణనీయమైన మార్పుగా దీన్ని చూస్తున్నారు.  కొత్త ముఖాలకు కొత్త రక్తానికి పార్టీలో చోటు ఇస్తేనే తప్ప టీడీపీ సైకిల్ పరుగులు తీయదని బాబు భావిస్తున్నారు. అదే కనుక జరిగితే మాత్రం సీనియర్లు ఇక రెస్ట్ తీసుకోవడమే అంటున్నారు. మొత్తానికి బాబు మార్క్ పాలిటిస్క్ పెద్దాయనలకు అసలు మింగుడు పడడంలేదుట.