Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో కుర్ర పేసర్లు.. కెవ్వు కేక

By:  Tupaki Desk   |   2 May 2022 11:36 AM GMT
ఐపీఎల్ లో కుర్ర పేసర్లు.. కెవ్వు కేక
X
ఐపీఎల్ -15 సీజన్ మధ్యకు వచ్చింది. అన్ని జట్లకు ఒక రౌండ్ మ్యాచ్ లు (9) ఆడేశాయి. లఖ్ నవూ, బెంగళూరు మాత్రం దీనికి ఒక మ్యాచ్ ఎక్కువే ఆడాయి. ఈసారి లీగ్ లో అటు బ్యాట్స్ మన్, ఇటు బౌలర్లు సమాన ప్రతిభ చూపుతున్నారు. గతంలో స్పిన్ బౌలర్ల గురించి ఐపీఎల్ లో ఎక్కువ చర్చ జరిగేది. రాహుల్ చహర్, వరుణ్ చక్రవర్తి, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, అఫ్గానిస్థాన్ ముజిబుర్ రెహ్మాన్ ఇలా పలువురు వెలుగులోకి వచ్చారు. నరైన్ అంతకుముందే ప్రసిద్ధుడైనా.. ఐపీఎల్ తో మరింత వార్తల్లో నిలిచాడు. కానీ, ఈసారి లీగ్ లో పేసర్లు అందులోనూ భారత కుర్ర పేసర్ల ప్రతిభ కనిపిస్తోంది. మంచి లైన్ అండ్ లెంగ్త్, తగినంత వేగంతో వీరు ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్న తీరు ఆకట్టుకుంటోంది.

ఉమ్రాన్ మొదలు మొహిసిన్ దాకా..ఈ లీగ్ లో 150 కిలోమీటర్ల పైగా వేగంతో బంతులేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు కశ్మీరీ కుర్రాడు ఉమ్రాన్ మాలిక్. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో విఫలమైనా.. అంతకుముందు గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ల్లో ఉమ్రాన్ ప్రతిభను మర్చిపోలేం. ప్రతి మ్యాచ్ లోనూ 150 కి.మీ. వేగం అందుకున్న ఘనత అతడిది. దీంతో రాజకీయ నాయకుల నుంచి క్రికెట్ పండితులు,

వ్యాపారవేత్తల వరకు ఉమ్రాన్ ను ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే, అందరూ ఉమ్రాన్ మాయలో పడి ఇంకొందరు కుర్రాళ్ల ప్రతిభను మర్చిపోతున్నారు. ఇలాంటివారిలో లఖ్ నవూ సూపర్ జెయింట్స్ పేసర్ మొహిసిన్ ఖాన్. 23 ఏళ్ల ఈ యూపీ పేసర్ ఆదివారం అద్భుత స్పెల్ (4/16) వేశాడు. పొదుపుగా బంతులేయడమే కాదు.. వికెట్లూ తీస్తూ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గతంలో ముంబై ఇతడిని తీసుకున్నా మ్యాచ్ లు ఆడించలేదు. ఈసారి సొంత రాష్ట్ర ఫ్రాంచైజీకే ఆడుతూ రాణిస్తున్నాడు.

ముఖేశ్ చౌదరి.. అర్షదీప్ సింగ్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో స్థాయికి తగినట్లగా ఆడకున్నా ఆ జట్టులో ఒకరు మాత్రం ఆకట్టుకుంటున్నాడు. అతడే పేసర్ ముకేశ్ చౌదరి. రాజస్థాన్ కు చెందిన 25 ఏళ్ల ముఖేశ్ ఆదివారం సన్ రైజర్స్ తో మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. పరుగులు (46) కాస్త ఎక్కువే ఇచ్చినా కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆ ప్రభావం పడకుండా చూశాడు. గత గురువారం ముంబైతో మ్యాచ్ లో ముఖేశ్ చక్కటి స్పెల్ (3/19) వేశాడు. గుజరాత్ టైటాన్స్ (1/18) పైనా రాణించాడు.

పంజాబ్ కింగ్స్ కు ఆడుతున్న 23 ఏళ్ల అర్షదీప్ సింగ్ ది మరో చక్కటి కథ. 130 కి.మీ. వేగానికి అటుఇటుగా ఉండే అతడి బౌలింగ్ క్రమంగా రాటుదేలింది. ఇప్పుడు 140కి చేరింది. అంతేకాదు..చక్కటి స్పెల్స్ తో ఆకట్టుకుంటున్నాడు. 0/29, 0/32, 0/17, 1/23, 0/23.. ఇదీ గత ఐదు మ్యాచ్ ల్లో అర్షదీప్ ప్రదర్శన. వికెట్లు తీయకున్నా.. టి20ల్లో కీలకమైన పరుగులను కట్టడి చేస్తున్నాడు అర్షదీప్. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అర్షదీప్ ప్రతిభను కళ్లారా చూడాల్సిందే. దీంతో ఈ ఏడాది చివర్లో జరుగనున్న టి20 ప్రపంచ కప్ లో టీమిండియా తరఫున అర్షదీప్ ను చూడొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 25 ఏళ్ల కుల్దీప్ సేన్ కూడా ప్రతిభావంతుడైన బౌలరే. బెంగళూరు తో గత నెల 26న జరిగిన మ్యాచ్ లో కుల్దీప్ సేన్.. డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ వంటి మేటి బ్యాట్స్ మెన్ వికెట్లు తీసి ఆశ్చర్యపరిచాడు.

ఎడమచేతివాటం వారే అధికం..అర్షదీప్, మొహిసిన్, ముకేశ్ చౌదరి ఈ ముగ్గురూ ఎడమచేతివాటం పేసర్లు కావడం విశేషం. భారత్ లో ఒకే సమయంలో ప్రతిభావంతులైన ఎడమ చేతివాటం పేసర్లు వెలుగులోకి రావడం ఆశ్చర్యకర పరిణామమే. గతంలో ఆశిష్ నెహ్రా, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్, ఆర్పీసింగ్ ఒకే కాలంలో టీమిండియాకు ఆడారు. ఇప్పుడు మళ్లీ కుర్రాళ్లు.. తమ ప్రత్యేకతతో ఆశలు రేకెత్తిస్తున్నారు.