Begin typing your search above and press return to search.

ప్రాణం తీసిన పాడు ప్రేమ.. బంజారాహిల్స్ లో యువతి సూసైడ్

By:  Tupaki Desk   |   31 March 2021 9:30 AM GMT
ప్రాణం తీసిన పాడు ప్రేమ.. బంజారాహిల్స్ లో యువతి సూసైడ్
X
ప్రేమించటమే ఆమె చేసిన అతి పెద్ద తప్పు. పరిచయమైన వ్యక్తిని నమ్మేసింది. దాన్నో అవకాశంగా చేసుకొని అతగాడు చేసిన మోసాన్ని భరించలేకపోయింది. తనలో తానే కుమిలిపోతూ ఆత్మహత్య చేసుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అయ్యో అనిపించేలా ఉండే 20 ఏళ్ల ఐశ్వర్య ఉదంతమిది. బంజారాహిల్స్ లోని రాఘవేంద్ర నగర్ కాలనీలో నివాసం ఉండే ఆమె.. ఒక ప్రైవేటు సంస్థలో బిజినెస్ ఎగ్జిక్యుటివ్ గా పని చేస్తుండేది. కొంతకాలం క్రితం ఇన్ స్టా గ్రాంలో ఆశిర్ అనే యువకుడు పరిచయమయ్యాడు.

అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ శివారులోని సంఘీ టెంపుల్లో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు కలిసి ఉన్నారు. వీరి పెళ్లి గురించి ఇంట్లో తెలియటం.. ఇరువురి కుటుంబాల వారు నో అంటే నో చెప్పారు. ఏ పని చేయని ఆశిర్ రెడ్డి పోషించలేడంటూ ఐశ్వర్య తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు.

భర్తకు దూరం చేశారన్న కోపంతో రగిలిపోయేది ఐశ్వర్య. ఇంట్లోని వారికి చెప్పకుండా బయటకొచ్చిన ఆమె.. హాస్టల్ లో ఉంటూ జాబ్ చేస్తుండేది. ఆమెకు మాయమాటలు చెబుతూ.. తమ ఇంట్లోని వారిని ఒప్పిస్తానంటూ ఆమెతో రిలేషన్ కొనసాగించేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతైంది. అయితే.. తనకు కొంచెం సమయం కావాలంటూ కాలయాపన చేస్తూ.. చివరకు అబార్షన్ చేయించాడు.

దీంతో.. ఆశిర్ తో తనకున్న సంబంధాన్ని తేల్చుకోవాలన్న ఆలోచనతో ఐశ్వర్య అతడి ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమెకు తీవ్రమైన అవమానాలు ఎదురయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన ఆమె హాస్టల్ లో ఊరేసుకొని సూసైడ్ చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకొని.. తాను మోసపోయిన వైనాన్ని వివరించింది. ఐశ్వర్య ఆత్మహత్య నేపథ్యంలో ఆశిర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రేమించటమే ఐశ్వర్య చేసిన తప్పుగా అభివర్ణిస్తున్నారు. నమ్మి ప్రేమించినందుకు చావే మిగిలిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.