Begin typing your search above and press return to search.

కంచికి చేరిన రాజకీయ వారసుల కథ

By:  Tupaki Desk   |   8 Oct 2018 8:32 AM GMT
కంచికి చేరిన రాజకీయ వారసుల కథ
X
ఎన్నికల వేళ ఎన్నో ఆశలు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరెన్నో ఊసులు. అంతా అనుకున్నట్లుగానే జరుగుతుందని అనుకున్నారు. చివరికి నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు నాయకుల వారసులు. సీనియర్ నేతలు కూడా తమ కొడుకులను - కూతుళ్లును బరిలోకి దింపి వారసత్వాన్ని కొనసాగిద్దామని ఆశించినా నెరవేరలేదు.

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు ప్రకటించగానే బడా నేతల వారసులు తెరపైకి వచ్చారు. తమకు ఓ ఛాన్స్ ఇవ్వాలని గులాబీ బాస్ కేసీఆర్ ను కోరారు. కానీ, ఆయన సిట్టింగ్ లకే దాదాపు అన్ని సీట్లు కట్టెబెట్టారు. ఉన్న ఒకటి రెండు సీట్లలోనైనా ఖచ్చితంగా గెలుస్తామని చెబుతూ కేటాయించాలని కోరారు. అయినా, కేసీఆర్ మనసు కరగలేదు. ఏం చేయాలో తెలియక వారంతా మదనపడుతున్నారు.

ఒక్క వరంగల్ జిల్లా నుంచే ఆరుగురు వారసులు టిక్కెట్ల కోసం రెడీ అయ్యారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య - మంత్రి చందులాల్ కొడుకు ప్రహ్లాద్ - డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కొడుకు రవిచంద్రనాయక్ - స్పీకర్ సిరిగొండ మధుసూధనచారి కొడుకు ప్రశాంత్ టీఆర్ ఎస్ తరుపున పోటీలో నిలిచేందుకు చాలా ప్రయత్నాలు చేశారు.

ఈ వారసుల గోల ఒక్క టీఆర్ ఎస్ కే పరిమితమవలేదు. అటు కాంగ్రెస్ లోనూ ఉంది. కొండా సురేఖ దంపతులు తమ కూతురు సుశ్మితతో రాజకీయ అరంగేట్రం చేయించాలని భావించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయించాలని ఆశించారు. కానీ కేసీఆర్ ఇందుకు నో చెప్పడం.. కాంగ్రెస్ లో చేరినా ఆశించిన హామీ లభించలేదు. ఎన్నికల వేళ రాజకీయ నిర్ణయాలు మారుతుండటంతో సుశ్మిత వ్యవహారాన్ని కొండా సురేఖ పక్కనపెట్టారు.

టిక్కెట్ వస్తుందని భావించి క్యాడర్ ను కూడా రెడీ చేసుకున్నాక - అధిష్టానాల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో నిరాశలో మునిగిపోయారు చాలా మంది రాజకీయ వారసులు. అప్పటి వరకు ఎంతో హుషారుగా ప్రచారాల్లో, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న వారంతా దూకుడు తగ్గించారు. సైలెంట్ అయిపోయారు. కానీ, ఇది తాత్కాలికమేనని అంటున్నారు కొంతమంది యంగ్ స్టర్స్.