Begin typing your search above and press return to search.

సంచ‌లనం!..మోదీతో ట‌చ్ లో 40 మంది దీదీ ఎమ్మెల్యేలు!

By:  Tupaki Desk   |   30 April 2019 4:11 AM GMT
సంచ‌లనం!..మోదీతో ట‌చ్ లో 40 మంది దీదీ ఎమ్మెల్యేలు!
X
దేశంలో ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టం అమ‌ల్లో ఉన్నా... దానిని ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడ‌నే చెప్పాలి. గ‌తంలో తెలంగాణ‌లో కేసీఆర్‌ - ఏపీలో చంద్ర‌బాబు..విప‌క్షాల‌కు చెందిన ఎమ్మెల్యేల‌ను లాగేసి ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను వీక్ చేసిపారేశారు. ఇప్పుడు కొత్త‌గా ఏకంగా కేంద్రంలో ప్ర‌ధానిగా ఉన్న న‌రేంద్ర మోదీనే ఈ త‌ర‌హా ఫిరాయింపుల‌కు పాల్ప‌డేందుకు రంగం సిద్ధం చేస్తున్న‌ట్లుగా స్వ‌యంగా ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని టార్గెట్ చేసిన మోదీ... ఆమె పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్ కు చెందిన ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్ లో ఉన్నారంటూ మోదీ చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు పెను క‌ల‌క‌ల‌మే రేపుతోంది.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా బెంగాల్ లోని సారంపూర్ లో సోమ‌వారం నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన మోదీ.. దీదీనే టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. మే 23న లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం.. బెంగాల్‌ లోని టీఎంసీ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీని వదిలి బీజేపీలోకి వస్తారంటూ మోదీ సంచలన ప్రకటన చేశారు. ఈ దిశ‌గా మోదీ చేసిన వ్యాఖ్య‌లు ఏమిటంటే... *దీదీ... మే 23న ఫలితాలు వెలువడే రోజు ప్రతిచోటా కమలం వికసిస్తుంది. మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని వదిలేస్తారు. ఇవాళ కూడా 40 మంది మీ ఎమ్మెల్యేలు నాతో మాట్లాడారు* అని మోదీ ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు.

ఎన్నిక‌ల‌కు చాలా కాలం ముందు నుంచే దీదీతో ప్ర‌త్య‌క్ష యుద్ధాన్నే ప్ర‌క‌టించిన మోదీ..ఎప్ప‌టిక‌ప్పుడు ఆమెపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. గ‌తంలో క‌మ్యూనిస్టుల‌కు కంచుకోట‌గా ఉన్న బెంగాల్‌... ప్ర‌స్తుతం తృణ‌మూల్ ఖిల్లాగా ఉంది. అయితే ఈ ద‌ఫా ఎలాగైనా దీదీ కోట‌ను బ‌ద్ద‌లు కొట్టాల‌న్న ల‌క్ష్యంతో బీజేపీ త‌న‌దైన వ్యూహాన్ని అమ‌లు చేసింది. ఈ క్ర‌మంలోనే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా గ‌తంలో కోల్ క‌తాలో ర్యాలీకి పూనుకోగా... దీదీ అనుమ‌తి నిరాక‌రించారు. ఈ ఉదంతం నాడు పెను క‌ల‌క‌ల‌మే రేపింద‌ని చెప్పాలి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో బెంగాల్ లో రెండు ఎంపీ సీట్ల‌ను గెలుచుకున్న బీజేపీ... ఈ ద‌ఫా ఆ సీట్ల సంఖ్య‌ను డ‌బుల్ డిజిట్ కు పెంచుకోవాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలోనే బెంగాల్ కు సంబంధించిన ప్ర‌తి చిన్న విష‌యాన్ని కూడా మోదీ షాలు ప్ర‌త్యేకంగానే చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మోదీ నోట నుంచి ఏకంగా తృణ‌మూల్ కాంగ్రెస్ కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్ లో ఉన్నారంటూ వ్యాఖ్య‌లు రావ‌డం పెను క‌ల‌క‌లాన్నే రేపుతోంది.