Begin typing your search above and press return to search.

మీ భూమి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో పొడి అయిపోయింది..

By:  Tupaki Desk   |   4 Nov 2019 5:49 AM GMT
మీ భూమి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో పొడి అయిపోయింది..
X
ప్రభుత్వాలు అన్నీ కూడా ఇప్పుడు కాలానికి అనుగుణంగా కంప్యూటర్లలో రికార్డులు మైంటైన్ చేస్తున్నాయి. దశాబ్దాల నాటి డేటా కూడా ఇప్పుడు కంప్యూటర్లలో భద్రపరుస్తూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి ప్రభుత్వాలు. కాని కొన్ని చోట్ల మాత్రం ఈ పరిస్థితి కనపడటం లేదు... ఇటీవల శ్రీకాకుళ౦ జిల్లాలో ఒక వ్యక్తి తన భూమికి సంబంధించిన 1983 కి ముందు ఉన్న రికార్డులు కావాలని రిజిస్టార్ ఆఫీస్ కి వెళ్ళగా అక్కడి సిబ్బంది వాటిని వెలికి తీయగా అవి... పొడి పొడిగా బయటకు వచ్చాయి... దీనిని చూసిన ఆ వ్యక్తికి కాసేపు మైండ్ పని చేయలేదు...

అధికారుల నుంచి వచ్చిన సమాధానం... మేము ఏం చేస్తాం...? ఈ పరిస్థితి అతను ఒక్కడిదే కాదు... వేలాది మంది ఈ ఇబ్బందులు రాష్ట్రవ్యాప్తంగా పడుతున్నారు. ఏదైనా ఆస్తి, స్థలం, భూమికి సంబంధించిన మూలాలకు వెళ్లాలంటే, రికార్డులు చాలా కీలకం. 83 ముందు రికార్డులు అన్నీ కూడా దాదాపుగా చేతిరాతతోనే ఉన్నాయి. గతంలో ఎవరైనా రికార్డులు కావాలి అంటే... ఇండెక్స్ ఆధారంగా భద్రపరిచిన రికార్డులను తీసుకుని జిరాక్సులు తీసి ఇచ్చే వారు.

ఇప్పుడు ఆ పేపర్లు చిరిగిపోవడం, పొడి అయిపోవడంతో ఏం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితుల్లో ఉన్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా కృష్ణాజిల్లా గన్నవరంతో పాటు మరికొన్ని రిజిస్ట్రేష‌న్ కార్యాలయాల్లో రికార్డులను డిజిటలైజ్‌ చేసే ప్రక్రియ ప్రభుత్వం మొదలుపెట్టినా అది విజయవంతంగా అమలు కాలేదు. దానికి కారణం కాగితాలు చిరిగిపోవడమే... దీనితో ఇప్పుడు పలువురు ప్రభుత్వానికి కీలక సూచనలు చేస్తున్నారు.

భావితరాలకు భూములకు సంబంధించిన ఆధారాలు అందించాల౦టే కచ్చితంగా డిజిటలైజ్ చేసే కార్యక్రమాన్ని నిపుణుల పర్యవేక్షణలో జరపాలని, ఇందుకోసం సీనియర్ అధికారులు, రిటైర్డ్ అధికారుల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేష‌న్ వ్యవస్థను నవంబరు 1నుంచి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్న సంగతి తెలిసిందే. దీనికి ఆ రికార్డులు చాలా కీలకం.