Begin typing your search above and press return to search.

చంద‌మామ‌పై పేరు రాసుకుంటారా..!

By:  Tupaki Desk   |   21 Jan 2017 2:19 PM GMT
చంద‌మామ‌పై పేరు రాసుకుంటారా..!
X

మ‌న ఊళ్ల‌లో ఒక గుడి క‌ట్టాలంటే ఏం చేస్తారూ..? నిధుల కోసం ఊరూరా చాటింపు వేస్తారు. విరాళాలు సేక‌రిస్తారు. ఆ డ‌బ్బుతో గుడి క‌ట్టాక‌... దాత‌ల వివ‌రాల‌ను శిలాఫ‌ల‌కాల‌పై చెక్కిస్తారు. ముందు త‌రాలవారు త‌మ కుటుంబీకుల పేర్ల‌ను ఆ ఫ‌ల‌కాల‌పై చూసుకుంటే... ఎంత బాగుంటుంది! ఆ అనుభూతి మాట‌ల్లో చెప్ప‌లేం క‌దా. స‌రిగ్గా ఇలాంటిదే ఓ కొత్త ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించింది బెంగ‌ళూరుకు చెందిన ఒక స్టార్ట‌ప్ సంస్థ‌. అది ఇదేదో గుడి నిర్మాణం కోసం కాదండోయ్‌!

చంద్రుడిపైకి ఒక లాండ‌ర్ ను పంపించే ప్రాజెక్టుకు శ్రీ‌కారం చుట్టింది టీమ్ ఇండ‌స్ సంస్థ‌. అయితే.. ఈ ప్రాజెక్టుకు అవ‌స‌ర‌మైన నిధులను విరాళాల రూపంలో ప్ర‌జ‌ల నుంచి సేక‌రించేందుకు ఒక వినూత్న ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేసిన దాత‌ల పేర్ల‌ను అల్యూమినియం ప్లేట్ల‌పై చెక్కించి... వాటిని చంద్ర‌మండ‌లానికి తీసుకెళ్తామ‌ని ప్ర‌క‌టించింది. ఒక పేరుకు అయ్యే ఖ‌ర్చు రూ. 500 మాత్ర‌మే. ఈ ఏడాది డిసెంబ‌ర్ లో పి.ఎస్‌.ఎల్‌.వి. ద్వారా ప్ర‌యోగాన్ని చేప‌డుతున్న‌ట్టు ఆ సంస్థ ప్ర‌క‌టించింది. భూమిపై నుంచి దాదాపు 3. 84 ల‌క్ష‌ల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి... వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 26 నాటికి ఈ నౌక చంద్ర‌మండలాన్ని చేరుకుంటుంద‌ని చెబుతున్నారు. చంద్రుడిపై ఉండే వాతావ‌ర‌ణాన్ని ఫొటోలూ వీడియోల రూపంలో ఈ రోవ‌ర్ భూమ్మీదికి పంపుతుంది.

చంద్రుడిపైకి త‌మ నేమ్ ప్లేట్ పంపాల‌నుకున్న‌వారికి ఇదో గొప్ప అవ‌కాశం అని ఆ కంపెనీ ప్ర‌తినిధులు చెబుతున్నారు. ఇప్ప‌టికే దాదాపు ప‌దివేల మంది పేర్ల‌ను న‌మోదు చేసుకున్నార‌ని చెప్పారు. స‌మీప భ‌విష్య‌త్తులో చంద్రుడికీ భూమికీ మ‌ధ్య రాక‌పోక‌లు సాగించే అవ‌కాశం ఉంద‌నీ... అలాంట‌ప్పుడు త‌మ పూర్వీకులు పంపిన నేమ్ ప్లేట్ల‌ను చంద్రుడిపై కాలుపెట్టిన‌వారు చూసుకుంటే క‌లిగే అనుభూతి ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటుంది క‌దా అంటూ ఆ సంస్థ ప్ర‌తినిధులు అంటున్నారు. మొత్తం ప్రాజెక్టుకు రూ. 443 కోట్లు ఖ‌ర్చ‌వుతుందట‌. ఈ ఆఫ‌ర్ ద్వారా భారీ ఎత్తున ఆర్థిక సాయం ల‌భించే అవ‌కాశం ఉంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. భలే ఉంది ఈ ఆఫ‌ర్‌!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/