Begin typing your search above and press return to search.

మీ మొబైల్ బిల్లు మరింత భారం కానుందా?

By:  Tupaki Desk   |   6 Nov 2016 4:20 AM GMT
మీ మొబైల్ బిల్లు మరింత భారం కానుందా?
X
ఎవరు అధికారంలోకి వచ్చినా.. సామాన్యుడి మీద పన్నుల మోత మాత్రం మోగాల్సిందే. ప్రజలకు సేవ చేస్తామని.. వారి బతుకుల్లో కొత్త వెలుగులు నింపుతామని ప్రతిఒక్కరూ చెప్పే వారేకానీ.. ఏ ప్రభుత్వం కూడా తమ మాటల్ని చేతల్లో చేసి చూపించింది తగదు. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రతిదీ భారమయ్యేలా చేయటమే తప్పించి.. పన్నుల మోతను తగ్గించే పరిస్థితి ఎక్కడా కనిపించదు.

ఆదాయంలో పెరుగుదల స్థిరంగా ఉన్నప్పటికీ.. ప్రతి విషయంలోనూ ఏదో రూపేణా ఖర్చు పెంచే తీరును ప్రభుత్వాలతో సహా.. అన్ని వర్గాలు అనుసరిస్తున్న వేళ.. రోజురోజుకీ బతుకు బండి లాగటం కష్టంగా మారిందని చెప్పక తప్పదు. దేశంలో సరళీకృత పన్నుల విధానాన్ని తీసుకొచ్చేందుకు జీఎస్టీ తెస్తున్నట్లు చెబుతున్నా.. ఈ విధానంలో ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటన్న విషయంపై ప్రభుత్వం ఇప్పటివరకూ సంతృప్తికరమైన సమాధానం చెప్పలేదన్న ఆరోపణ ఉంది.

ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు వదల్లేని పరిస్థితి ప్రస్తుతం చోటు చేసుకుందని చెప్పక తప్పదు. ఇలాంటి వేళ.. మరికొన్ని నెలల్లో అధికారికంగా కానున్న జీఎస్టీ పన్నుల విధానం పుణ్యమా అని మొబైల్ బిల్లులు మరింత భారంగా మారనున్నాయన్న వాదన బలంగా వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల్ని చూస్తే.. ఆదాయం భారీగా వచ్చే ఏ రంగాన్ని వదిలిపెట్టేలా లేదని చెప్పాలి. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని అందించే టెలికం రంగాన్ని తమకు ఆదాయ వనరుగా మార్చుకోవాలన్న లక్ష్యమే ప్రభుత్వానికి ఉంటుందే తప్పించి.. పన్నుల భారాన్ని తగ్గించాలన్న ఆలోచన ఉండదన్న వాదన బలంగా వినిపిస్తోంది.

జీఎస్టీ పన్నుల విధానంలో మొత్తం నాలుగు స్లాబులు డిసైడ్ సంగతి తెలిసిందే. ఇందులో 5..12..18..28 శాతాలుగా పన్నుల్ని డిసైడ్ చేశారు. ప్రస్తుతం మొబైల్ బిల్లులకు 15 శాతం పన్నును అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమల్లో ఉన్న పన్ను రేటు కంటే తక్కువ చేసే అవకాశం దాదాపుగా ఉండదు. అలాంటప్పుడు ఇప్పటికంటే మరింత బాదుడుకే ప్రభుత్వం మొగ్గు చూపటం ఖాయం. అదే జరిగితే.. ఇప్పటివరకూ అమల్లో ఉన్న 15 శాతం స్థానే పన్ను రేటు 18 శాతానికి ఫిక్స్ కావటం ఖాయమని చెప్పక తప్పదు. అదేజరిగితే..మొబైల్ బిల్లుల భారం మరింత పెరగటం పక్కాగా చెప్పొచ్చు. ఒక్క మొబైల్ బిల్లులపై మాత్రమే కాదు.. ఇప్పటివరకూ 15 శాతం పన్ను విధిస్తున్న పలురంగాల్ని 18 శాతం పన్ను రేటుకు షిఫ్ట్ చేయటం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగితే సగటుజీవిపై జీఎస్టీ మరింత భారమని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/