Begin typing your search above and press return to search.

ముంద‌స్తుకు నిర‌స‌న‌గా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

By:  Tupaki Desk   |   6 Sep 2018 9:07 AM GMT
ముంద‌స్తుకు నిర‌స‌న‌గా ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!
X
తిధి.. న‌క్ష‌త్రం.. జ‌న్మ‌ల‌గ్నం.. ఇలా అన్ని చూసుకొని.. ముహుర్తాలు పెట్టుకొని మ‌రీ ముంద‌స్తుకు వెళుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అండ్ కోల‌కు ఊహించ‌ని ప‌రిణామం ఒక‌టి ఎదురైంది. ముందుగా వెలువ‌డిన అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ఉద‌య‌మే తెలంగాణ మంత్రివ‌ర్గ‌స‌మావేశం.. అందులో అసెంబ్లీ ర‌ద్దుపై నిర్ణ‌యం తీసుకోవటం.. కేసీఆర్ చెప్పినంత‌నే త‌లూపేసిన మంత్రులు.. ర‌ద్దు తీర్మానాన్ని చేసేశారు.

ఆ విష‌యం మీడియాలోకి వ‌చ్చి.. సీఎంతో స‌హా మంత్రులంతా క‌లిసి ఆఖ‌రుగా అధికార హోదాలో రాజ్ భ‌వ‌న్‌కు వెళ్లే వేళ‌.. అనుకోని రీతిలో అప‌శ‌కునం ఒక‌టి ఎదురైంది. ముంద‌స్తు విష‌యంలో టీఆర్ఎస్ అధినేత ఆలోచ‌న‌లు ఎలా ఉన్నాయ‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. మ‌రి.. తెలంగాణ స‌మాజం ఎలా ఆలోచిస్తోంది? సామాన్యులు ఎలా ఆలోచిస్తున్నారు? అన్న ప్ర‌శ్న‌కు ఒక స‌మాధానం అన్న‌ట్లుగా ఒక ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ముంద‌స్తు విష‌యంలో కీల‌క‌మైన అసెంబ్లీ ర‌ద్దుపై తెలంగాణ కేబినెట్ నిర్ణ‌యం తీసుకున్న‌కాసేప‌టికి రాజ్ భ‌వ‌న్ ఎదుట ఒక యువ‌కుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకోవ‌టానికి ప్ర‌య‌త్నించిన వైనం కల‌క‌లం రేపింది. త‌మ ర‌ద్దు తీర్మానాన్ని తీసుకొని గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసేందుకు సీఎం.. ఆయ‌న మంత్రివ‌ర్గ‌స‌భ్యులు రాజ్ భ‌వ‌న్ కు రావ‌టానికి కాస్త ముందుగా న‌ల్గొండ జిల్లాకుచెందిన యువ‌కుడు ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డి వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

శుభ‌మా అని అసెంబ్లీర‌ద్దు చేసుకొని వ‌స్తున్న‌వేళ‌..ఆత్మ‌త్యాగానికి సైతం వెనుకాడ‌నిరీతిలో ఒక యువ‌కుడు చేప‌ట్టిన నిర‌స‌న టీఆర్ఎస్ వ‌ర్గాల్ని ఉలిక్కిప‌డేలా చేశాయ‌ని చెబుతున్నారు. త‌న పేరు ఈశ్వ‌ర్ అని.. తాను నిజాం కాలేజీ ఓల్డ్ విద్యార్థిన‌ని.. త‌న‌ది న‌ల్గొండ జిల్లా నార్క‌ట్ ప‌ల్లి నుంచి వ‌చ్చిన‌ట్లు చెప్పారు.

ముంద‌స్తు మొత్తం త‌న కుటుంబానికి ప‌ద‌వులు ఇప్పించుకోవటం కోస‌మే చేస్తున్న‌ట్లుగా ఈశ్వ‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజ్ భ‌వ‌న్ ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకోవ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్న వేళ‌.. రాజ్ భ‌వ‌న్ సిబ్బంది వెంట‌నే స్పందించ‌టంతో పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది. ఉద్య‌మ‌కారుల‌కు.. తెలంగాణ‌కోసం అమ‌రులైన యువ‌త‌కు కేసీఆర్ ఏం చేశార‌ని ప్ర‌శ్నించిన ఈశ్వ‌ర్.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువ‌త‌కు ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. ఏం చేశార‌ని కేసీఆర్ ముంద‌స్తుకు వెళుతున్నార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌తి ఒక్క‌రికి న్యాయం చేయాల‌న్న‌దే త‌న డిమాండ్ గా ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.