Begin typing your search above and press return to search.

మంత్రిగారి అవినీతి లెక్క ఆ కుర్రాడి దగ్గర ఉందా?

By:  Tupaki Desk   |   8 May 2016 10:07 AM IST
మంత్రిగారి అవినీతి లెక్క ఆ కుర్రాడి దగ్గర ఉందా?
X
మంత్రిగారి ఆక్రమ ఆస్తుల వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ ఓ కుర్రాడు సదరు మంత్రికే ఫోన్ చేయటం.. తన దగ్గర వివరాలు బయటపెట్టకుండా ఉండాలంటే రూ.30వేలు ఇవ్వాలంటూ బెదిరించిన అడ్డంగా బుక్ అయిన వైనం ఇప్పుడు చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అటవీశాఖామంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డికి ఒక యువకుడు ఫోన్ చేశారు. తన దగ్గర మంత్రి బొజ్జల అక్రమ సంపాదనకు సంబంధించిన వివరాలు ఉన్నాయంటూ బెదిరించాడు.

తన దగ్గర ఉన్న వివరాలు వెల్లడించకుండా ఉండాలంటే రూ.30వేలు ఇవ్వాలంటూ బేరం పెట్టాడు. తనకొచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి బొజ్జల. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మంత్రికి బెదిరింపు ఫోన్ కాల్ చేసిన జగన్ రెడ్డి అనే యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించిన సమయంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల జగన్ రెడ్డి హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మంత్రిని బెదిరించి డబ్బులు తీసుకోవాలన్నది అతడి ప్లాన్ గా తేల్చారు. చిత్రమైన విషయం ఏమిటంటే..మంత్రిస్థాయి వ్యక్తి అవినీతి లెక్కకు రూ.30వేలు అడుగుతారా? ఇవాల్టి రోజుల్లో రూ.30వేలకు ఉన్న విలువ ఏ పాటిది? ఈ చిన్న పాయింట్ చాలు.. ఫోన్ చేసిన వ్యక్తి దగ్గర వివరాలు ఉన్నాయా? లేదా? అనటానికి. అయినా.. మంత్రి తప్పుడు చిట్టాను బయటపెడతానంటూ ఫోన్ చేసి.. తానే చిల్లర పనికి దిగటాన్ని ఏమనాలి? ఇలాంటి బ్లాక్ మొయిల్ గాళ్లను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది.