Begin typing your search above and press return to search.

ఆ దేశాధ్యక్షుడికి షాకిచ్చిన యూట్యూబ్.. వీడియోల్ని తీసేసింది

By:  Tupaki Desk   |   23 July 2021 3:24 AM GMT
ఆ దేశాధ్యక్షుడికి షాకిచ్చిన యూట్యూబ్.. వీడియోల్ని తీసేసింది
X
ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో మీడియాను ఎప్పుడో దాటేశాయి సోషల్ మీడియా.. వాట్సాప్.. యూట్యూబ్ లు. నిజానికి మీడియా సైతం.. డిజిటల్ కంటెంట్ మీదనే నడుస్తోంది. ఆ మాటకు వస్తే ప్రభావితం అవుతోంది. వైరల్ అయిన ఉదంతాలకు ప్రాధాన్యతను గుర్తించటం.. వైరల్ అయిన వీడియోల సమాచారాన్ని పొందుపర్చటం.. లేదంటే తమ స్టోరీల్లో కోట్ చేయటం సర్వసాధారణం అవుతోంది. దీంతో.. ఈ డిజిటల్ ప్లాట్ ఫాం మీద ఉండే కంటెంట్ విశ్వసనీయత.. సెన్సార్ షిప్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటివేళ.. సదరు ఫ్లాట్ ఫాంలకు సంబంధించి.. ఆయా యాజమాన్యాలే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఆ తీరు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదంగా మారటంతో పాటు.. పెను సంచలనానికి తెర తీస్తోంది. తాజాగా యూట్యూబ్ అదే బాటలో పయనించింది. ఒక దేశాధ్యక్షుడి వీడియోల్ని డిలీట్ చేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

దేశాధ్యక్షుడి వీడియోల్ని డిలీట్ చేయటం అంటే.. అదెంత పెద్ద విషయమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న కాలంలో.. ఇలాంటి నిర్ణయాలు సాహసోపేతమే కాదు.. వ్యాపార ప్రయోజనాల్ని సైతం పట్టించుకోని తత్త్వం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. ఇంతకీ ఆ దేశాధ్యక్షుడు ఎవరు? అతడేం తప్పు చేశాడు? యూట్యూబ్ అంత పెద్ద నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది? లాంటి సందేహాలకు సమాధానాలు వెతికితే.. బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్బొల్సనారోకు సంబంధించిన కొన్ని విడియోల్ని యూట్యూబ్ తొలగించింది.

కరోనాకు సంబంధించిన ఆయన పేర్కొంటున్న వివరాలు.. చెబుతున్న మాటలు.. ఇస్తున్న సందేశాలు తప్పుడు మార్గంలోకి పయనించేలా చేయటమే దీనికి కారణంగా చెబుతున్నారు. బ్రెజిల్ దేశాధ్యక్షుడి మాట.. చేతలు వివాదాస్పదంగా ఉంటాయన్న పేరుంది. దీనికి తగ్గట్లే కరోనా మీద ఆయన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తాయి. కరోనాను నియంత్రించటానికి హైడ్రాక్సీక్లోరోక్విన్ సరిపోతుందని ఆయన తేల్చేస్తుంటారు.ఈ ఔషధం దండగమారిదని తేలటంతో పాటు.. ఇది వాడితే భారీ సైడ్ ఎఫెక్టులు తప్పవన్న విషయాన్ని ఇప్పటికే పలువురు నిపుణులు స్పష్టం చేయటంతో పాటు.. దీని వినియోగాన్ని పలు దేశాలు ఇప్పటికే బ్యాన్ చేశాయన్నది మర్చిపోకూడదు.

అలాంటిది బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారో మాత్రం.. ఆ ఔషధానికి బ్రాండ్ అంబాసిడర్ లా మారి.. చేస్తున్న వీడియోలు ప్రజల్ని పక్కదారి పట్టించటమే కాదు.. వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందన్నది యూ ట్యూబ్ వాదన. అంతేకాదు.. యావత్ ప్రపంచమంతా కరోనాకు చెక్ పెట్టటానికి మాస్కుకు మించిన ఆయుధం లేదని స్పష్టం చేయటమే కాదు.. ఎలాంటి మాస్కులు వాడాలన్న అంశంపై శాస్త్రీయ వాదనలు ఎన్నో ఉన్నాయి.

అంతేకాదు.. మాస్కులు వినియోగిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి? లేని పక్షంలో జరిగే నష్టం ఏమిటన్న విషయాన్ని తెలియజేస్తున్న వైనానికి భిన్నంగా మాస్కు అసలు అవసరం లేదంటూ బ్రెజిల్ దేశాధ్యక్షుడి మాటల్ని యూటూబ్యూ తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. ఇలాంటి తప్పుడు కంటెంట్ ను అనుమతించటానికి తమ కంటెంట్ నిబంధనలు అనుమతించవని యూట్యూబ్ స్పష్టం చేస్తోంది. ఇలాంటి తప్పుడు మాటల్ని చెప్పే బ్రెజిల్ దేశాధ్యక్షుడి వీడియోల్ని తాము తొలగించాలన్న నిర్ణయాన్ని యూ ట్యూబ్ సమర్థించుకుంది.

తాము తీసుకున్న నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం కానీ.. మరెలాంటి ఐడియాలజీకి సంబంధించిన అంశాల ప్రభావం అస్సలు లేదని స్పష్టం చేసిన యూట్యూబ్.. తమ స్టాండర్డ్స్ కు ఏ మాత్రం తేడా వచ్చినా.. వాటి మీద వేటు వేయటానికి తాము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని తాజా నిర్ణయంతో స్పష్టం చేసిందని చెప్పాలి. బ్రెజిల్ దేశాధ్యక్షుల వారి పైత్యానికి నిదర్శనంగా మరికొన్ని అంశాల్ని కూడా చెబుతున్నారు. కరోనా తీవ్రంగా ప్రబలుతున్న వేళ.. సామాజిక దూరాన్ని పాటించకపోవటం.. లాక్ డౌన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం లాంటి వివాదాస్పద నిర్ణయాలు ఆయన నుంచి తరచూ వెలువడుతూ ఉంటాయి. దీంతో.. ఆయన వీడియోల్ని డిలీట్ చేస్తూ యూట్యూబ్ నిర్ణయంపై ఆయనెలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.