Begin typing your search above and press return to search.

ఈ యూట్యూబర్ నెల సంపాదన జస్ట్ రూ.కోటికి పైనే

By:  Tupaki Desk   |   12 April 2023 3:16 PM IST
ఈ యూట్యూబర్ నెల సంపాదన జస్ట్ రూ.కోటికి పైనే
X
అత్యుత్తమ విద్యా సంస్థలో చదువుకున్నా.. ఏ పెద్ద కంపెనీలోనూ అతను పని చేయటం లేదు. కానీ.. చాలామంది కంటే చాలా.. చాలా ఎక్కువగా సంపాదిస్తుంటాడు. ఇంతకూ అతడేం చేస్తాడంటారా? జస్ట్.. యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంటాడు. అదేనండి.. యూట్యూబర్. అలా అని అతన్ని తక్కువగా అంచనా వేస్తే.. మొదటికే మోసం. ఎందుకంటే.. అతని నెల సంపాదన జస్ట్ కోటి రూపాయిలు మాత్రమే. దుబాయ్ లో నివసించే ఆ భారతీయుడి పేరు గౌరవ్ చౌదరి అలియాస్ టెక్నికల్ గురూజీ.

మన దేశంలో ఎక్కువగా టెక్నికల్ అప్డేట్స్ కోసం ఆధారపడే వారిలో ఇతడు ముందుంటారు. రెండు యూట్యూబ్ చానల్స్ ను నడిపే ఇతని నెలసరి సంపాదన జస్ట్ కోటిరూపాయిలకు పైనే ఉంటుందని చెబుతారు. గౌరవ్ చౌదరి, టెక్నికల్ గురూజీ పేరుతో రెండు యూట్యూబ్ చానళ్లు నిర్వహించే అతనికి సుమారుగా 27మిలియన్స్ ఫాలోవర్లు ఉన్నారు. అంటే.. 2.70కోట్ల మంది ఫాలోవర్స్ అన్న మాట. ప్రపంచంలో అతి పెద్ద టెక్ చానళ్లలో ఇతనిదొకటి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం అంటే 2015లో ఇతను తన యూట్యూబ్ చానల్ ను ప్రారంభించాడు.

రాజస్థాన్ లోని అజ్మీర్ లో 1991లో జన్మించిన ఇతడు.. బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్ లో మెక్రో ఎలక్ట్రానిక్స్ లో డిగ్రీని పూర్తి చేశాడు. యూట్యూబ్ చానల్ ను ప్రారంభించిన అతి తక్కువ వ్యవధిలోనే ఇతను విజయం సాధించాడు. యూట్యూబర్ గా భారీగా సంపాదిస్తూనే.. మరోవైపు దుబాయ్ పోలీసులకు ఇతను సాంకేతికసాయం చేస్తుంటాడు.

దుబాయ్ పోలీసులకు.. ఇతర సంస్థలకు సెక్యూరిటీ సామాగ్రిని సరఫరా చేస్తుంటారు. దుబాయ్ పోలీస్ సర్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఇంజనీర్ గా చెబుతుంటారు. ఇక.. ఇతగాడి సంపాదన.. ఆస్తుల గురించి తెలిస్తే నోట మాట రాదంతే.

యూట్యూబర్ గా వ్యవహరిస్తూ ఇతను భారీగా పోగేశాడు. దుబాయ్ లో ఇతనికి రూ.60కోట్ల విలువైన ఇల్లు ఉంది. అత్యంత ఖరీదైన.. విలాసవంతమైన 11 కార్లు ఇతని సొంతం. ఇందులో రూ.8కోట్లు విలువచేసే రోల్స్ రాయిస్ ఘోస్ట్.. మెక్ లారెన్ జీటీ.. రేంజ్ రోవర్ వోగ్.. పోర్స్చే లాంటి కార్లు ఉన్నాయి. ఇతని వద్ద ఉన్న కార్లలో మహీంద్రా థార్ కూడా ఉండటం గమనార్హం.

మన రూపాయిల్లో చెప్పాలంటే ఇతని ఆస్తి రూ.369 కోట్లు. అందరూ అనుకోవచ్చు.. యూట్యూబర్ గా ఉండి ఇంత సంపాదించొచ్చా? అంటే.. యూట్యూబర్ గానే కాదు.. దాని ద్వారావచ్చే పేరు ప్రఖ్యాతులతో అతని ప్రతిభ అందరికి తెలియటంతో ఇతర అవకాశాలు అతనికి మెండుగా ఉంటాయి. అతని ఇన్ స్టాలోనూ ఫాలోవర్స్ మిలియన్ కు పైనే (10లక్షలకు పైనే) ఉండటం గమనార్హం. టెక్ ప్రపంచంలో టెక్నాలజీ అప్డేట్స్ అందిస్తున్నా.. కోట్లు సంపాదించొచ్చన్న మాట. నోట్ దిస్ పాయింట్.