Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు 100 రోజులు!

By:  Tupaki Desk   |   28 Feb 2018 5:40 AM GMT
జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు 100 రోజులు!
X
ఏపీ స‌ర్కారు చేప‌డుతున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాలతో న‌ష్ట‌పోతున్న సీమాంధ్రుల హ‌క్కుల కోసం.. వారికి న్యాయం జ‌ర‌గాల‌న్న ఆవేద‌న‌.. ప్ర‌జ‌ల్ని చైత‌న్యం ప‌ర్చ‌టానికి.. ఏపీ రూపురేఖ‌లు మార్చే ప్ర‌త్యేక‌హోదాను సాధించాల‌న్న ధృడ ల‌క్ష్యంతో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మొద‌లు పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్రకు నేటితో వంద‌రోజులైంది. గ‌డిచిన వంద రోజుల్లో ఏపీలోని 13 జిల్లాల్లో ఇప్ప‌టికి ఆరుజిల్లాల్లో న‌డిచారు. ఇప్ప‌టికి 39 బ‌హిరంగ స‌భ‌ల్లో మాట్లాడిన జ‌గ‌న్ అలుపెర‌గ‌ని సైనికుడిలా ప‌ని చేస్తున్నారు.

వెళ్లిన ప్ర‌తిచోట జ‌న‌నీరాజ‌నంతో పాటు.. త‌మ అండ ఉంద‌ని చెబుతున్న వైనం జ‌గ‌న్‌కు స‌రికొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. వెళ్లిన ప్ర‌తిచోట ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌టంతో పాటు.. బాబు స‌ర్కారు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. ఇప్ప‌టికి 43 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో యాత్ర సాగింది. వంద రోజుల్లో 1350 కిలోమీట‌ర్ల న‌డ‌క‌ను పూర్తి చేశారు జ‌గ‌న్.

గ‌త ఏడాది న‌వంబ‌రు 6న మొద‌లైన పాద‌యాత్ర‌.. ఆరోగ్యం బాగోలేకున్నా.. ఇత‌ర‌త్రా కార‌ణాలు ఎదురైనా జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గ‌లేదు. త‌న న‌డ‌క‌ను ఆప‌లేదు. కేసుల బూచీ వెంటాడుతున్నా వెర‌వ‌క.. ప్ర‌జల ప్ర‌యోజ‌నాల కోసం విప‌రీతంగా త‌పిస్తున్నారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాను సాధించుకోవాల‌ని.. ప్ర‌తి నిరుద్యోగికి ఉద్యోగం ద‌క్కేలా చూడాల‌ని.. రైత‌న్న‌కు వ్య‌వ‌సాయం పండ‌గా మార‌ల‌ని.. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల్లో భ‌రోసా క‌ల్పించాల‌ని..నిరుపేద‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోవ‌ట‌మే త‌న ధ్యేయంగా జ‌గ‌న్ చెబుతున్నారు.

తాను న‌మ్మిన దాని కోసం గ‌డిచిన వంద రోజులుగా ఆయ‌న తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాదిరి త‌న‌కు కాసుల క‌క్కుర్తి లేద‌ని.. ఆయ‌న మాదిరి తాను కేసుల‌కు భ‌య‌ప‌డే వ్య‌క్తిని కాద‌న్నారు. తాను చ‌నిపోయిన త‌ర్వాత కూడా ప్ర‌తి పేదోడి గుండెల్లో బ‌త‌కాల‌న్న క‌సి.. ప్ర‌జ‌ల మ‌ధ్య అప్యాయ‌త‌లు పెంచాల‌న్న‌దే త‌న కోరిక ఉంద‌ని చెప్పారు. జ‌గ‌న్ పాద‌యాత్ర వందో రోజుకు చేరుకునేస‌రికి ప్ర‌స్తుతం ఆయ‌న ప్ర‌కాశం జిల్లా కొండేపి నియోజ‌క‌వ‌ర్గం ఉప్ప‌ల‌పాడులో ఉన్నారు.

క‌డ‌ప జిల్లా పులివెంద‌ల నియోజ‌క‌వ‌ర్గం ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన జ‌గ‌న్ పాద‌యాత్ర 100 కిలో మీట‌ర్లు చేరుకునేస‌రికి క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోని చాగ‌ల‌మ‌ర్రికి చేరుకోగా.. 200 కిలోమీట‌ర్లు అదే జిల్లాలోని డోన్‌.. 300 కిలోమీట‌ర్లు ఆ జిల్లాలోని ఎమ్మిగ‌నూరు లోని కారుమంచికి చేరింది.

400 కిలోమీట‌ర్లు పూర్తి అయ్యేస‌రికి అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంలోని గుమ్మేప‌ల్లికి చేరుగా.. 500.. 600 కిలోమీట‌ర్లు అదే జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం.. క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలోని క‌టారుప‌ల్లి క్రాస్ రోడ్స్ కు చేరుకుంది. 700 కిలోమీట‌ర్ల మైలురాయి చేరుకునేస‌రికి చిత్తూరు జిల్లా పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలోని చింత‌ప‌ర్తి శివారుకు చేరుకోగా.. 800 కిలోమీట‌ర్లు అదే జిల్లాలోని గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని న‌ల్ల‌వెంగ‌న‌ప‌ల్లికి చేరింది. 900 కిలోమీట‌ర్లకు చేరుకునేస‌రికి చిత్తూరు జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలోని చెర్లోప‌ల్లి హ‌రిజ‌న వాడ‌కు చేరుకోగా వెయ్యి కిలోమీట‌ర్ల మైలురాయిని నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం సైదాపురానికి చేరుకుంది. 1100 కిలోమీట‌ర్లు అదే జిల్లాలోని ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలోని క‌లిగిరికి చేరుకోగా.. 1200 కిలోమీట‌ర్లు ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలోని రామ‌కృష్ణాపురానికి చేరింది. 1300 కిలోమీట‌ర్లకు పాద‌యాత్ర పూర్తి అయ్యేనాటికి అదే జిల్లాలోని క‌నిగిరి మండ‌లం నంద‌న‌మారెళ్ల నియోజ‌క‌వ‌ర్గానికి చేరుకున్నారు. రోజుల త‌ర‌బ‌డి న‌డుస్తున్నా.. వంద‌ల కిలోమీట‌ర్లు సాగుతున్నా.. మొద‌టిరోజు ఉత్సాహం నేటికీ కొన‌సాగ‌టం ఒక ఎత్తు అయితే.. కుటుంబానికి దూరంగా.. ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా సాగుతున్న ఆయ‌న ప్ర‌జాయాత్రకు ప్ర‌జాద‌ర‌ణ అంత‌కంత‌కూ పెరుగుతుంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.