Begin typing your search above and press return to search.

బెస్ట్ సీఎం సర్వేలో 4 వ స్థానం !

By:  Tupaki Desk   |   25 Jan 2020 5:37 AM GMT
బెస్ట్ సీఎం సర్వేలో 4 వ స్థానం !
X
దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అతికొద్ది మంది ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముందు వరుసలో నిలిచారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ రోజుల్లోనే అనేక ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సీఎంగా జగన్ రికార్డ్ సృష్టించారు. ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట జాతీయ స్థాయిలో ఈ నెలలో నిర్వహించిన పోల్‌ సర్వేలో వైఎస్‌ జగన్‌ ‘బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం’ల జాబితాలో నాలుగో స్థానాన్ని సాధించారు. ఈ వార్త తెలియగానే వైసీపీ శ్రేణులు సంబరాలు మొదలుపెట్టారు.

ఏపీలో మూడు రాజధానులు అంటూ జగన్ తుగ్లక్ పాలన చేస్తున్నాడంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో ఈ పోల్ సర్వే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సర్వేలో మొదటి స్థానం లో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ , రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ , పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ , మూడో స్థానంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ , నాలుగో స్థానంలో ఏపీ సీఎం జగన్ నిలిచారు.

గత ఏడాది మే 30న ఏపీ ముఖ్యమంత్రి గా జగన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మేనిఫెస్టోలో ప్రకటించిన పలు పధకాలను తొలి ఆరు నెలల్లోనే అమలు ప్రారంభించారు. ఒక వైపు వివాదాలు చుట్టుముట్టుతున్నా కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి పధకాల అమలు కొనసాగించారు. అమ్మఒడి, నాడు–నేడు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం, వైఎస్సార్‌ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన , ఆరోగ్యశ్రీ, తదితర అనేక పథకాల తో పాటు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.

ఈ ‘బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం’ సర్వేలో 2016 నుంచి ఉన్న ట్రెండ్స్‌ కూడా పొందుపరిచారు. యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌కు సంబంధించి 2017 ఆగస్టు నుంచి, అరవింద్‌ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీష్‌కుమార్, నవీన్‌ పట్నాయక్‌లకు సంబంధించి 2016 ఫిబ్రవరి నుంచి వారి పెర్‌ఫార్మెన్స్‌ను చూపించారు. ప్రస్తుతం ఏపీ లో మూడు రాజధానుల అంశం పైన అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా మార్చుకొని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సమయంలో ఇండియా టూడే మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట నిర్వహించిన సర్వేలో బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎంగా జగన్ కు నాలుగో స్థానం దక్కటంతో..ఇప్పుడు వైసీపీ ఈ అంశాన్ని తమ అనకూల ప్రచారాస్త్రంగా మలచుకొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.