Begin typing your search above and press return to search.

ప‌త్తికొండ అభ్య‌ర్థిగా శ్రీ‌దేవి..జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   25 Nov 2017 3:17 PM GMT
ప‌త్తికొండ అభ్య‌ర్థిగా శ్రీ‌దేవి..జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి త‌న పాద‌యాత్ర‌ను ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాల‌కు వేదిక‌గా మార్చుతున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర చేస్తోన్న వైఎస్ జ‌గ‌న్ 2019 ఎన్నిక‌లకు త‌గిన ప్ర‌ణాళిక‌లు, ఆచ‌ర‌ణ‌ల‌ను అమ‌ల్లో పెడుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఇందుకు సంబంధించిన మ‌రో మందుడుగు వేశారు. ప‌త్తికొండ నుంచి స్థానిక నాయ‌కురాలు శ్రీదేవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గ అభ్య‌ర్థిగా నిలుపుతాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. త‌ద్వారా 2019ఎన్నికల తొలి అభ్యర్థిని ఆయన ఇప్పుడే ప్రకటించారు.

పాద‌యాత్ర సంద‌ర్భంగా శ్రీదేవిని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన వైఎస్ జ‌గ‌న్ అనంత‌రం మాట్లాడుతూ శ్రీ‌దేవి భ‌విష్య‌త్తును ఇక‌ ప్ర‌జ‌ల‌ చేతుల్లో పెడుతున్నాన‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ఈ ప్రాంతంలో గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చెరుకుల‌పాడు నారాయ‌ణ రెడ్డి అనంత‌రం వైసీపీలో చేరారు. అయితే, ఈ ఏడాది మే 21న ఆయ‌న హ‌త్య‌కు గుర‌య్యారు. దీంతో ఈ నియోజ‌క వ‌ర్గంలో శ్రేదేవిని దింపాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ప‌త్తికొండ‌లో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి కేఈ కృష్ణ‌మూర్తి గెలుపొందిన విష‌యం తెలిసిందే. మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆయన సోదరుడు ప్రభాకర్‌లకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గంపై వైసీపీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతోనే జగన్.. ముందుగానే తమ అభ్యర్థిగా శ్రీదేవిని ప్రకటించినట్లు తెలుస్తోంది.

కాగా, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర సంద‌ర్భంగా మ‌హిళ‌లు, యువ‌త‌, ముస్లింల‌తో వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం అయ్యారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సహకారం, బ్యాంకు రుణాలు గురించి మహిళలను వైఎస్‌ జగన్ అడిగి తెలుసుకున్నారు. రుణాలు అందుతున్నాయా లేదా అని ప్రశ్నించారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం వచ్చిందా లేదా అని అడిగారు. దీనికి రుణాలు అందలేదని..బంగారం బ్యాంకులోనే ఉందని ముక్తకంఠంతో చెప్పారు. చంద్రబాబు నిలువునా ముంచేశారని వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సున్నా, పావలా వడ్డీలు రావడం లేదని వివరించారు. తమను టీడీపీ ప్రభుత్వం పూర్తిగా దగా చేసిందని మైనార్టీ సోదరులు ప్రతిపక్షనేతకు విన్నవించుకున్నారు. రిజర్వేషన్‌తో పాటు మసీదుల్లో పనిచేసే వారికి ఇచ్చే జీతాల విషయంలో కూడా మోసం చేశారని తెలిపారు. విద్యుత్‌ శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కూడా జగన్‌ను కలిశారు. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. వీరి స‌మ‌స్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అధైర్యపడొద్దని వైఎస్ జ‌గ‌న్ భరోసా ఇచ్చారు. ముస్లిం సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని, తాము అధికారంలోకి వస్తే ఇమామలకు నెల నెలా రూ. 10 వేల ఇస్తామని, అదే విధంగా చర్చి, మసీద్, దేవాలయాలకు నెలకు రూ. 15 వేలు ఇస్తామన్నారు.

ఉపాధి హామీలో జరుగుతున్న అవినీతి దేశంలో ఎక్కడా జరగడం లేదని జ‌గ‌న్ ఈ సంద‌ర్భంగా ఆరోపించారు. దివంగ‌త వైఎస్సార్‌ హయాంలో ఆ పథకం నిధుల్లో 97 శాతం కూలీలకు కేటాయించారుని...దీంతో అందరికీ పనులు దొరికేవని అన్నారు. ``దివంగ‌త వైస్సార్ హ‌యాంలో. అందరికీ తిండి దొరికేది. కానీ ఇవాళ పనులను యంత్రాలతో చేస్తున్నారు. ఇదే డబ్బుతో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. సిమెంటు రోడ్లు వేయడం తప్పు కాదు కానీ, ఆ పేరుతో కూలీల కడుపు కొడుతున్నారు. అంత దారుణంగా మారింది ఈ ప్రభుత్వ పనితీరు. ఇక్కడి అవినీతి చూసి చివరకు కేంద్రం కూడా భయపడుతోంది.`` అని వ్యాఖ్యానించారు. ధరల స్థిరీకరణ నిధి రూ.5 వేల కోట్లతో ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పారని కానీ దాన్ని తుంగ‌లో తొక్కేశార‌న్నారు. `అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ బాబు ఏం చేశారు. మొత్తం దళారులకు అమ్మేశారు. ఎందుకంటే ఆయన కూడా ఒక దళారి కాబట్టి. ఆయనకు ఓ మార్కెట్‌ ఉంది. హెరిటేజ్‌ అని. దాని కోసం దళారులంతా ఒక్కటై.. తక్కువ ధరకు పంటలు కొంటున్నారు. అవి హెరిటేజ్‌కు చేరగానే, వాటి ధరలు పెరుగుతున్నాయి` అని మండిప‌డ్డారు. సమాజంలో ప్రతి పని విజయవంతం కావడానికి దేవుడి కరుణ,కటాక్షాలు అవసరమన్నారు. దేవుడి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండే విధంగా పరిపాలన చేస్తామన్నారు.