Begin typing your search above and press return to search.

కేసీఆర్ తో పోల్చితే జగనే గ్రేట్..

By:  Tupaki Desk   |   10 Jun 2019 9:40 AM GMT
కేసీఆర్ తో పోల్చితే జగనే గ్రేట్..
X
కేసీఆర్, జగన్ ఇప్పటికైతే ఇద్దరు మంచి ఫ్రెండ్లీ సీఎంలు.. కేసీఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉండగా.. జగన్ ఏపీలో సీఎం అయ్యాడు. ఎన్నికలకు ముందే జగన్ - కేసీఆర్ స్నేహగీతం ఆలపించారు. జగన్ గెలుపులో కేసీఆర్ సైతం తన వంతు పాత్రను పోషించాడు..

అయితే జగన్ గద్దెనెక్కగానే పాలన మీదే దృష్టి పెట్టాడు. సంక్షేమ పథకాలను అందించే నవరత్న పథకాలకు మెరుగులు దిద్దుతున్నాడు. అధికారుల బదిలీలు.. పాలనా సంస్కరణలు..మంత్రి వర్గ విస్తరణ ఇలా అన్నీ పూర్తి చేసి దిగ్విజయంగా ప్రభుత్వ చక్రాలను పట్టాలెక్కించాడు.. మంత్రివర్గ విస్తరణలో తన రెడ్డి సామాజికవర్గాన్ని పక్కనపెట్టి బీసీలు- ఎస్సీలు- ఎస్టీలకు పెద్ద పీట వేశారు.

రెండు రాష్ట్రాల్లో ఇద్దరి పాలనలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించలేదు. అల్లుడు హరీష్, కేటీఆర్ లను తీసుకోలేదు. పైగా తెలంగాణ తొలి కేబినెట్ లో చోటు దక్కని మహిళలకు ఈసారి కూడా కేసీఆర్ స్థానమివ్వలేదు. అయినా కేసీఆర్ పాలన నడుస్తోంది.

వీరిద్దరి పాలనలో ఎవరు బెస్ట్ అనేది కుండబద్దలు కొట్టారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. రాజకీయాల్లో అపార అనుభవం ఉందని చెప్పుకొనే కేసీఆర్ కంటే ఎలాంటి అనుభవం లేని జగన్ వెయ్యిరెట్లు బెటర్ అని సంచలన కామెంట్స్ చేశారు. అన్ని సామాజికవర్గాలను మంత్రివర్గంలోకి తీసుకున్న జగన్.. తన కేబినెట్ లో మహిళలను తీసుకొని ఏకంగా హోమంత్రి పదవి ఇవ్వడం గొప్ప విషయమన్నారు. కేసీఆర్ మాత్రం మహిళలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ ఒక్క దళితుడికే మంత్రిపదవి ఇస్తే.. జగన్ ఐదుగురికి ఇచ్చాడని.. దళిత సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పాడని మందకృష్ణ నిప్పులు చెరిగారు. ఇలా కేసీఆర్ కంటే జగనే బెటర్ సీఎం అని మందక్రిష్ణ చెప్పిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.