Begin typing your search above and press return to search.

సంతృప్తి-అసంతృప్తుల కేబినెట్ రాజ‌కీయం!

By:  Tupaki Desk   |   27 Sept 2021 10:13 PM IST
సంతృప్తి-అసంతృప్తుల కేబినెట్ రాజ‌కీయం!
X
త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు.. కాదు కాదు.. మొత్తం మంత్రి వ‌ర్గాన్నే మార్చేందుకు సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారని.. స్వ‌యం గా మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డే ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి సీనియ‌ర్ల‌ను త‌న కేబినెట్‌లో ఉంచుకుని.. మిగిలిన వారిని ప‌క్క‌న పెడ‌తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే.. కేబినెట్ కూర్పు.. చేర్పుల‌పై స‌ర్వాధికారాలు... ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్‌కే ఉంటాయి కాబ‌ట్టి ఈ విష‌యంలో ఎవ‌రూ ప్ర‌శ్నించే అవ‌కాశం లేదు. కానీ, వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ప్ర‌భుత్వ‌మూ కూడా ఇలా మ‌ధ్యంత‌రంగా.. పూర్తిస్థాయిలో కేబినెట్‌ను మార్చిన ప‌రిస్థితి కేంద్రం నుంచి రాష్ట్రాల వ‌ర‌కు.. జ‌ర‌గలేదు. కానీ. ఇప్పుడు తొలిసారి.. జ‌గ‌న్ ఈ రికార్డును కూడా సాధించ‌నున్నారు.

ఇదే ఇప్పుడు.. రాజ‌కీయ చ‌ర్చ‌కు దారితీసింది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలోనే ఈ చ‌ర్చ జోరుగా సాగుతోంది. ప్ర‌ధానంగా.. ఈ రేంజ్‌లో కేబినెట్‌ను పూర్తిగా ఎందుకు మారుస్తున్నారంటే.. కొంద‌రిని సంతృప్తి ప‌ర‌చ‌డానికి అనే స‌మాధానం అధిష్టానం నుంచి వినిపిస్తోంది. గ‌త 2019లో వైసీపీ స‌ర్కారు ఏర్పాటు చేయ‌డంలో అంద‌రూ శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేశారు. దీనికి జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. ఒక్క ఛాన్స్ వంటివి క‌లిసి వ‌చ్చాయి. అయితే.. కేబినెట్‌లో మాత్రం సంఖ్య ప్ర‌కారం 25కు మించ‌రాదు క‌నుక‌.. తను మిన‌హా మిగిలిన వారికి సోష‌ల్ ఇంజ‌నీరింగ్ ప్ర‌కారం ప‌ద‌వులు కేటాయించారు. ఇంత‌వ‌ర‌కు బాగానేఉంది. అయితే.. ఇప్పుడు మిగిలిన వారిని సంతృప్తి ప‌ర‌చ‌డం అనే కార్యక్ర‌మంలో భాగంగా.. ఇప్పుడు మ‌రోసారి పూర్తిగా కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేస్తున్నారు.

మ‌రి ఇప్పుడు ఎంత మందిని సంతృప్తి ప‌రుస్తారు? అనేది కీల‌క ప్ర‌శ్న. ఇలా చూసుకున్నా.. ఇప్పుడుకూడా మ‌రో 24 మందికి త‌ప్ప అవ‌కాశం లేదు. మ‌రి మిగిలిన అసంతృప్తుల ప‌రిస్థితి ఏమిటి? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే.. చాలా మంది రెడ్డి వ‌ర్గం నాయ‌కులే.. ఎక్కువ‌గా ప‌ద‌వులు ఆశిస్తున్నారు. అదేస‌మ‌యం క‌మ్మ వ‌ర్గానికి చెందిన ఒక‌రిద్ద‌రికి జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వుల ఆశ చూపారు. వీరిలో చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ప్ర‌ముఖంగా క‌నిపిస్తున్నారు. అదేస‌మ‌యంలో తాను పార్టీకోసం అనేక త్యాగాలు చేశాన‌ని.. ఏడాది పాటు స‌భ నుంచి స‌స్పెండ్ చేసినా.. త‌ను పార్టీ కోసం ప‌నిచేశాన‌ని చెబుతున్న రోజా రెడ్డి ప‌రిస్థితి ఏంటి? మ‌రోవైపు రాజ‌ధాని న‌గ‌రం మంగ‌ళ‌గిరికి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి కూడా వేచి చూస్తున్నారు. మ‌రి వీరికి అవ‌కాశం ఇస్తారా?

అదేస‌మ‌యంలో తూర్పు గోదావ‌రి నుంచి కూడా చాలా మంది నాయ‌కులు జ‌క్కంపూడి రాజా కావొచ్చు.. యువ నేత‌లు చాలా మంది ఎదురు చూస్తున్నారు. మ‌రి వీరిని సంతృప్తి ప‌రిచేది ఎలా? అంటే.. వీరికి ఎలాంటి ప‌ద‌వులు ద‌క్క‌వనే చెబుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఒక‌రిని సంతృప్తి ప‌ర‌చాలి.. మ‌రొక‌రి అసంతృప్తి త‌గ్గించాలి! అనే వ్యూహం జ‌గ‌న్‌కు ఏమాత్రం లేద‌ని.. సీనియర్ నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు. కేబినెట్ మార్పు కేవ‌లం ఓ రాజ‌కీయ ఎత్తుగ‌డ‌గా చెబుతున్నారు. త‌న హ‌యాం లో ఏదైనా నిర్ణ‌యం తీసుకునే సాహ‌సం త‌న‌కు ఉంద‌ని.. చెప్పుకొనేందుకు.. పార్టీపై ప‌ట్టు పెంచుకుంటున్నాన‌నే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిం చేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు. అంత‌కుమించి.. ఎక్క‌డా సంతృప్తి ప‌రుద్దామ‌ని.. అసంతృప్తుల‌ను బుజ్జ‌గిద్దామ‌ని.. జ‌గ‌న్‌కు లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు.

`సంతృప్తి`, త‌న‌కుసేవ చేసిన వారికి `గుర్తింపు`, పార్టిని నిల‌బెట్టిన వారికి `ప‌ద‌వులు` ఇవ్వాలంటే.. ఫ‌స్ట్ త‌న కుటుంబంలోని త‌ల్లీ, చెల్లికే ఇవ్వాల‌ని.. కానీ, వారిని ప‌ట్టించుకోలేదు కాబ‌ట్టి.. ప్ర‌స్తుత మార్పు కూడా కేవ‌లం.. త‌న హ‌వాను ప్ర‌ద‌ర్శించేందుకు.. త‌న మాట నెగ్గించుకునేందుకు.. త‌న నాయ‌క‌త్వాన్ని ప్రొజెక్టు చేసుకునేందుకు, ప్ర‌జ‌ల్లో పొలిటిక‌ల్ సింప‌తీ పెంచుకునేందుకు జ‌గ‌న్ చేస్తున్న రాజ‌కీయాల్లో ఒక భాగ‌మ‌ని సీనియ‌ర్లే పెద‌వి విరుస్తుండ‌డం ఇప్పుడు వైసీపీలో చ‌ర్చ‌కు దారితీస్తుండ‌డం గ‌మ‌నార్హం.