Begin typing your search above and press return to search.

మేనిఫెస్టోలు అమలు చేయకపోతే ప్రభుత్వాలను గద్దెదించేసే చట్టం

By:  Tupaki Desk   |   24 March 2019 8:29 AM GMT
మేనిఫెస్టోలు అమలు చేయకపోతే ప్రభుత్వాలను గద్దెదించేసే చట్టం
X
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోల్లో పేర్కొన్న హామీల్లో ఎన్ని అమలవుతున్నాయి ఎన్ని అమలు కావడం లేదన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలు మోసపోతున్నారు. కానీ, ఇకపై ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి అంటున్నారు. అధికారంలోకి వచ్చిన పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆ పార్టీ మేనిఫెస్టోను అమలు చేసేలా చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే పార్టీలు, నేతలకు జవాబుదారీతనం ఉంటందన్నారు.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఎన్నికల ప్రచార సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని.. మేనిఫెస్టోలో చెప్పినవి అమలు చేయలేకపోతే ఆ పార్టీ ప్రభుత్వంపై చర్యలు తీసుకునేలా చట్టం ఉండాలని అన్నారు. అంతేకాదు.. మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయలేని పక్షంలో ఆ ప్రభుత్వం రాజీనామా చేయాలని ఆయన సూచించారు. ఇందుకోసం ఒక చట్టం ఉండాలన్నారు.

పార్టీలన్నీ అవాస్తవ, అమలు సాధ్యం కాని హామీలతో జనాలను మభ్యపెడుతున్నాయని.. ఇలాంటి ధోరణి పోవాలంటే బలమైన చట్టం రావాలని జగన్ అన్నారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ వందలాది హామీలిచ్చి అనంతరం అన్నిటినీ విస్మరించిందని ఆయన ఆరోపించారు. కాపులకు ఏడాదికి వెయ్యికోట్లు నిధి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని.. కానీ, ఈ అయిదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం కాపుల సంక్షేమానికి కేవలం రూ1300 కోట్లే విడుదల చేసిందని జగన్ అన్నారు. డ్వాక్రా మహిళలకు, రైతులకు రుణ మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారని.. కానీ, అది కూడా అరకొరగానే చేసి మమ అనిపించారని అన్నారు. సరైన చట్టం ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండదని జగన్ అన్నారు.