Begin typing your search above and press return to search.

ఐదేళ్ల‌లో బాబుకు చేత‌కానిది చేసేస్తున్న జ‌గ‌న్‌!

By:  Tupaki Desk   |   25 Jun 2019 9:43 AM GMT
ఐదేళ్ల‌లో బాబుకు చేత‌కానిది చేసేస్తున్న జ‌గ‌న్‌!
X
ఐదేళ్ల బాబు పాల‌న‌ను ప్ర‌జ‌లు ఎందుకంత‌గా వ్య‌తిరేకించింది? చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనంత దారుణంగా టీడీపీకి ఓట‌మిని ఎందుకు అందించారు? ఆ ప్రాంతం.. ఈప్రాంతం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్ర‌జ‌లు బాబును ఎందుకు రిజెక్ట్ చేశారు? వైఎస్ జ‌గ‌న్ కు ఎందుకంత ఘ‌న విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు? లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు గ‌డిచిన నెల‌లో చూస్తున్నామ‌ని చెప్పాలి.

రాష్ట్ర విభ‌జ‌న‌ను ఏపీ ప్ర‌జ‌లు వ్య‌తిరేకించిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రం క‌లిసి ఉండాలంటూ పెద్ద ఎత్తున ఉద్య‌మాలు చేశారు. ఈ సంద‌ర్భంగా కొన్నిసార్లు క‌ట్టుత‌ప్పిన ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. రూల్ బుక్ లోని రూల్స్ కు త‌గ్గ‌ట్లుగా కేసులు బుక్ చేశారు పోలీసులు. న్యాయ‌మైన డిమాండ్ మీద ఉద్య‌మం చేసిన‌ప్పుడు.. ఆ కార‌ణంతో కేసులు బుక్ అయితే.. బాధితుల ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉంటుంది. ఇలాంటి కేసుల్ని మాఫీ చేసిన చంద్ర‌బాబు.. విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి జ‌రిగిన న‌ష్టంపై గ‌ళం విప్పుతూ హోదా కోసం ఉద్య‌మాలు చేశారు.

ఎన్నిక‌ల వేళ హోదా కోసం తానుమోడీ మీద వార్ చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు.. త‌న మాదిరే ముందు నుంచి హోదా కోరుకుంటూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం రోడ్ల మీద‌కు వ‌చ్చిన వారిపై పోలీసులు కేసులు న‌మోదు చేయ‌టం తెలిసిందే. ఇలాంటి వారిపై పెట్టిన కేసులపై నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉన్నా బాబు ప‌ట్టించుకోలేదు.

రాష్ట్రానికి.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మేలు జ‌ర‌గాల‌న్న స‌హృదయంతో ఉద్య‌మాలు చేసిన వారి ప‌ట్ల సానుకూలంగా స్పందించాల్సి ఉంది. కానీ.. అలాంటిదేమీ చేయ‌ని చంద్ర‌బాబు.. వారిపై కేసుల్ని అలా ఉంచేశారు. ఈ విష‌యంలో బాబు చేసిన త‌ప్పును స‌రిదిద్దేలా జ‌గ‌న్ తాజాగా నిర్ణ‌యించారు. హోదా స‌మ‌యంలో ఉద్య‌మాలు చేసిన వారిపై పెట్టిన కేసుల్ని ఎత్తివేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన ఐపీఎస్ అధికారుల స‌ద‌స్సులో స్ప‌ష్టం చేశారు. వెంట‌నే ఉద్య‌మ‌కారుల‌పై పెట్టిన ప్ర‌త్యేక హోదా కేసుల‌ను తీసివేయాల‌ని ఆదేశించారు. అంతేకాదు.. త‌ప్పు చేసినోళ్లు ఎంత‌టి వారైనా స‌రే స‌హించొద్ద‌ని.. పాల‌నా వ్య‌వ‌స్థ‌లో పోలీసులు.. ప్ర‌జాప్ర‌తినిదులు ముఖ్య‌మేన‌ని.. అలా అని చెడ్డ‌పేరు వ‌చ్చేలా ఎవ‌రూ చేయ‌కూడ‌ద‌న్నారు.
వ్య‌క్తిగ‌త ఇగోల‌ను ప‌క్క‌న పెట్టి ప‌ని చేయాల‌ని కోరారు.

దేశంలోనే ఏపీ పోలీస్ వ్య‌వ‌స్థ నెంబ‌ర్ వ‌న్ గా ఉండాల‌ని.. చ‌ట్టాల్ని అమ‌లు చేయ‌టంలో ఎమ్మెల్యేల్ని క‌లుపుకుపోవాల‌న్నారు. గ‌త ముఖ్య‌మంత్రి నివాసం స‌మీపంలోనే ఇసుక మాఫియా సాగింద‌ని.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఇసుక దోపిడీ అడ్డుకున్న మ‌హిళా ఎమ్మార్వో పై ఒక ప్ర‌జాప్ర‌తినిధి జ‌ట్టుప‌ట్టుకొని దాడి చేశార‌ని.. అలాంటి వాటి విష‌యంలో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఇది స‌రైన విధాన‌మా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. భూస‌మీక‌ర‌ణ పేరుతో భూములు ఇవ్వ‌ని రైతుల‌పై అక్ర‌మ కేసులు పెట్టార‌ని.. ఎమ్మెల్యేలే బ‌హిరంగంగా దందాలకు పాల్ప‌డిన విష‌యాన్ని గుర్తు చేశారు. గాంబ్లింగ్.. పేకాట క్ల‌బ్బుల‌కు ఎమ్మెల్యేలు స‌హ‌క‌రించార‌ని.. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై చ‌ర్య‌లు లేకుంటే నెంబ‌ర్ వ‌న్ పోలీసింగ్ ఎలా అవుతుంద‌న్నారు. విజ‌య‌వాడ‌లో కాల్ మ‌నీ.. సెక్స్ రాకెట్ పై ఎన్నిక కేసులు న‌మోద‌య్యాయ‌ని అడుగుతూ.. ఎంత‌మందిని అరెస్ట్ చేశార‌ని ప్ర‌శ్నించారు. తాజాగా స‌ద‌స్సు జ‌రుగుతున్న ప్ర‌దేశం కూడా అక్ర‌మ క‌ట్ట‌డ‌మేన‌ని.. ఇదే విష‌యాన్ని నిన్న‌టి స‌మావేశంలో కూడా చెప్పాన‌ని.. ప్ర‌భుత్వ‌మే అక్ర‌మ క‌ట్ట‌డాలు నిర్మిస్తే ఎలాంటి సంకేతాలు ఇచ్చిన‌ట్లు? అని ప్ర‌శ్నించారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఏపీ పోలీసింగ్ లో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చేలా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.