Begin typing your search above and press return to search.

సామాన్యుల‌కు అభ‌యం.. జ‌గ‌న్ ప్ర‌జాద‌ర్బార్!

By:  Tupaki Desk   |   13 Jun 2019 7:13 AM GMT
సామాన్యుల‌కు అభ‌యం.. జ‌గ‌న్ ప్ర‌జాద‌ర్బార్!
X
రెండు వారాలు కాలేదు జ‌గ‌న్ ఏపీకి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే పాల‌న‌లోనూ.. ప్ర‌జ‌ల్లోనూ త‌న‌దైన ముద్ర వేసిన ఆయ‌న వేగంగా నిర్ణ‌యాలు తీసుకునే సీఎంగా పేరు తెచ్చుకున్నారు. కీల‌క‌ అంశాల విష‌యంలో అదే ప‌నిగా నాన్చ‌కుండా.. సంబంధిత శాఖాధికారులతో సంప్ర‌దింపులు జ‌రిపి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. తండ్రి రాజ‌కీయాన్ని ఒంట‌బ‌ట్టించుకున్న జ‌గ‌న్‌.. ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేస్తుంటారు.

ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల క‌ష్ట‌న‌ష్టాల్ని తెలుసుకున్న ఆయ‌న‌.. ముఖ్య‌మంత్రి అయ్యాక కూడా సాధార‌ణ ప్ర‌జ‌ల్ని నిత్యం క‌లుసుకునేందుకు వీలుగా ప్ర‌జాద‌ర్బార్ ను స్టార్ట్ చేయాల‌ని సంక‌ల్పించారు. వైఎస్ హ‌యాంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేవారు. ప్ర‌తి ఉద‌యం ఆరుగంట‌ల‌కు సామాన్యుల్ని అర‌గంట పాటు నేరుగా క‌లుసుకునే ఆయ‌న‌.. వారి స‌మ‌స్య‌ల్ని విని.. అప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించే అవ‌కాశం ఉన్న అన్ని స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల‌ని ఆదేశాలు ఇచ్చేవారు.

వైఎస్ నిర్వ‌హించిన ప్ర‌జాద‌ర్బార్ కు విశేష ఆద‌ర‌ణ ఉండేది. విప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్ తాను ప్రాతినిధ్యం వ‌హించే పులివెందుల‌లో ప్ర‌జాద‌ర్బార్ ను నిర్వ‌హించారు. సీఎం హోదాలో ఇప్పుడు త‌న నివాసంలో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. వాస్త‌వానికి ప్ర‌జాద‌ర్బార్ ను ఎన్టీఆర్ షురూ చేశారు. ఆ త‌ర్వాత వైఎస్ త‌ప్ప ఇంకెవ‌రూ చేసింది లేదు.

వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత ముఖ్య‌మంత్రులు అయిన వారు.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రెండు రాష్ట్రాల‌కు సీఎంలుగా ఇద్ద‌రు చంద్రుళ్లు అయిన‌ప్ప‌టికీ ప్ర‌జాద‌ర్బార్ సంగ‌తి ప‌ట్టించుకునే వారు కాదు. అందుకు భిన్నంగా జ‌గ‌న్ తాను ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన రెండు వారాల్లోనే ప్ర‌జాద‌ర్బార్ ను పున‌రుద్ద‌రించాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. త‌న తండ్రి న‌డిచిన బాట‌లో న‌డుస్తున్న జ‌గ‌న్‌.. తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ఎంద‌రో సామాన్యుల‌కు ఆద‌ర‌వుగా మారుతుంద‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు.