Begin typing your search above and press return to search.

ఈ విషయంలో జగన్‌ ప్రభుత్వం కళ్లు తెరవాల్సిందేనా?

By:  Tupaki Desk   |   20 Dec 2022 1:30 PM GMT
ఈ విషయంలో జగన్‌ ప్రభుత్వం కళ్లు తెరవాల్సిందేనా?
X
ఆంధ్రప్రదేశ్‌ లో జగన్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది, ఇందుకు వేల కోట్ల రూపాయల వ్యయం చేస్తోంది. ఈ సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో తమకు విజయం సాధించి పెడతాయని జగన్‌ ప్రభుత్వం నమ్ముతోంది. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపేనని.. సంక్షేమ పథకాలతోనే ప్రజల జీవితాలు బాగుపడిపోవని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ లేదని.. కంపెనీలు సైతం రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి. పెట్టుబడులు, పరిశ్రమలు దూరమవుతున్నా ఏపీ ప్రభుత్వం మూగ పాత్ర పోషిస్తోందన్న విమర్శలున్నాయి.

ఉద్యోగాలు లేక చదువుకున్న యువత తీవ్ర నైరాశ్యంలో ఉందని చెబుతున్నారు. నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయని చెబుతున్నారు. దీని కారణంగా నిరుద్యోగం పెరిగిపోయిందని పేర్కొంటున్నారు. తాము చదివిన చదువులకు సరైన ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

స్వయంగా ఈ విషయాన్నే కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. తాజా పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇవ్వడం గమనార్హం.

2019లో ఆంధ్రప్రదేశ్‌లో 6,465 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2021లో ఈ సంఖ్య 8,067కి చేరుకుంది. కేంద్ర కార్మిక, ఉపాధి అభివృద్ధి శాఖ మంత్రి రామేశ్వర్‌ తెలి పార్లమెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇవి కేవలం అధికారిక లెక్కలే కావడం గమనార్హం. ఆత్మహత్యల సంఖ్య ఇతర కారణాల కంటే నిరుద్యోగం కారణంగానే ఎక్కువ కావడం విశేషం.

నిరుద్యోగంతోపాటు ఏపీలోని పేద, బడుగు, బలహీన, గిరిజన వర్గాలు సామాజిక అభద్రతను ఎదుర్కొంటున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఆదివాసీలు రోజు గడవాలంటేనే ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. గిరిజనులపై అఘాయిత్యాల సంఖ్య పెరిగిందని తాజా గణాంకాలు పేర్కొంటున్నాయి.

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన నివేదిక ప్రకారం.. గిరిజనులపై 2019లో 330 అట్రాసిటీ కేసులు నమోదు కాగా.. 2021లో మరో 361 కేసులు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. ఈ కేసులు ఏపీ హైకోర్టుకు చేరుతున్నా గిరిజనులకు సరైన న్యాయం జరగడం లేదని అంటున్నారు.

పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకుంటున్న జగన్‌ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం వెలువరించిన గణాంకాలు ఎదురుదెబ్బ అని భావిస్తున్నారు. ఈ విషయంలో జగన్‌ ప్రభుత్వం మేల్కోవాల్సిన తరుణమిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.