Begin typing your search above and press return to search.

'తాత్కాలిక' బాబు.. 'శాశ్వత' జగన్

By:  Tupaki Desk   |   27 Feb 2019 6:44 AM GMT
తాత్కాలిక బాబు.. శాశ్వత జగన్
X
ఎవరు లోకల్.. ఎవరు నాన్ లోకల్ తేలిపోయింది. ఐదేళ్లు పాలించినా ఇంకా ఏపీలో సొంతిళ్లు లేని చంద్రబాబు స్థానికుడా.? ఏపీ ప్రజలకు చేరువ అవుదామని రాజధాని అమరావతిలో ఈరోజు ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేసుకుంటున్న జగన్ స్థానికుడా తేలిపోయింది.

ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ ఈరోజు బుధవారం అమరావతి రాజధాని పరిధిలోని గుంటూరు జిల్లా తాడేపల్లి లో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి గృహ ప్రవేశం చేశారు. ఉదయం 8.19 గంటలకు వైఎస్ జగన్ - భారతి దంపతులు నూతన ఇంటిలోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ - షర్మిల-అనిల్ కుమార్ లతోపాటు వైసీపీ కీలక నేతలు - ఎంపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం వైసీపీ కేంద్ర కార్యాలయ నూతన భవనాన్ని కూడా జగన్ ప్రారంభించారు.

దీన్ని బట్టి జగన్... టీడీపీ అధినేత చంద్రబాబుకు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. ఇన్నాళ్లు జగన్ ను హైదరాబాద్ లో ఉండి ఏపీలో రాజకీయాలు చేస్తావా అన్నదానికి గట్టి సమాధానం ఇచ్చారు. నిజానికి వైఎస్ జగన్ ఇన్నాల్లు హైదరాబాద్ నివాసమున్నా.. ఆయన ఎక్కువకాలం ఉన్నది ఏపీలోనే.. పాదయాత్ర పేరుతో మూడేళ్లుగా ఏపీ లో ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటున్నారు.

కానీ చంద్రబాబు మాత్రం పాలన నుంచి ఆయన ఉంటున్న ఇల్లు దాకా అంతా తాత్కాలికంగానే నడిపించారు. అమరావతిలో చంద్రబాబు ఓ ప్రైవేటు ఎస్టేట్ ను అద్దెకు తీసుకొని ప్రభుత్వ సొమ్ము లక్షలు చెల్లిస్తూ ఉంటున్నారు. ఇక చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటూ హైదరాబాద్ లో విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారు. ఆయన కొంత ఇంటి నిర్మాణం అయ్యే వరకూ ఏపీ ప్రభుత్వ సొమ్ముతో చంద్రబాబు హైదరాబాద్ లో ఓ స్టార్ హోటల్ లో అద్దెకు ఉండడం విశేషం. అలాగే హైదరాబాద్ లోని బాబు నివాసం రిపేర్లకు ఏపీ ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు కూడా విడుదల చేసుకున్నారు.

ఇలా హైదరాబాద్ కేంద్రంగా తమ కుటుంబ కార్యకలాపాలు నడిపిస్తూ.. అమరావతిలో అద్దెకు నివసిస్తున్న చంద్రబాబు.. ఇన్ని రోజులు హైదరాబాద్ లోనే నివాసాన్ని ఉంటూ ఉన్నాడని జగన్ ను విమర్శించాడు. ఇప్పుడు జగన్ అధికారికంగా అమరావతికి మారాడు. కొత్త ఇంట్లోకి ఈరోజు చేరాడు. కానీ చంద్రబాబు మాత్రం అద్దె ఎస్టేట్ నుంచే కొనసాగుతున్నారు. చంద్రబాబు కడుతున్న రాజధాని నుంచి నుంచి నివాసం వరకూ అన్నీ తాత్కాలికంగా నిర్మిస్తున్నాడు.. దీన్ని బట్టి బాబు పాలన కూడా తాత్కాలికమేనని.. ఈ ఎన్నికల్లో ఓడిపోయి వెళ్లిపోవడం ఖాయమని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తారని టీడీపీ నేతలు, మీడియా చేస్తున్న ప్రచారానికి వైసీపీ చెక్ పెట్టింది. ఏపీ రాజధాని విషయంలో తమ అభిప్రాయాన్ని మేనిఫెస్టోలో స్పష్టత ఇస్తామని ప్రకటించింది.

వైసీపీ అధికారంలోకి వచ్చినా అమరావతియే రాజధానిగా ఉంటుందని ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు , సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. దీన్ని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తామని వెల్లడించారు. ఈ విషయంలో ప్రజలను గందరగోళ పరిచేలా కొంతమంది దుష్ప్రచారాన్ని చేస్తున్నారని.. పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని కోరారు.

జగన్ ఏపీ రాజధాని అమరావతిని మారుస్తారని.. దోనకొండను రాజధానిగా ఏర్పాటు చేస్తారంటూ చాలాకాలంగా ప్రచారం చేస్తున్నారని.. దీనిని తిప్పి కొట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఎన్నికల ముందే ఈ స్పష్టత నిచ్చే ప్రయత్నం చేస్తోంది. మేనిఫెస్టోలోనూ దీన్ని పొందుపరుస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు.