Begin typing your search above and press return to search.

మరో వరాన్ని అమలు చేసేసిన సీఎం జగన్

By:  Tupaki Desk   |   21 Nov 2019 11:02 AM GMT
మరో వరాన్ని అమలు చేసేసిన సీఎం జగన్
X
వరాలు ఇవ్వటం పెద్ద విషయం కాదు. కానీ.. ఆ వరాల్ని అమలు చేయటంలోనే అలసు ఇబ్బంది అంతా. ఈ విషయంలో తనకు సాటి మరెవరూ రారన్న రీతిలో వ్యవహరిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పాదయాత్ర సమయంలోనూ.. ఎన్నికల సందర్భంలోనూ ఇచ్చిన హామీల్ని వరుస పెట్టి అమలు చేస్తున్న జగన్.. గతంలో తానిచ్చిన హామీని ఈ రోజు నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఏపీలోని మత్స్యకార కుటుంబాలు సముద్రంలో వేట నిషేధ సమయంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతుంటారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ సముద్రంలో చేపల వేటను నిషేధిస్తుంటారు. ఈ సమయంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి సాయం కింద రూ.4వేలు మాత్రమే ఇచ్చేవారు. తమకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి పాదయాత్ర సందర్భంగా జగన్ కు తమ గోడును వెల్లబోసుకున్నారు మత్స్యకార కుటుంబాలు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని ప్రకటించారు.

దీనికి తగ్గట్లే తాజాగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని వైఎస్సార్ మత్య్సకారులకు తానిచ్చిన మాటను గుర్తు చేసుకున్నారు. ఈ రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.. గతంలో తానిచ్చిన హామీలు ఈ రోజు నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకూ చేపల వేటపై నిషేధం ఉన్న సమయంలో ఇచ్చే రూ.4వేలకు స్థానే రూ.10వేలను ఇకపై ఇవ్వనున్నట్లు చెప్పారు. తానిచ్చిన హామీని ప్రభుత్వం ఏర్పాటైన ఐదు నెలల్లోనే అమలు చేస్తున్న వైనాన్ని సీఎం జగన్ చెప్పారు.

ఈ హామీ అమలు కారణంగా రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు. మౌలిక వసతులు.. సదుపాయాల కోసం బడ్జెట్ లో మత్స్యశాఖకు రూ.551 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. బహిరంగ సభలో మాట్లాడిన జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం పైన ప్రతిపక్ష నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. ఎంతమంది శత్రువులు తనపై కుట్రలు పన్నినా వారందరిని ఎదుర్కొనే శక్తి తనకు ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని చూసి ప్రతిపక్షం ఓర్వలేకపోతుందన్నారు.