Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ అన్నే కాదు.. వారికి మాత్రం మామ కూడా!

By:  Tupaki Desk   |   14 Jun 2019 11:27 AM GMT
జ‌గ‌న్ అన్నే కాదు.. వారికి మాత్రం మామ కూడా!
X
త‌న గురించి తాను చెప్పుకునే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అన్న‌గా ఉంటాన‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌స్తావిస్తుంటారు. తాజాగా ఆయ‌న మ‌రో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. బ‌డికెళ్లే పిల్ల‌లంద‌రికి తాను మామ‌లా మార‌తాని.. వారి బాగోగులు చూసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. బ‌డిబాట‌- సామూహిక అక్ష‌రాభ్యాసం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న జ‌గ‌న్‌.. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు.

గుంటూరు జిల్లా పెనుమాక జెడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న‌.. పాద‌యాత్ర సంద‌ర్భంగా ఇచ్చిన ఒక హామీని నిల‌బెట్టుకున్న సంద‌ర్భంలో త‌న‌కు చాలా సంతోషంగా ఉంద‌న్నారు. "మీ పిల్ల‌ల‌ను బ‌డికి పంపిస్తే చాలు.. వారికి మామ‌గా అండ‌గా ఉంటా. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. నా మ‌న‌సుకు న‌చ్చిన కార్య‌క్ర‌మం చేస్తున్నా. పాద‌యాత్ర సంద‌ర్భంగా ఇచ్చిన హామీని నెర‌వేరుస్తున్నందుకు" అని వ్యాఖ్యానించారు.

పిల్ల‌ల‌ను బ‌డికి పంపిన త‌ల్లుల‌కు అమ్మ ఒడి ప‌థ‌కం కింద ప్ర‌తి ఏటా రూ.15వేలు అంద‌జేస్తామ‌న్నారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా పేద‌ల క‌ష్టాల్ని చూశాన‌ని.. వారు ప‌డుతున్న బాధ‌ల్ని విన్నాన‌ని.. బిడ్డ‌ల్ని చ‌దివించాల‌న్న ఆరాటం ఉన్నా.. చ‌ద‌వించ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న త‌ల్లిదండ్రుల్ని చూసిన‌ట్లు చెప్పారు. పిల్ల‌ల్ని ఇంజినీరింగ్ చదివించాల‌ని.. ఆ చ‌దువుల కోసం ఖ‌ర్చులు భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప‌రిస్థితిని చూసిన‌ట్లు చెప్పారు.

పాద‌యాత్ర సంద‌ర్భంగా తానువిద్యా వ్య‌వ‌స్థ‌లో సంపూర్ణ‌మైన మార్పులు తెస్తాన‌ని.. ప్ర‌తి త‌ల్లికి.. చెల్లికి హామీ ఇచ్చిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ఇచ్చిన హామీని ఈ రోజు నిల‌బెట్టుకోవ‌టం సంతోషంగా ఉంద‌న్నారు. మీ పిల్ల‌ల్ని బ‌డికి పంపిస్తే.. ప్ర‌తి ఏడాది జ‌న‌వ‌రి 26న.. పిల్ల‌ల్ని బ‌డికి పంపిన ప్ర‌తి త‌ల్లిదండ్రుల బ్యాంకు అకౌంట్లో రూ.15వేలు వేస్తామ‌న్నారు. ఆ రోజు ఓ పండ‌గ దినం కావాల‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు. త‌న పాద‌యాత్ర‌లో పిల్ల‌ల‌కు పుస్త‌కాలు.. యూనిఫాం టైంకు అంద‌వ‌ని.. ఇప్పుడు మాత్రం అలాంటి ప‌రిస్థితి ఉండ‌కూడ‌ద‌న్నారు. స్కూలు తెరిచిన వెంట‌నే పుస్త‌కాలు.. మూడు జ‌త‌ల యూనిఫాం అంద‌జేయాల‌న్నారు.

చాలా స్కూళ్ల‌లో మౌలిక వ‌స‌తులు లేవ‌ని.. మ‌రుగుదొడ్లు ఉండ‌వ‌ని.. తాగు నీటి సౌక‌ర్యం ఉండ‌ద‌న్నారు. ఈ రోజు మీ స్కూల్ ఫోటో తీసుకొని ఉండండి. రెండంటే రెండేళ్ల‌లో మీ స్కూళ్ల రూపురేఖ‌ల్ని మార్చేస్తాన‌ని జ‌గ‌న్ మాటిచ్చారు. రాష్ట్రంలోని 40వేల స్కూళ్ల రూపురేఖ‌ల్ని మార్చేస్తాన‌ని.. ప్రైవేటు స్కూళ్ల‌కు ధీటుగా త‌యారు చేస్తామ‌న్నారు. ప్ర‌తి ప్ర‌భుత్వ స్కూల్లోనూ ఇంగ్లిషు త‌ప్ప‌నిస‌రి చేస్తామ‌ని.. తెలుగు కూడా బోధిస్తామ‌ని చెప్పారు. మొత్తానికి మాట‌ల్లో కాదు.. చేత‌ల్లో చేసి చూపిస్తున్న జ‌గ‌న్ తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.