Begin typing your search above and press return to search.

జనం ఇక పెదరాయుడుకి డైరెక్ట్ అయిపోతారు

By:  Tupaki Desk   |   30 May 2019 12:39 PM GMT
జనం ఇక పెదరాయుడుకి డైరెక్ట్ అయిపోతారు
X
మీకు నేను ఉన్నాను అని జగన్ ప్రచారంలో చెబితే... సినిమా డైలాగ్ అని సరదాగా తీసుకున్నారు జగన్. కానీ మాట మీద నిలబడి... అన్నమాటను నిలబెట్టుకోవడమే కాదు పరిపాలనలో సమూల మార్పునకు నాందిపలికే నిర్ణయం తీసుకున్నాడు జగన్. గతంలో తాను 30 ఏళ్లు సీఎంగా ఉండాలని జగన్ అనేవాడు. అది కేవలం మాట కాదు అని... ఆ మేరకు జగన్ పెద్ద ప్లాన్ వేసుకున్నట్టు అర్థమవుతుంది. ఈరోజు జగన్ తన ప్రసంగంలో ప్రకటించిన నిర్ణయమే దీనికి నాంది.

'ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్‌ డెలివరీ చేసేందుకు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం. ఆగస్టు 15 వచ్చే సరికి అక్షరాలా మన గ్రామాల్లోని యువతకు గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. గ్రామాల్లో చదువుకున్న పిల్లలకు రూ. 5 వేల జీతంతో గ్రామ వాలంటీర్లను నియమిస్తాం. వ్యవస్థల్లో లంచాలు లేకుండా చేసేందుకే వీరి నియామకం. సేవా దృక్పథం ఉన్న పిల్లలకు వేరే చోట ఉద్యోగం వచ్చేదాకా గ్రామ వాలంటీర్లుగా పని చేయవచ్చు. ప్రభుత్వ పథకాలు ఎవరికీ అందకపోయినా.. పొరపాటునైనా లంచాలు తీసుకుంటున్నారని తెలిసినా, వివక్ష కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్‌ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం. విప్లవాత్మక, పారదర్శక పాలనకు నాంది పలుకుతాం'

ఇది జగన్ చెప్పిన మాట. ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన తొలి హామీ. తొలి హామీ కాబట్టి కచ్చితంగా 4 లక్షల ఉద్యోగాలను నియమించడం అనేది కచ్చితంగా జరుగుతుంది. వాస్తవానికి తాత్కాలికంగా 4 లక్షల ఉద్యోాగాలను నింపిన క్రెడిట్ అదిపెద్ద పాజిటివ్ మానియా జగన్ కి సృష్టించనుంది. కానీ వీరు దారితప్పకుండా చేసేందుకు కాల్ సెంటర్ ఏర్పాటుచేయడం ద్వారా ఎమ్మెల్యేలు దారితప్పకుండా జగన్ ప్లాన్ చేశాడు. ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేలు కాస్త ఎదిగిన వెంటనే గ్రూపులు తయారుచేసుకోవడం, ఎన్నికల ముందు ఇతర పార్టీకి జంప్ కావడం జరుగుతోంది. పథకాలన్నీ తమ క్రెడిట్ కింద వేసుకోవడం జరుగుతుంది. అయితే, ఈ తీగను జగన్ కట్ చేశాడు. తమకు వచ్చే ప్రతి రూపాయి జగన్ ఇస్తున్నాడు అని అభిప్రాయం కల్పించడం జగన్ ఉద్దేశం. తద్వారా ఎమ్మెల్యేల పట్టు పార్టీ మీద లేకుండా పార్టీని బూత్ లెవెల్లో పూర్తి పటిష్టం చేసుకుంటున్నాడు జగన్. ప్రజలు నేరుగా పార్టీకి అనుసంధానం అవుతారు. తమకు పింఛనో, ఇంకో పథకమో రాలేదని ఎమ్మెల్యే చుట్టూ తిరగడం ఉండదు. అయితే, వాలంటీర్ ని అడగడం అక్కడ న్యాయం జరక్కపోతే డైరెక్టుగా సీఎం కాల్ సెంటర్ కు ఫోన్ చేయడం... ఇది ప్రజల దృష్టిలో అవినీతి నిర్మూలనపై నమ్మకం కలిగిస్తుంది. ఇది జగన్ ఆశించిన అసలు ప్రయోజనం.

ఇక పార్టీ పరంగా కూడా ఈ నిర్ణయం జగన్ కు ఎంతే మేలు చేస్తోంది. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ని ఏర్పాటుచేయడం అంటే ఒక బూత్ కు ఐదుగురు అనుసంధాన కర్తలు ఉన్నట్లే. వారి ద్వారా ప్రభుత్వ లేదా పార్టీ సందేశాన్ని సులువుగా ప్రజలకు చేర్చొచ్చు. ఇదే వ్యవస్థ ఎన్నికల సమయంలో తనంతట తానే జగన్ కోసం పనిచేస్తోంది. అంటే ప్రమాణ స్వీకారం మొదటి రోజు నుంచే జగన్ పోల్ మేనేజ్ మెంట్ మొదలుపెట్టాడు. దీన్ని బట్టి జగన్ ఎంత పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాడో అర్థమవుతుంది. అయితే, ఈ ప్లాన్ జగన్ నుంచి ఒక పేద అవ్వ వరకూ అందరికీ ప్రయోజనం చేకూరడం ఒక విశేషంగా చెప్పుకోవాలి.