Begin typing your search above and press return to search.

మోడీతో జగన్ భేటీ... ఏపీలో సీన్ మారుతుందా...?

By:  Tupaki Desk   |   22 Aug 2022 12:30 PM GMT
మోడీతో జగన్ భేటీ... ఏపీలో సీన్ మారుతుందా...?
X
సడెన్ గా జగన్ ఢిల్లీ వెళ్లారు. దానికి సంబంధించి చివరి నిముషం దాకా విషయం బయటకు పొక్కలేదు. అలా గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేసిన జగన్ ఒక రోజు రాత్రి అంతా వన్ జనపధ్ లో గడిపారు. తెల్లారుతూనే ప్రధాని నరేంద్ర మోడీని కలసి వచ్చారు. మోడీ సైతం జగన్ కి అరగంటకు పైగా సమయం ఇచ్చారు. అన్ని విషయాలూ ఇద్దరు నేతలూ మాట్లాడుకున్నారు.

ఈ మీటింగ్ సక్సెస్ ఫుల్ గా సాగింది అని వైసీపీ వర్గాలు తెలిపాయి. జగన్ వెంట వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. పోలవరం ప్రాజెక్టునకు అవసరం అయిన నిధులు ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని జగన్ విన్నపం చేశారని చెబుతున్నారు. అలాగే తెలంగాణా నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు కూడా ఆరు వేల కోట్ల దాకా పేరుకుపోయాయని, వాటి విషయం కూడా తేల్చాలని కోరినట్లుగా వైసీపీ వర్గాలు తెలిపాయి.

ఇక రెవిన్యూ లోటు కింద ఏపీకి నిధులు ఇవ్వాలని కూడా జగన్ కోరినట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలో నిర్మిస్తున్న పేదల కాలనీలకు మౌలిక సదుపాయాలను కేంద్రం సమకూర్చాలని, అలాగే ఏపీలో వైద్య కళాశాలలకు నిధులు ఇవ్వాలని జగన్ అభ్యర్ధించారని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీకి దండీగా నిధులు కావాలని జగన్ ప్రధానిని నేరుగా అడిగినట్లుగా కూడా చెబుతున్నారు.

ఇలా చాలా విషయాలు అజెందాలో పెట్టుకుని జగన్ ఢిల్లీ వచ్చి ప్రధానిని కలిశారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంత సడెన్ గా జగన్ ఢిల్లీ చేయడం వెనక ఫక్తు రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో బీజేపీ టీడీపీ చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు వెలువడుతున్నాయి. అదే విధంగా మునుగోడు సభకు వచ్చిన అమిత్ షా మధ్యలో మీడియా దిగ్గజం తెలుగుదేశం పార్టీ అనుకూలుడిగా ముద్ర పడిన రామోజీరావుతో సుదీర్ఘమైన భేటీ వేయడం వైసీపీలో కలవరం రేకెత్తించాయని అంటున్నారు.

ఇక ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో కొంత క్లారిటీ కోసమే జగన్ ఢిల్లీ టూర్ సడెన్ గా పెట్టుకున్నారని అంటున్నారు. వీటితో పాటు వచ్చే నెలలో సీబీఐ విచారణ వేగం పెరుగుతుందని, జగన్ మీద ఉన్న కేసులలో దూకుడు పెంచుతారు అన్న వార్తలు ప్రచారంలో ఉన్న నేపధ్యంలో జగన్ ఢిల్లీ టూర్ చేయడమే ఇపుడు చర్చగా ఉంది.

ఏది ఏమైనా జగన్ ఢిల్లీ టూర్ లో ఏపీకి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. అలాగే రాజకీయ చర్చలు కూడా జరిగి ఉంటాని అంటున్నారు. మరి మోడీ నుంచి కచ్చితమైన హామీలు ఏమైనా లభించాయా ఏపీలో మారుతున్న రాజకీయం మీద బీజేపీ నుంచి ఎంతో కొంత క్లారిటీ అయినా వైసీపీకి దొరికిందా అన్నది మాత్రం చర్చగానే ఉంది. రాబోయే జరిగే పరిణామాలు బట్టి మాత్రమే వీటిని అంచనా వేయగలరు ఎవరైనా.