Begin typing your search above and press return to search.

8న వైసీపీ నేతలతో జగన్‌ ముఖ్య సమావేశం అందుకేనా?

By:  Tupaki Desk   |   5 Dec 2022 8:31 AM GMT
8న వైసీపీ నేతలతో జగన్‌ ముఖ్య సమావేశం అందుకేనా?
X
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారు. వచ్చే 30 ఏళ్లపాటు వైసీపీ అధికారంలో ఉంటుందని వైసీపీ నేతలు సైతం చెబుతున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఆయా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించి.. తమకు మరోమారు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.

సీఎం జగన్‌ సైతం వివిధ పథకాల లబ్ధిని ప్రజల ఖాతాల్లో వేయడానికి ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. దుష్టచతుష్టయం అభివృద్ధిని అడ్డుకుంటోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాను ప్రజల బిడ్డనని.. మరోమారు తనను గెలిపించాలని ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి జగన్‌ మూడు అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి జగన్‌కు నివేదించినట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి ఉన్నచోట అభ్యర్థులను మార్చేస్తారని చెబుతున్నారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్యే తీవ్ర విభేదాలు ఉన్నాయని అంటున్నారు. అలాంటిచోట్ల కూడా అభ్యర్థుల మార్పు తప్పదని తెలుస్తోంది.

ఈ క్రమంలో ఇప్పటికే నియోజకవర్గాల పరిశీలకుల పేరుతో 175 నియోజకవర్గాల్లో పరిశీలకులను నియమించారని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు సరిగా పనిచేయకపోతే అబ్జర్వర్లుగా నియమించినవారిని అభ్యర్థులుగా ఎంచుకుంటారని చెబుతున్నారు. ఇప్పటికే ఇలా తాడికొండలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను అదనపు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించారు. దీనిపై ఉండవల్లి శ్రీదేవి పెద్ద ఎత్తన నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అదనపు నియోజకవర్గ ఇన్‌చార్జుల పేరుతో కాకుండా పరిశీలకులు (అబ్జర్వర్లు) పేరుతో వారిని జగన్‌ నియమించారని అంటున్నారు.

మరోవైపు ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన తదితర పార్టీలు సైతం దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలపై దుమ్మెత్తిపోస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన మరోసారి పోటీ చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక సైతం కనిపించకుండా భారీగానే ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 8న జగన్‌ మరోమారు వైసీపీ నేతల సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే పలుమార్లు సమావేశం నిర్వహించి జగన్‌ వచ్చే ఎన్నికల్లో గెలుపుకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ డిసెంబర్‌ 8న 151 మంది ఎమ్మెల్యేలు, 26 జిల్లాల పార్టీ అధ్యక్షులు, 8 మంది కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు లేనిచోట నియోజకవర్గాల ఇన్‌చార్జులకు సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది.

ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారం, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు చేపట్టాల్సిన పనులు, ప్రస్తుతం నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష వంటివి ఉంటాయని చెబుతున్నారు.

ఇటీవల సరిగా పనిచేయని, ఆసక్తి చూపని 8 మందిని జిల్లా అధ్యక్ష పదవుల నుంచి జగన్‌ తొలగించిన సంగతి తెలిసిందే. అలాగే రీజినల్‌ కోఆర్డినేటర్లను కూడా కొంతమందిని మార్చారు. ఈ నేపథ్యంలో వీరి పనితీరును జగన్‌ సమీక్షించనున్నారని అంటున్నారు.

ప్రజల్లో ఎమ్మెల్యేలకు ఉన్న పేరు, సామాజిక సమీకరణాలు, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు, ప్రశాంత్‌ కిశోర్‌ సర్వే నివేదికలు ఆధారంగా వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా కోఆర్డినేటర్లను, పార్టీ అనుబంధ సంఘాలను కలుపుకుంటూ ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు ముందుకు సాగాలని జగన్‌ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.

ముందస్తు ఎన్నికలకు జగన్‌ వెళ్తారని.. ముందస్తు ఎన్నికలు ఖాయమని ప్రతిపక్షాలు బలంగా భావిస్తున్న నేపథ్యంలో జగన్‌ డిసెంబర్‌ 8న పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.