Begin typing your search above and press return to search.

కేసీఆర్‌తో జ‌గ‌న్‌...ఆత్మీయ ఆలింగ‌నాలు...గంట‌పావు ప్ర‌త్యేక మంత‌నాలు

By:  Tupaki Desk   |   25 May 2019 1:52 PM GMT
కేసీఆర్‌తో జ‌గ‌న్‌...ఆత్మీయ ఆలింగ‌నాలు...గంట‌పావు ప్ర‌త్యేక మంత‌నాలు
X
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాబోయే సీఎం, వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మ‌ధ్య తొలి సమావేశం జ‌రిగింది. ఈనెల 30న ముఖ్య‌మంత్రిగా ప్రమాణస్వీకారం చేయ‌నున్న వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌మాణ‌స్వీకారానికి హాజరుకావాలని కేసీఆర్‌ను ఆహ్వానించారు. హైద‌రాబాద్‌ ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన జ‌గ‌న్ ఈ మేర‌కు ఆహ్వానం అందించారు. దాదాపు గంట‌పాటు వీరి స‌మావేశం జ‌రిగింది.

శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా ఎంపిక‌యిన జ‌గ‌న్ హైద‌రాబాద్ విచ్చేసి గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అనంతరం జగన్‌ నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా వైఎస్‌ జగన్‌ దంపతులకు సీఎం కేసీఆర్‌ సాదరంగా స్వాగతం పలికారు. దంపతులకు కేసీఆర్‌ పుష్పగుచ్చాలు ఇచ్చారు. అనంతరం ఆత్మీయంగా జగన్‌ను ఆలింగనం చేసుకొని కేసీఆర్‌ అభినందించారు. జగన్‌ను శాలువాతో సత్కరించి.. హంస‌వీణ బహూకరించారు. వైఎస్‌ జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్‌ భారతి, విజయ సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులు ఉన్నారు. జగన్‌ ప్రగతి భవన్‌కు రావడం ఇదే తొలిసారి.

ఈనెల 30న విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్, కుటుంబసభ్యులను జగన్ ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకతపై ఇరువురు చర్చించారు. ఈ సంద‌ర్భంగా ఎన్నిక‌ల‌కు సంబంధించిన వివిధ అంశాల‌పై సైతం వైఎస్ జ‌గ‌న్, కేసీఆర్‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో సమావేశం అనంతరం లోటస్‌పాండ్‌కు వెళ్లారు. లోటస్‌పాండ్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.