Begin typing your search above and press return to search.

కేసీఆర్.. జగన్ ల మధ్య ఏకాంత భేటీ.. ఏం చర్చిస్తారంటే?

By:  Tupaki Desk   |   13 Jan 2020 4:13 AM GMT
కేసీఆర్.. జగన్ ల మధ్య ఏకాంత భేటీ.. ఏం చర్చిస్తారంటే?
X
అనుకున్న రోజు రానే వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అదేదో గ్యాప్ వచ్చిందన్న మాట వార్తగా మారి.. ఇటీవల కాలంలో పలు వేదికల మీద చర్చగా మారుతున్న వేళ.. అవన్నీ ఉత్తుత్తి మాటలే అన్న విషయాన్ని స్పష్టం చేసేలా తాజా భేటీకి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. అయితే.. ఈ భేటీ ఎజెండా ఏమిటి? ఏం చర్చించనున్నారు? ఎంతసేపు భేటీ సాగుతుంది? ఎవరెవరు పాల్గొంటారు? అసలు ఈ భేటీ వెనుక పరమార్థం ఏమిటి? లాంటి ప్రశ్నలకు ఒక ట్రెండుకు తప్పించి మిగిలిన సందేహాలకు సమాధానాలు లభించని పరిస్థితి.

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ భేటీ లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మినహా మిగిలిన అధికారులు ఎవరూ పాల్గొనకపోవటం ఒక విశేషం. ఇరువురు ముఖ్యమంత్రులు ఏకాంతంగా భేటీ కానున్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు కాస్త అటు ఇటుగా ఈ భేటీ స్టార్ట్ అయి సాయంత్రం వరకూ సాగుతుందంటున్నారు. మధ్యలో భోజనం కూడా కేసీఆర్ ఇంట్లోనే జరుగుతుందని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సమావేశం గత ఏడాది సెప్టెంబరు 23న సాగింది.

ఇప్పటి వరకూ జరిగిన అన్ని సమావేశాలు హైదరాబాద్ లోనే సాగగా.. అది కూడా ప్రగతిభవన్ లోనే జరిగాయి. ప్రతి భేటీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి రావటం గమనార్హం. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరి మధ్య భేటీలో తొమ్మిది.. పదో షెడ్యూల్డు సంస్థల విభజన.. విద్యుత్ ఉద్యోగులు.. డీఎస్పీల విభజన.. ఆర్టీసీ.. రాష్ట్ర ఆర్థిక సంస్థ విభజన.. ఆస్తులు.. అప్పులు.. ఉద్యోగుల బదలాయింపుతో పాటు ఇతర పెండింగ్ అంశాల పైనా చర్చిస్తారంటున్నారు.

అయితే.. దీనికి అవకాశం లేదనే చెప్పాలి. ఇన్ని అంశాల మీద చర్చ జరిగే పక్షంలో అధికారుల సాయం అవసరమవుతుంది. కానీ.. అదేమీ లేకుండా ఏకాంత భేటీ అని స్పష్టంగా చెబుతున్న వేళ.. ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అంశాలు అంతకు మించే ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏమైనా.. తాజా భేటీ ఉత్సుకత తో పాటు.. ఉత్కంటత ను రేపుతుందని చెప్పక తప్పదు. ఇద్దరు సీఎంల మధ్య సాగిన సంభాషణ దేనికి సంబంధించి అన్న విషయంపై అధికారికంగా ఏం చెబుతారో చూడాలి.