Begin typing your search above and press return to search.

కేసీఆర్ మంచివాడన్న జగన్.. సభ దద్దరిల్లింది

By:  Tupaki Desk   |   25 July 2019 8:56 AM GMT
కేసీఆర్ మంచివాడన్న జగన్.. సభ దద్దరిల్లింది
X
ప్రాజెక్టులపై చర్చ ఏపీ అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది.. గురువారం మధ్యాహ్నం ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాజెక్టులపై చర్చలో తొలుత మాట్లాడారు. ‘‘తాము కట్టిన వట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటిని కృష్ణా, గుంటూరు, రాయలసీమ జిల్లాలకు తరలించి రైతులకు ఇవ్వాలని సూచించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను నమ్మి జగన్ ఏపీకి అన్యాయం చేస్తున్నాడని.. కేసీఆర్ ను నమ్మి ఉమ్మడి ప్రాజెక్టులు కడితే ఏపీకి జగన్ అన్యాయం చేసిన వారు అవుతారని.. చరిత్ర హీనులుగా మిగిలిపోతారని’’ చంద్రబాబు విమర్శించారు.

చంద్రబాబు మాటలకు అనంతరం సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ‘‘కృష్ణా నదిపై ఆల్మట్టి ఎత్తును పెంచుతూ మనకు రావాల్సిన నీటిని కిందకు రానీయడం లేదని.. మరో పదేళ్లు గడిస్తే ఆ నీళ్లు వస్తాయో లేదోనని.. నీటి వినియోగం పెరుగుతున్న తీరు చూస్తే తనకు భయం వేస్తోందన్నారు. అందుకే ఎగువన ఉన్న తెలంగాణతో సఖ్యతతో ఉంటే శ్రీశైలం, నాగార్జునసాగర్ నీళ్లు కలిసి వాడుకోవచ్చని’’ జగన్ వివరించారు. పోలవరం నీటిని కృష్ణ, గుంటూరు, రాయలసీమ జిల్లాల కంటే ముందు పశ్చిమ కాలువ ద్వారా గోదావరి జిల్లాలకు తరలిస్తామని జగన్ అన్నారు. ఆ జిల్లాలో పోలవరం ప్రాజెక్టు కట్టి వారికి నీళ్లు ఇవ్వకపోవడం అన్యాయం అని... ఆ రైతులు రోడ్డెక్కుతారని జగన్ వివరించారు. గోదావరి జిల్లాలకు ముందు నీళ్లు ఇచ్చిన ఆ తరువాత కృష్ణా, గుంటూరు, రాయలసీమ జిల్లాలకు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు.

ఇక ఏపీ నీటి కష్టాలు తీరాలంటే తెలంగాణతో సఖ్యత అవసరమని.. ఆ రాష్ట్ర సీఎం ‘కేసీఆర్ ఎంతో మంచివాడని’ సహకరిస్తున్నాడని జగన్ సంచలన కామెంట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే నీటి గోస తీరుతుందని.. ఈ విషయంలో కేసీఆర్ ఎంతో సహృదయంతో మనకు సహకరిస్తున్నాడని జగన్ చెప్పుకొచ్చాడు. ఏపీ అసెంబ్లీలో ‘కేసీఆర్ మంచోడు’ అన్న మాటలను జగన్ పలకగానే సభలో పెద్ద దుమారం రేగింది.

జగన్ వ్యాఖ్యలతో సభలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు. లొల్లి లొల్లి చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. జగన్ మాట్లాడకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సభలో నిరసన తెలుపుతున్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్సెండ్ చేస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన తీర్మానం పెట్టగా స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు విధించారు.