Begin typing your search above and press return to search.

సీఎం జ‌గ‌న్ మొద‌టి రోజు ఎలా గ‌డిచింది?

By:  Tupaki Desk   |   1 Jun 2019 6:43 AM GMT
సీఎం జ‌గ‌న్ మొద‌టి రోజు ఎలా గ‌డిచింది?
X
ఏపీ ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న తొలి రోజును పూర్తి చేశారు. రోజు మొత్తంలో జ‌గ‌న్ తీరును చూసినోళ్లంతా దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ప‌దే ప‌దే గుర్తు చేసుకోవ‌టం క‌నిపించింది. స‌మ‌య‌పాల‌న‌.. క‌చ్ఛితంగా ఉండ‌టం.. అధికారుల‌తో వ్య‌వ‌హ‌రించే తీరు.. స‌మీక్ష‌ల సంద‌ర్భంగా తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పే వైనం.. లంచ్ బ్రేక్ ద‌గ్గ‌ర నుంచి.. ప్ర‌తి విష‌యాన్ని నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం న‌డుచుకోవ‌టం.. ఏ అధికారిని అన‌వ‌స‌రంగా వెయిట్ చేయించ‌కుండా ఉండ‌టం లాంటివి చేశారు.

ఉద‌యం 9 గంట‌ల నుంచి మొద‌లైన ఆయ‌న షెడ్యూల్ రాత్రి 8 గంట‌ల వ‌ర‌కూ సాగింది. ముందు నుంచి చెబుతున్న‌ట్లే.. ఉద్యోగులు 5.30 గంట‌ల త‌ర్వాత ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని.. అదే స‌మ‌యంలో త‌న ద‌గ్గ‌రి వారు సైతం రాత్రి 8 గంట‌ల త‌ర్వాత త‌న‌తో ఉండాల్సిన అవ‌స‌రం లేద‌న్న విష‌యాన్ని ఆయ‌న చేత‌ల్లో చేసి చూపించారు. షెడ్యూల్ కు ప్రాధాన్య‌త ఇచ్చే విష‌యంలో తండ్రి వైఎస్ ను గుర్తుకు తెచ్చిన జ‌గ‌న్‌.. పంక్చువాలిటీకి ప్రాధాన్య‌త ఇవ్వటం క‌నిపించింది.

ముఖ్య‌మంత్రిగా వైఎస్ వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడుస‌మ‌య‌పాల‌న పక్కాగా ఉండేది. ఏ మాత్రం ఆల‌స్యం కావ‌టానికి ఇష్ట‌ప‌డే వారుకాదు. క‌చ్ఛితంగా ఉద‌యం 10.30 గంట‌ల‌కు స‌చివాల‌యానికి వ‌చ్చే ఆయ‌న సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కూ ఉండేవారు. ఏమైనా మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు లంచ్ బ్రేక్ ఇచ్చేవారు. సచివాల‌యం నుంచి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత రాజ‌కీయ అంశాల మీద ఎక్కువ‌గా దృష్టి పెట్టేవారు. తండ్రి వైఎస్ కు త‌గ్గ‌ట్లే జ‌గ‌న్ కూడా అదే తీరును ప్ర‌ద‌ర్శించ‌టం క‌నిపించింది. జ‌గ‌న్ వ‌ర్క్ స్టైల్ చూస్తే.. వైఎస్ ను చూసిన‌ట్లే ఉంద‌న్న మాట ప‌లువురి నోట వినిపించ‌టం గ‌మ‌నార్హం.

తొలిరోజు సీఎంగా జ‌గ‌న్ షెడ్యూల్ ఎలా సాగిందంటే..

+ ఉదయం 9 గంటలకు : ప‌్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్‌తోపాటు.. పలువురు పోలీసు అధికారులతో తన నివాసంలో సమావేశం . శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో రాజీ లేద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌.

+ ఉదయం 10 గంటలకు : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఆర్థికశాఖ అధికారులతో సమావేశం. టెండర్ల ప్రక్రియ ప్రక్షాళనపై చర్చ..అధికారులకు పలు సూచనలు.
ప్రభుత్వోద్యోగులు తమ పని గంటలకు మించి ఎవరూ పనిచేయరాదని నిర్దిష్ట ఆదేశాలు. త‌న వ‌ద్ద సైతం రాత్రి 8 త‌రువాత స‌మీక్ష‌లు ఉండ‌వంటూ స్ప‌ష్టీక‌ర‌ణ‌.

+ ఉద‌యం 11 గంటలకు : పార్టీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో రాజకీయపరమైన అంశాలపై చర్చలు. కేబినెట్‌ విస్త‌ర‌ణ‌..స‌చివాల‌యంలో ఎప్పుడు విధులు నిర్వ‌ర్తించాల‌న్న అంశాల మీద చ‌ర్చ‌. కేబినెట్ మీటింగ్ మీద చ‌ర్చ‌.

+ ఉద‌యం 11.30 గంట‌ల‌కు: మళ్లీ అధికారులతో సమావేశం. అధికారుల నియామ‌కాలు..బ‌దిలీల అంశం పైన చ‌ర్చ‌

+ మ‌ధ్యాహ్నం 1.30 గంట‌లు: ల‌ంచ్ బ్రేక్

+ భోజ‌న విరామం త‌ర్వాత క్యాంపు కార్యాల‌యంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల మర్యాదపూర్వక భేటీలు. త‌న ప్రాధాన్య‌త‌ల వివ‌ర‌ణ‌.

+ సాయంత్రం 4 గంటలకు : అక్షయపాత్ర ఫౌండేషన్‌ ప్రతినిధులతో సమావేశం. దాని త‌ర్వాత పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమావేశం. విద్యాశాఖ‌లో మార్పుల‌కు సూచ‌న‌లు.

+ సాయంత్రం 5 గంటలకు : సందర్శకులతో భేటీలు. జిల్లాల నుండి వ‌చ్చిన నేత‌ల‌కు స‌మ‌యం కేటాయింపు.

+ రాత్రి 8 గంటలకు : తన అధికార కార్యక్రమాలన్నింటినీ ముగింపు.