Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై జగన్ సెటైర్ అదిరిందిగా..

By:  Tupaki Desk   |   14 Aug 2017 6:04 PM GMT
చంద్రబాబుపై జగన్ సెటైర్ అదిరిందిగా..
X
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ భారీ సెటైర వేశారు. చంద్రబాబు వద్ద అక్రమంగా సంపాదించిన వందల కోట్ల డబ్బు ఉందని... దాంతో ఇప్పుడు నంద్యాల ఓటర్లకు ఇంటికో కేజీ బంగారం - స్విఫ్ట్ కారు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధమయ్యేలా ఉన్నారంటూ జగన్ అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన చంద్రబాబును ఏకిపడేశారు. అక్రమాలు చేసి సంపాదించిన డబ్బుతో 21 మంది ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు .. ప్రజలను కూడా కొనేయొచ్చనే అహకారంతో ఉన్నారని మండిపడ్డారు.

గత మూడేళ్ల పాలనలో చంద్రబాబు రాష్ర్టాన్ని దోచుకున్నారని.... ఇసుక దందా - లిక్కర్‌ మాఫియా - రాజధాని భూములు వంటి వ్యవహారాలతో వేల కోట్లు సంపాదించారని.. ఆ సొమ్ముతో ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలను కొన్నారని అన్నారు. ఇప్పుడు నంద్యాలలో గెలుపు కోసం ఇంటికో బంగారమో - ఇంటికో స్విఫ్ట్‌కారో ఇస్తామని అంటారేమో అని వ్యాఖ్యానించారు.

టీడీపీ ఈ ఎన్నికల్లో అడ్డగోలుగా డబ్బు ఖర్చు చేస్తోందని... రూ.5వేలు చేతిలో పెట్టి ఒట్టు వేయించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పాపాన్ని గెలిపించాలని కోరుతున్న వారంతా దెయ్యాలంటూ ఆయన మండిపడ్డారు.

పనిలో పనిగా ఆయన చంద్రబాబు కర్నూలు ప్రజలకు మూడేళ్ల కిందట ఇచ్చిన హామీలను ఎలా మర్చిపోయారన్న విషయం గుర్తు చేశారు. మూడేళ్ల కిందట 2014 ఆగస్టు 15న ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు కర్నూలులో జాతీయ జెండా ఎగురవేసిన సందర్భంలో ఆయన.. ఎయిర్‌పోర్ట్‌ కడతామని - ట్రిపుల్‌ ఐటీ - ఉర్దూ యూనివర్సిటీ - సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి అవుకు దగ్గర ఇండస్ట్రియల్‌ పార్క్‌ - మైనింగ్‌ - ఫుడ్‌ పార్కులు -సిమెంట్‌ ఫ్యాక్టరీ - గండ్రేవుల ప్రాజెక్టు వంటి హామీలు ఇచ్చారు. అందులో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చని సంగతిని జగన్ గుర్తు చేశారు. "గడిచిన మూడేళ్లలో కర్నూలు జిల్లానుకానీ, నంద్యాలనుకానీ ముఖ్యమంత్రి, కేబినెట్‌ మంత్రులు పట్టించుకోలేదు. కానీ ఇవాళ ఇక్కడే మకాం వేశారు. కారణం.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని పోటీలో పెట్టినందుకే. ఒకవేళ వైఎస్సార్‌సీపీ పోటీకి దిగకపోయి ఉంటే, ఇన్ని నిధులుకానీ, ఇన్ని శంకుస్థాపనలుగానీ జరిగేవికావు. దీని ద్వారా మనకో విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారు' అని జగన్‌ విరుచుకుపడ్డారు.