Begin typing your search above and press return to search.

చంద్రబాబు రాడు, ఎవరినీ తీసుకుపోడు

By:  Tupaki Desk   |   9 Aug 2016 6:18 AM GMT
చంద్రబాబు రాడు, ఎవరినీ తీసుకుపోడు
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు మాటల్లో కనిపించే రెండు నాలుకల ధోరణిపై తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన.. ఇందుకు తగ్గట్లే పలు ఉదాహరణలు చెప్పటం గమనార్హం. ప్రత్యేక హోదా మొదలుకొని.. ఏపీలో చోటు చేసుకుంటున్న పలు అంశాలపై ఏకరువు పెట్టిన జగన్.. చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా మీద చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్న జగన్.. ప్రత్యేక హోదా మీద పార్లమెంటులో హామీ ఇచ్చారని.. అలా ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరిని అడగాలి? ఎవరి దగ్గకు వెళ్లాలి? అంటూ ప్రశ్నించారు.

హోదా అంశంపై కేంద్రాన్ని గట్టిగా అడిగే ధైర్యం ఏపీ ముఖ్యమంత్రికి లేదని చెప్పిన జగన్.. తరచూ రెండు నాలుకలతో మాట్లాడతున్నారంటూ తప్పు పట్టారు. వెంకయ్య నాయుడితో కలిసి కేంద్రం రాష్ట్రానికి చాలా చేస్తుందని చెబుతూనే.. మరో సందర్భంగా అన్యాయం చేస్తుందని వ్యాఖ్యానిస్తారన్నారు. ‘‘ఏపీలో అరుణ్ జైట్లీని తప్పు పడుతూ మాట్లాడతారు. అదే ఢిల్లీకి వచ్చినప్పుడు ఈ విషయాన్ని అడగరు. కృష్ణా పుష్కరాలకు పిలవటానికి వచ్చినట్లు చెబుతారు. బాబు ఢిల్లీ పర్యటనలోఏం సాధించారు? ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు’’ అని గుర్తు చేశారు.

పుష్కరాలకుఆహ్వానిస్తామని చెబుతూ ఢిల్లీకి వచ్చే చంద్రబాబు.. మరోవైపు గుళ్లను కొట్టిస్తున్నారన్నారు. చంద్రబాబుకు దేవుడి మీద కూడా ప్రేమ లేదన్నారు. ‘‘విజయవాడలో 40 గుళ్లు తొలగించారు. దేవుడి భూముల్ని కూడా వదిలిపెట్టరు. బినామీలకు తక్కువ ధరకే అమ్మేస్తారు’’ అని మండిపడ్డారు. రాష్ట్రపతిని కలిసిన సందర్భంగా చంద్రబాబు తన గురించి గొప్పలు ప్రచారం చేసుకున్నారని చెబుతూ.. ఈ వ్యవహారంపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.

‘‘చంద్రబాబు మాదిరి పని చేస్తే దేశం ఎక్కడికో వెళ్లిపోతుందని రాష్ట్రపతి అన్నారట. రాష్ట్రపతిని కలిసినప్పుడు అక్కడ ఏ విలేకరి ఉండడు. రాష్ట్రపతిని కలిసినప్పుడు ఒకరు వచ్చి ఫోటో తీసుకొని వెళతారు. అలాంటిది చంద్రబాబు గురించి రాష్ట్రపతి పొగిడినట్లు వార్తలు రావటం ఏమిటి? అన్నిపార్టీలుకలిసి ఢిల్లీకి వచ్చి ప్రత్యేక హోదా గురించి అడుగుదామని చంద్రబాబును అడిగా. కానీ.. ఆయన రాడు. ఎవరినీ తీసుకుపోడు. హోదా రాకుంటే రాష్ట్రం నష్టపోతుందని తెలిసి.. ఈ విషయం మరుగున పడుతుందని తెలిసి మాలాంటోళ్లం వచ్చి అడుగుతున్నాం. ప్రత్యేకహోదా ఇవ్వకపోవటం మోడీ తప్పు. దీని కోసం పోరాడకపోవటం చంద్రబాబు తప్పు. ప్రత్యేక హోదా కోసమే వచ్చాం తప్ప.. కృష్ణా పుష్కరాలకు పిలవటానికి వచ్చామని మేం చెప్పం’’ అంటూ వ్యాఖ్యానించారు.