Begin typing your search above and press return to search.

ఇక క‌లెక్ట‌ర్ల‌పైనే జ‌గ‌న్ భారం వేశారా?

By:  Tupaki Desk   |   25 Aug 2022 7:54 AM GMT
ఇక క‌లెక్ట‌ర్ల‌పైనే జ‌గ‌న్ భారం వేశారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కి 175 అసెంబ్లీ సీట్లు సాధించాల‌ని ముఖ్య‌మంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఉవ్విళ్లూరుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు ఆయ‌న త‌న పార్టీ నేత‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల‌కు కూడా ఈ దిశ‌గా ఉద్భోదిస్తున్నారు. ఇప్ప‌టికే గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం పేరిట ఎమ్మెల్యేలు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఎమ్మెల్యేలు లేని చోట నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జులు వెళ్తున్నారు. ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్ల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల క‌లిగిన ల‌బ్ధిని వారికి వివ‌రిస్తున్నారు. మ‌ళ్లీ వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌మ‌ను గెలిపించాల‌ని విన్న‌విస్తున్నారు.

అయితే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల‌కు ప్ర‌జ‌ల చేతిలో చుక్కెదురు అవుతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ప‌లు చోట్ల త‌మ‌కు ప‌థ‌కాలు అంద‌లేద‌ని, తాగునీటి స‌మ‌స్య ఉంద‌ని, పెన్ష‌న్ రావ‌డం లేద‌ని, రోడ్డు సౌక‌ర్యం లేద‌ని, డ్రైనేజ్ స‌మ‌స్య ఉంద‌ని, ప‌న్నుల పెంపు, చార్జీల పెంపుతో దోచేస్తున్నార‌ని ఇలా ప‌లు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌జ‌లు లేవ‌నెత్తుతున్నారు.

మూడేళ్ల త‌ర్వాత తాము గుర్తొచ్చామా అని ఎమ్మెల్యేల‌ను నిల‌దీస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేకపోతున్నారు. కొంత‌మంది ప్ర‌శ్నించిన‌వారిని పోలీసుల‌చేత అరెస్టు చేయిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. మ‌రోవైపు ఎమ్మెల్యేలు కూడా గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం తాము చేయ‌లేమని.. త‌మ వ‌ల్ల కాద‌ని చేతులెత్తేస్తున్న‌ట్టు స‌మాచారం.

అయితే గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నుంచి ఎవ‌రికీ మిన‌హాయింపు లేద‌ని.. అంతా వెళ్లాల్సిందేన‌ని వైఎస్సార్సీపీ అధిష్టానం తేల్చిచెబుతోంది. ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌వారికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేస్తోంది.

మ‌రోవైపు ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జుల‌పై వ్య‌తిరేక‌త ఉండ‌టంతో ప్ర‌భుత్వం రూటు మార్చింది. కలెక్ట‌ర్ల‌ను రంగంలోకి దించుతోంది. కొద్ది రోజుల క్రితం క‌లెక్ట‌ర్లు, జేసీలు, ఎస్పీల‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మావేశం నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్బంగా ప్ర‌తి జిల్లా క‌లెక్ట‌ర్ నెల‌లో త‌ప్ప‌నిస‌రిగా ఆరు సచివాలయాల‌ను సంద‌ర్శించాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

ఎమ్మెల్యేలపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని.. వారిపై ప్ర‌జాగ్ర‌హం వెల్లువెత్తుతోంద‌ని.. ఈ నేప‌థ్యంలో అధికారుల‌ను పంప‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే జిల్లా క‌లెక్ట‌ర్ నెల‌లో ఆరు స‌చివాల‌యాల‌ను సంద‌ర్శించాల‌ని ఆదేశాలు జారీ చేశార‌ని అంటున్నారు. అధికారులు వెళ్తే తన గ్రాఫ్‌ ఇంకా పెరుగుతుందని.. వ‌చ్చే ఎన్నికల్లోనూ త‌న‌కు లాభమని జ‌గ‌న్ అంచనా వేసినట్లు సమాచారం. కాగా ఇప్ప‌టికే గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వంలో ఎమ్మెల్యేల‌తోపాటు వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొంటున్నారు. ఇక ఇప్పుడు జిల్లా కలెక్టర్లూ పాలుపంచుకోవాలని సీఎం జ‌గ‌న్‌ స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకుంటున్నార‌ని చెబుతున్నారు.