Begin typing your search above and press return to search.

బాబు, పవన్ బండారం బయటపెట్టిన జగన్

By:  Tupaki Desk   |   4 Dec 2018 7:29 AM GMT
బాబు, పవన్ బండారం బయటపెట్టిన జగన్
X
తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి అక్రమ సంసారం చేస్తున్న చంద్రబాబు పై జగన్ నిప్పులు కురిపించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగిన ప్రజాసంకల్ప యాత్ర 311వ రోజున జగన్ బహిరంగ సభలో మాట్లాడారు. బాబుతో మ్యాచ్ ఫిక్సింగ్ జరుపుకొని రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ను జగన్ ఏకిపారేశారు. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై చంద్రబాబు అక్రమపొత్తులు, వెదజల్లుతున్న డబ్బుల సంచుల వ్యవహారం పై జగన్ విమర్శలు గుప్పించారు.

నందమూరి హరికృష్ణ చనిపోయిన సందర్భంలో కలిసిన చంద్రబాబు.. కేటీఆర్ తో పొత్తుకు ఆసక్తి చూపాడని.. కానీ కేటీఆర్ తిరస్కరించారని జగన్ చెప్పుకొచ్చారు. కేవలం రెండు నెలల్లోనేనే కాంగ్రెస్ తో బాబు పొత్తు కుదుర్చుకున్నాడని.. తెలంగాణలో తన అవినీతి సొమ్మును ఇస్తాననగానే కాంగ్రెస్ శతృత్వం మరిచిపోయి నవంబర్ లో బాబు సీట్లు సర్దుబాటు చేసుకున్నారని జగన్ విమర్శించారు.

కేటీఆర్ ఒప్పుకుంటే కాంగ్రెస్ ను చంద్రబాబు తిట్టేవాడని.. ఇప్పుడు కాంగ్రెస్ పక్కన ఉండి టీఆర్ఎస్ ను తిడుతున్నాడని జగన్ విమర్శించారు. ఈ నీతిమాలిన రాజకీయాలను ఈ పెద్ద మనిషి బాబు చక్రం తిప్పడం అంటున్నారని.. ఇంతకన్నా దిక్కుమాలిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఉన్నాడా అని జగన్ విమర్శలు గుప్పించారు.

రాష్ట్రాన్ని విడ గొట్టిన కాంగ్రెస్ ను బాబు తిట్టాడని.. సోనియాను అవినీతి అనకొండ అన్నాడని.. ఈ రోజు ఆ అవినీతి అనకొండ చంద్రబాబు దృష్టిలో అందాల కొండ.. ఆనందాల కొండగా అయ్యిందా అని జగన్ విమర్శించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన సోనియాను ఆరోజు గాంధీని చంపిన గాడ్సేతో బాబు పోల్చాడని.. రాహుల్ ను మొద్దబ్బాయ్ అని తిట్టాడని.. ఈరోజు దేశాన్ని పాలించే నేతగా రాహుల్ కనిపించారా అని జగన్ విమర్శించారు. రాజకీయ విలువలు, విశ్వసనీయ అనే పదాలకు చంద్రబాబు పాతరేశాడు అని చెప్పడానికి ఇదే నిదర్శనమని జగన్ విమర్శించారు.

చంద్రబాబు గురించి ఈ జూన్ 8న కాంగ్రెస్ పార్టీ ఓ పుస్తకం విడుదల చేసిందని.. నాలుగేళ్ల చంద్రబాబు పాలన మీద, ఆయన అవినీతి మీద.. దుష్టపాలన మీద రాహుల్ గాంధీ బొమ్మతో ‘చార్జీషీటు’ పేరుతో ఆ పుస్తకాన్ని వెలువరించారని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు అంతటి అవినీతి పరుడు ఈ ప్రపంచంలోనే లేరని అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిస్సిగ్గుగా ఎలా తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తున్నారని జగన్ విమర్శించారు. చంద్రబాబు నికృష్ట రాజకీయాలు చూస్తే ఏవగింపు వస్తుందని జగన్ విమర్శించారు.

ఏపీలో దుర్భర పరిస్థితులుంటే ఈయన దేశరాజకీయాల్లో వేలుపెట్టి ఇతర రాష్ట్రాల నేతలో విందుల్లో మునుగుతారని బాబుపై జగన్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి మోడీని దింపాలని ఈయన కుట్ర పన్నుతాడని విమర్శించాడు.

నాలుగున్నరేళ్లుగా చంద్రబాబుకు పార్ట్ నర్ గా ఉన్న జగన్.. ఇప్పుడు తనను అవినీతి పరుడు అని విమర్శిస్తున్నాడని.. అసలు బాబును, టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ములేని నాయకుడు పవన్ అని జగన్ విమర్శించారు.2004 నుంచి 2009దాకా వైఎస్ పాలనలో ప్రజలంతా సంతోషపడ్డారని.. 2009లో వైఎస్ ను మళ్లీ సీఎంను చేశారని.. అప్పుడు సినిమాల్లో ఉన్న పవన్ ఎలా అవినీతి జరిగిందని విమర్శిస్తారని ఆరోపించారు. నాలుగున్నరేళ్లుగా ప్రజల్లో ఉన్న నన్ను.. ప్రజల్లో లేని పవన్ విమర్శించడమా అని నిలదీశారు.

పవన్ కళ్యాణ్ ఈ మధ్య మగతనం గురించి మాట్లాడుతున్నాడని..నాలుగు భార్యలను పెళ్లి చేసుకొని నాలుగేళ్లకోసారి భార్యను మార్చే పవన్ కు పవిత్రమైన వివాహ వ్యవస్థ మీద నమ్మకం ఉందా.? పవన్ వివాహ వ్యవస్థను రోడ్డుమీదకు తెచ్చారని జగన్ ఉతికి పారేశారు. నిత్య పెళ్లికొడుకుగా భార్యలను మారుస్తూ .. నలుగురిని చేసుకోవడం మగతనమా అని ప్రశ్నించారు. రేణుదేశాయ్ తో కాపురం చేస్తుండగానే..వేరొక స్త్రీని గర్భిణిని చేసి ఆ బిడ్డను ఇంటికి తీసుకొచ్చాడని రేణుదేశాయ్ చేసిన విమర్శలకు పవన్ ఏం సమాధానం చెప్తాడని జగన్ నిలదీశారు. పవన్ అభిమానులు ఆమెను వేధిస్తే కనీసం అడ్డుచెప్పలేని ఈ పెద్దమనిషి గారిది ఇదా మగతనం అని జగన్ ప్రశ్నించారు. కారును మార్చినట్టు భార్యలను మారుస్తున్నా నువ్వు చేసింది తప్పు.. చేసింది ధర్మమా అని నిలదీశారు. ప్రశ్నించిన వారిపై సోషల్ మీడియాలో అబద్దాలు ప్రచారం చేయించే పవన్ బండారం అందరికీ తెలుసన్నారు. అజ్ఞాతవాసి సినిమాకి బాబు నుంచి ఏపీలో రాయితీలు తీసుకొని కోట్ల రూపాయలు అవినీతి చేసిన చరిత్ర పవన్ ది అని విమర్శించారు. చంద్రబాబు స్క్రిప్ట్ లో భాగంగానే పవన్ మాట్లాడుతున్నాడని.. ఇలాంటి నీచమైన రాజకీయాలు చూసినప్పుడు వ్యవస్థ మారకపోతే మనమంతా నష్టపోతామని జగన్ స్పష్టం చేశారు.