Begin typing your search above and press return to search.

బాబు అవినీతి సామ్రాట్ : జగన్

By:  Tupaki Desk   |   6 Jan 2019 6:50 PM GMT
బాబు అవినీతి సామ్రాట్ : జగన్
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి చక్రవర్తి అని, ఆయన అప్రజాస్వామిక పాలన కొనసాగించారని ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. " ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడి అవినీతి ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు. దీనిపై మేం అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తాం. రాజధాని పేరుతో ఆయన చేసిన అవినీతిపైకూడా చర్యలు తీసుకుంటాం" అని జగన్ అన్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో చంద్రబాబు నాయుడు, ఆయన పాలనపై జగన్ మండి పడ్డారు. రాజధాని ఎక్కడ వస్తుందో చివరి వరకూ చెప్పకుండా అనేక మందిని మోసం చేశారని అన్నారు. " చంద్రబాబు నాయుడి సొంత వ్యాపార సంస్ధ హెరిటేజ్ పేరిట వందల ఎకరాలు కొన్నారు.నూజివీడు దగ్గర రాజధాని వస్తుందని ప్రకటనలు చేశారు. తాను, తన డమ్మీలు పొలాలు కొనుక్కున్న తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించారు " అని జగన్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడి అవినీతికి అంతు లేదని, వీటన్నింటిపై తాము విచారణ జరిపిస్తామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అవినీతిపై ఎవ్వరు మాట్లాడరని,చ హైదరాబాద్ లో ఆయనకు వంద కోట్ల రూపాయలు విలువ చేసే ఇల్లు ఉందని, దానిపై మీడియా ఎందుకు ప్రశ్నించదని జగన్ మండిపడ్దారు. ప్రతి అంశంలోనూ చంద్రబాబు నాయుడు అటు ప్రజలను, ఇటు రాజకీయ పార్టీలను కూడా మోసం చేస్తున్నారని జగన్ అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ నిర్మాణం పూర్తి కాలేదని, అన్నీ టెంపరరీ అంటున్నారని అన్నారు. " సచివాలయం పర్మనెంట్ కాదు. అక్కడి భవనాలు పర్మినెంట్ కాదు. ప్రభుత్వ భవనాలు పర్మినెంట్ కాదు. ఇదంతా ఏమనుకోవాలి" అని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను ప్రతీ అంశాన్నిప్రస్తావిస్తానంటున్న తెలుగుదేశం నాయకులు వారి అధినేత చేస్తున్న పనులకు ఏమని సమాధానం చెప్తారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిపై పూర్తి స్ధాయిలో విచారణ జరుగుతుందని, ఆయన జైలుకు వెళ్తారా... లేదా అనేది కాలమే నిర్ణయిస్తుందని జగన్ అన్నారు.