Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురికీ జ‌గ‌న్ ఆన్స‌రిచ్చేశారు!

By:  Tupaki Desk   |   6 Jan 2019 8:09 AM GMT
ఆ ముగ్గురికీ జ‌గ‌న్ ఆన్స‌రిచ్చేశారు!
X
ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే... త‌మ‌తో క‌లిసి న‌డిచేవారెవ్వ‌రంటూ ఎదురు చూడ‌టం ఏపీలోని అధికార పార్టీ టీడీపీకి అల‌వాటు. ఏ ఎన్నిక‌ల్లోనూ ఒంట‌రిగా బ‌రిలోకి దిగిన చ‌రిత్ర లేని ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... 2019 ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటేనే వ‌ణికిపోతున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఆ విశ్లేష‌ణ‌లు నిజ‌మేన‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు... త‌న‌కు పొత్తులే వ‌ద్దంటున్న వారిని కూడా కూడా దాదాపుగా కాళ్లావేళ్లా ప‌డుతున్న చందంగా పొత్తుల కోసం దేబిరిస్తున్నారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనే చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చి త‌ప్పు చేశాన‌ని బ‌హ‌రంగంగానే జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించినా కూడా... వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌మ‌తోనే ప‌వ‌న్ క‌లిసి రావాల్సిందేన‌న్న కోణంలో వ్యాఖ్య‌లు చేస్తూ స‌రికొత్త మైండ్ గేమ్‌కు తెర తీశారు. ఈ మైండ్ గేమ్‌లో భాగంగానే * అస‌లు తాము క‌లిస్తే జ‌గ‌న్‌కు ఎందుకు బాధ‌* అంటూ కూడా మొన్న చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌తో క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను త‌ప్పించి.. మిగిలిన అన్ని పార్టీల‌కూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టేసి త‌మ‌దైన రాక్ష‌సానందం పొందే చంద్ర‌బాబు... వైసీపీ, జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య లోపాయికారీ పొత్తు ఉంద‌ని చాలా కాలంగా ఆరోపిస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఆరోప‌ణ చేసిన నోటితోనే చంద్ర‌బాబు... త‌మతో జ‌న‌సేన క‌లిస్తే వైసీపీకి బాధ ఎందుకు అంటూ స‌రికొత్త ఆరోప‌ణ చేయ‌డం నిజంగానే ఆయ‌న‌కే చెల్లింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ వ్యాఖ్య‌ల‌పై నిన్న జ‌గ‌న్ సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్ అటాక్ చేశారు. నిన్న ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు, జ‌న‌సేన‌, కాంగ్రెస్ పార్టీలు త‌న‌పై చేస్తున్న వ‌రుస విమ‌ర్శ‌ల‌న్నింటికీ ఒకే సారి ఆన్స‌ర్ ఇచ్చేశారు. తొలుత చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై త‌న‌దైన శైలి దాడి చేసిన జ‌గ‌న్‌... *మీరు కలిస్తే మాకేం బాధ.. కలిసేరండి.. ముసుగులు తొలగించుకుని.. కలసే పోటీచేయండి.. ముసుగులో గుద్దులాట ఎందుకు? ఇంతకు ముందు మీరు కలిసే పోటీచేశారు, ఇప్పుడు విడిపోయినట్టుగా నటిస్తున్నారు.. కలిసే పోటీచేయండి* అని వ్యాఖ్యానించారు. ఎవ‌రు ఎవ‌రితో క‌లిసి పోటీ చేసినా... తాను మాత్రం ఒంట‌రిగానే పోటీ చేస్తాన‌ని కూడా జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అస‌లు పొత్తులు జ‌నంలో బ‌లం లేని వాళ్ల‌కు కావాలని, జ‌నాన్నే న‌మ్ముకున్న త‌న‌కు కాద‌ని కూడా జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేవారు. తనకు ప్రజల మీద నమ్మకం ఉందని, తను ప్రజలనే నమ్ముకున్నానని చెప్పిన జ‌గ‌న్‌.. పొత్తులను తాను న‌మ్మ‌లేద‌ని, న‌మ్మ‌బోన‌ని కూడా చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు నాయుడును మోడీ కూడా చూసీచూడనట్టుగా ఉన్నాడని జగన్ త‌న‌దైన సెటైర్ సంధించారు. *మన చంద్రబాబే కదా.. పోనీలే* అన్నట్టుగా మోడీ వ్యవహరిస్తున్నార‌ని జగన్ వ్యాఖ్యానించారు. ఎన్ని స్కామ్ లు చేసినా, కుంభకోణాలకు పాల్పడినా చంద్రబాబును మోడీ వదిలేసిన పరిస్థితే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని కూడా జగన్ వ్యాఖ్యానించాడు.

ఇక *జగన్ కాదనడంతోనే రాహుల్ గాంధీ... చంద్రబాబు వద్దకు వెళ్లాడు* అంటూ కొన్ని స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్న‌ అంశంపైనా జ‌గ‌న్ ఘాటుగానే స్పందించారు. దీనిపై త‌న‌దైన శైలి కామెంట్ సంధించిన జ‌గ‌న్‌... ఎంతసేపూ వేరేవాళ్లు భుజాల మీద మోయాలనుకోవడం ఏమిటి? అని ప్రశ్నించాడు. *నీ బలం మీద నువ్వు పోటీ చెయ్.. ప్రజలను నమ్ముకో.. నువ్వూ కష్టపడు. ఎవడో సపోర్ట్ చేయాలి.. ఎవడి భుజాల మీదనో పరిగెత్తాలని నువ్వు అనుకుంటున్నావ్.. నువ్వే విలువలను అమ్మేసుకుని, నువ్వే దిగజారిపోయి.. రాంగ్ మెసేజ్ ఇచ్చావ్* అంటూ కాంగ్రెస్ పార్టీ మీద జ‌గ‌న్ త‌న‌దైన క్లియ‌ర్ వైఖ‌రిని తెలియ‌జేశారు. మొత్తంగా త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఓ సినిమాలో చెప్పిన పాపుల‌ర్ డైలాగ్‌... సింహం సింగిల్ గా వస్తుంది. పందులే గుంపుగా వ‌స్తాయి* మాదిరిగా... వైరి వ‌ర్గాలు ఎన్ని కుతంత్రాలు సాగించినా... తాను మాత్రం సింగిల్‌గానే వ‌స్తాన‌ని, ప్ర‌జ‌ల‌ను న‌మ్ముకున్న త‌న‌కు పొత్తుల‌తో అస‌లు ప‌నే లేద‌ని కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా ఆయా పార్టీలు వైసీపీపై చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు క్లియ‌ర్ క‌ట్ ఆన్సర్ ఇచ్చిన‌ట్టైంది.