Begin typing your search above and press return to search.

'తుని' కేసులను ఎత్తివేస్తా:జ‌గ‌న్

By:  Tupaki Desk   |   11 Aug 2018 4:40 PM GMT
తుని కేసులను ఎత్తివేస్తా:జ‌గ‌న్
X
వైసీపీ అధ్య‌క్షుడు - ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ....ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌లుకుతోన్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ అడుగుపెట్టిన ప్ర‌తి జిల్లాలోనూ ఆయ‌న‌కు అపూర్వ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. తాజాగా, జ‌గ‌న్ యాత్ర నేడు తునికి చేరుకుంది. ఈ సంద‌ర్భంగా గ‌తంలో తుని లో రైలు త‌గుల‌బెట్టిన ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ స్పందించారు. త‌మ‌కు ఇచ్చిన హామీ కోసం గ‌ళ‌మెత్తిన కాపు సోద‌రుల‌పై చంద్ర‌బాబు ఉక్కుపాదం మోపార‌ని మండిప‌డ్డారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం సమయంలో కుట్ర పూరితంగా రైలును తగలబెట్టించిన ఘనుడు చంద్ర‌బాబని నిప్పులు చెరిగారు. తునిలో గ‌తంలో కాపుల రిజర్వేషన్లకు వైసీపీ పూర్తి మద్దతునిచ్చింద‌ని - దాంతో - 75 శాతం వైసీపీ కార్యకర్తలను త‌ప్పుడు కేసుల్లో ఇరికించార‌ని మండిప‌డ్డారు. ఎస్సీలు - బీసీలు - ఆడపడచులు - ఆఖ‌రికి వికలాంగులపై కూడా కేసులు బనాయించారని దుయ్య‌బ‌ట్టారు. వైసీపీ అధికారంలోకి వస్తే.. రైలు ద‌హ‌నం ఘటనలో నమోదైన తప్పుడు కేసులన్నింటినీ ఎత్తేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.

2014 ఎన్నిక‌ల‌కు ముందు కాపు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని చంద్ర‌బాబు త‌ప్పుడు హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. త‌మకు ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని కోరిన కాపు సోద‌రుల న్యాయ‌మైన కోరిక‌ను చంద్ర‌బాబు విస్మ‌రించారు. ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాల‌ని నిర‌స‌నకు దిగిన ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టి....కుట్ర‌పూరితంగా రైలు తగుల‌బెట్టిన ఘ‌ట‌న‌లో కేసులు బ‌నాయించారు. శాంతియుతంగా ఆందోళ‌న చేస్తాన‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చెప్పినా...విన‌కుండా....ఆయ‌న‌పై గృహ నిర్బంధం విధించారు. కాపుల ఓట్ల‌తో సీఎం అయిన‌ చంద్ర‌బాబు....వారిని వంచించిన తీరును రాష్ట్ర‌మంతా గ‌మ‌నించింది. మ‌రోవైపు, కాపు వ్య‌తిరేకిగా చంద్ర‌బాబు ప్ర‌చారం చేస్తోన్న‌ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ....కాపుల‌కు అండ‌గా నిలుస్తాన‌ని ఇప్ప‌టికే ప‌లుమార్లు వెల్ల‌డించారు. కాపు కార్పొరేష‌న్ కు 10 వేల కోట్లు ఇస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. బీసీల‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా....కాపుల రిజ‌ర్వేష‌న్ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని కూడా జ‌గ‌న్ చెప్పారు. తాజాగా, ఆ నాడు జ‌రిగిన రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మంలో అమాయ‌కుల‌పై పెట్టిన కేసులు ఎత్తేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ ప‌రిణామాల‌న్నింటినీ నిశితంగా ప‌రిశీలిస్తే ...నిజంగా కాపు సంక్షేమం కోరుకుంటోన్న వ్య‌క్తి ఎవ‌రన్న‌ది సుస్ప‌ష్ట‌మ‌వుతోంది. క‌ల్లబొల్లి మాట‌లు చెప్పి...కాపుల‌ను కాల‌నాగులా కాటేస్తున్న చంద్ర‌బాబుకు కాపు ఓట‌ర్లు దాదాపుగా దూర‌మైనట్లే. నిజంగా కాపుల సంక్షేమానికి - అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్న జ‌గ‌న్ కు కాపులు అధికారం క‌ట్ట‌బెట్టే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంది.