Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ను ఇప్ప‌టివ‌ర‌కూ చూడ‌ని రీతిలో..!

By:  Tupaki Desk   |   4 Jun 2019 11:51 AM GMT
జ‌గ‌న్ ను ఇప్ప‌టివ‌ర‌కూ చూడ‌ని రీతిలో..!
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రోటీన్ కు భిన్న‌మైన వ‌స్త్ర‌ధార‌ణ‌తో క‌నిపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌చ‌కితుల్ని చేశారు. విశాఖ శార‌దాపీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి ఆశీస్సుల కోసం ఆయ‌న రావ‌టం తెలిసిందే. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో శార‌దా పీఠానికి చేరుకున్న ఆయ‌న స్వామీజీని క‌లుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా స్వామి వారి ఆశీస్సులు పొందారు. స్వామిని క‌లిసేందుకు ఆశ్ర‌మం వ‌ద్ద‌కు వ‌చ్చిన జ‌గ‌న్.. వ‌స్త్ర‌ధార‌ణ ఆస‌క్తిక‌రంగా ఉంది. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో పంచె.. లాల్చీ.. కండువాతో ఆయ‌న సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో ఆశ్ర‌మానికి వెళ్ల‌టంతో అంద‌రూ జ‌గ‌న్ వ‌స్త్ర‌ధార‌ణ‌ను ఆస‌క్తిగా ప‌రికించ‌టం క‌నిపించింది. సంద‌ర్భం ఏదైనా.. ఎంత‌టి ప్ర‌ముఖుల్ని క‌లిసేందుకు వెళ్లినా.. సాదాసీదా ఫ్యాంట్.. లేత రంగు చొక్కా.. క‌బ్స్ ను కాస్త పైకి మ‌డిచి పెట్ట‌టం అల‌వాటు. అలా అంద‌రికి సుప‌రిచిత‌మైన జ‌గ‌న్‌.. అందుకు భిన్నంగా సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. విశాఖ ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌న్ వ‌స్త్ర‌ధార‌ణ హైలెట్ గా నిల‌వ‌ట‌మే కాదు.. ఇలాంటి వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఇంత‌కు ముందు ఎప్పుడూ చూడ‌లేద‌న్న మాట ప‌లువురి నోట వినిపించింది.

శార‌దా పీఠంలో స్వామీ ఆశీస్సుల‌తో పాటు జ‌గ‌న్ ఏం చేశారంటే?

విశాఖ‌లోని చిన‌ముషివాడివాడ‌లో ఉన్న శార‌దా పీఠానికి ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. 2017లో పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌టానికి ముందు ఈ ఆశ్ర‌మానికి వ‌చ్చిన జ‌గ‌న్.. శార‌దా పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంత‌రం ఆయ‌న సూచ‌న మేర‌కు పీఠం అధి దేవ‌త శార‌దా స్వ‌రూప రాజ‌శ్యామ‌ల అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

జ‌గ‌న్ త‌ర‌ఫున స్వామీజీ యాగం చేశార‌న్న మాట కూడా ప్ర‌చారంలో ఉంది. ఎన్నిక‌ల గెలుపున‌కు అవ‌స‌ర‌మైన సానుకూల వాతావ‌ర‌ణం కోసం చేసిన యాగం కూడా జ‌గ‌న్ విజ‌యంలో పాత్ర ఉంద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఎన్నిక‌ల్లో చారిత్ర‌క విజ‌యం త‌ర్వాత.. జ‌గ‌న్ ఎంతో న‌మ్మే శార‌దాపీఠాధిప‌తిని క‌లిసింది లేదు.

ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి ముహుర్తాన్ని కూడా పెట్టింది స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామిగా చెబుతారు. ఆయ‌న ఆశీస్సులు పొందేందుకు తాజాగా విశాఖ‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. స్వామీజీని క‌లిశారు. ఆయ‌న సూచ‌న మేర‌కు శార‌దా స్వ‌రూప రాజ‌శ్యామ‌ల అమ్మ‌వారికి పూజ‌లు నిర్వ‌హించారు.

స్వామి కోసం ఫ‌లాలు తీసుకొచ్చిన జ‌గ‌న్‌.. ఆయ‌న‌కు అందించి.. ఆశీస్సులు పొందారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 8న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో.. మంత్రుల ఎంపిక‌కు సంబంధించి స్వామి వారి స‌ల‌హాలు కూడా జ‌గ‌న్ తీసుకున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా జ‌గ‌న్ విశాఖ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఎయిర్ పోర్ట్ నుంచి శార‌దా పీఠం వ‌ర‌కూ భారీ బందోబ‌స్తు చేప‌ట్టారు. ఎయిర్ పోర్ట్ లో ఉత్త‌రాంధ్ర‌కు చెందిన నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి ప్ర‌త్యేక కాన్వాయ్ లో జ‌గ‌న్ శార‌దా పీఠానికి చేరుకున్నారు. పూర్ణ‌కుంభంతో వేద పండితులు జ‌గ‌న్ కు స్వాగ‌తం ప‌లికారు. స్వామి ఆశీస్సులు.. పూజ అనంత‌రం విశాఖ నుంచి గ‌న్న‌వ‌రానికి తిరిగి వ‌చ్చారు జ‌గ‌న్‌. త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా విశాఖ వాసుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ముంద‌స్తుగా ట్రాఫిక్ డైవ‌ర్ష‌న్స్ తీసుకునేలా పోలీసుల‌కు ముంద‌స్తు సూచ‌న‌లు చేయ‌టం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ ను చూసేందుకు ఆయ‌న ప్ర‌యాణించిన మార్గంలో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున గుమిగూడారు.