Begin typing your search above and press return to search.

ఇంటి గుట్టు రట్టు చేస్తావా జగన్?

By:  Tupaki Desk   |   30 March 2016 5:03 AM GMT
ఇంటి గుట్టు రట్టు చేస్తావా జగన్?
X
తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీ విపక్ష నేత ఏపీ ప్రజల ప్రయోజనాల్ని దెబ్బ తీస్తున్నారా? మరే రాష్ట్రంలోనూ విపక్షం వ్యవహరించని రీతిలో వ్యవహరిస్తూ.. ఆయన సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తాను.. తన ప్రజలు అన్న ఆలోచనే చేస్తుంది తప్పించి.. పక్క రాష్ట్రం.. వారి ప్రయోజనాల్ని కాపాడాలని అస్సలు ఆలోచించదు. అదే ఆలోచిస్తే.. మహారాష్ట్ర సర్కారు నిర్మించిన బాబ్లీ కానీ.. కర్ణాటక ప్రభుత్వం నిర్మించిన ఆల్మట్టి ప్రాజెక్టులు అస్సలు ఉండనే ఉండేవి.

ఈ ప్రాజెక్టుల్ని నిర్మించటం ద్వారా ఆయా రాష్ట్రాల ప్రయోజనాలు మాత్రమే నెరవేరాయే కానీ.. దిగువున ఉన్న తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో.. ఆయా రాష్ట్రాల్లోని విపక్షాలు.. తమ అధికారపక్షం చేపట్టిన ప్రాజెక్టుల్లోని లోపాల్ని.. వాటి వల్ల జరిగే నష్టాలపై ఒక్కమాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు.

అంతదాకా ఎందుకు.. తెలంగాణ సర్కారు చేపట్టిన ప్రాజెక్టు కారణంగా ఏపీ ప్రయోజనాలు భారీగా దెబ్బ తింటాయని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన ఆ మాట అన్నారే కానీ.. నిజంగా అంత నష్టం వాటిల్లేలా ఉంటే.. ఇప్పటివరకూ జగన్ ఎందుకు మాట్లాడలేదు? ఎందకు నోరు విప్పలేదు? జగన్ మాత్రమే కాదు.. తెలంగాణ విపక్షాలు సైతం నోరు మెదిపింది కూడా లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి తమ ప్రయోజనాలే ప్రాధాన్యతగా ఉంటాయి తప్పించి.. మరెవరి బాగోగుల గురించి ఆలోచించరు. కానీ.. జగన్ తీరు అందుకు భిన్నంగా ఉంది. పట్టిసీమ మీద చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ సర్కారు చేసిన పని కారణంగా నిబంధనల్ని ఉల్లంఘించారని.. పక్క రాష్ట్రాల ప్రయోజనాల్ని దెబ్బ తీశారని చెప్పేశారు.

ఇప్పుడు విపక్ష నేత జగన్ ఉన్నారు కాబట్టి ఓకే. రేపొద్దున ఆయన ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారే అనుకుంటే.. ఆ రోజున జగన్ గతంలో చేసిన వాదనల్ని ప్రస్తావించి.. తమ ప్రయోజనాల్ని ఏ విధంగా కాపాడతారని ప్రశ్నిస్తే జగన్ ఏం సమాధానం ఇస్తారు? చూస్తూ.. చూస్తూ ఎంత కడుపు మంటతో ఉన్నా ఇంటి గుట్టును బయట పెట్టుకునేందుకు ఎవరూ సాహసించరు. కానీ.. అందుకు భిన్నంగా జగన్ చేసిన వాదన విన్నప్పుడు.. ఆయన సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల కంటే కూడా.. తన రాజకీయప్రయోజనాలే మిన్నగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ తీరు ఇప్పటికి వర్క్ వుట్ అయినా.. పక్క రాష్ట్రాల వారి చేతికి ఇంటి తాళాలు అప్పుజెప్పినట్లుగా ఉందని చెప్పొచ్చు. అదే జరిగితే.. ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఏ రాష్ట్రంలోని విపక్ష నేతకు లేనట్లుగా.. జగన్ కు తన రాష్ట్ర ప్రజల మీద ఇసుమంతైనా అభిమానం ఎందుకు ఉండదు..?