Begin typing your search above and press return to search.

అన్నోస్తున్నాడ‌ని చెప్తూనే...ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   7 Feb 2019 1:45 PM GMT
అన్నోస్తున్నాడ‌ని చెప్తూనే...ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన జ‌గ‌న్‌
X
స‌మ‌ర‌శంఖారావంతో పార్టీ శ్రేణుల‌కు చేరువ అవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ తాజాగా కీల‌క వ్యాఖ్యలు చేశారు. గురువారం క‌డ‌ప న‌గ‌రంలోని మున్సిప‌ల్ స్టేడియంలో నిర్వ‌హించిన స‌మ‌ర శంఖారావం స‌భ‌లో బూత్ క‌మిటీ స‌భ్యుల‌ను ఉద్దేశించి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు. ``నాకోసం ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొన్నారు..మీ అంద‌రి బాగోగులు నేను చూసుకుంటా. అన్న ముఖ్య‌మంత్రి అవుతాడు..మ‌న‌కు అండ‌గా ఉంటాడ‌ని గ్రామాల్లో చెప్పాలి` అని పార్టీ శ్రేణుల‌కు వైఎస్ జ‌గ‌న్ సూచించారు. దీంతో పాటుగా, తెలుగుదేశం పార్టీకి అండ‌గా ఉండే మీడియా అంటూ ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ప‌లు సంస్థ‌ల‌పై మండిప‌డ్డారు.

దివంగ‌త వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి గురించి ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ వివ‌రించారు. `31వ సంవత్సరాల నాన్నగారి రాజకీయ జీవితంలో కేవలం 5 సంవత్సరాల మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా పాలన చేశారు. అయినా నాన్నగారిని గుండెల్లో పెట్టుకొని ఆధరించింది ఈ జిల్లా.2009లో నాన్నగారి మరణం తరువాత దాదాపు ఇవాల్టికి 10 సంవత్సరాలు ఈ పదేళ్లు నాన్నగారు పోయిన తరువాత జగన్‌ అనే నన్ను ఒక కొడుకుగా ఆదరించింది ఈ జిల్లా. మీరు ఆదరించారు కాబట్టే రాష్ట్రం వైపు కన్నెత్తి చూడగలుగుతున్నాను.`` అని ప్ర‌క‌టించారు. ``మరో నెలలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో మీ అందరి భుజస్కందాల మీద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించే బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడి అన్యాయమైన రణనీతిని, దిగజారుడు రాజకీయాలు నడపడం చూస్తున్నాం. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు నాయుడు డబ్బుల పంపకాలు, మూటల మూటల డబ్బులు గ్రామాల్లోకి పంపే కార్యక్రమం చేస్తాడు. మనకు సంబంధించిన వారి ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవడం ఒక పని, రెండో పని చంద్రబాబు రెండు రెండు ఓట్లు ఎక్కిస్తున్నాడు. మెన్ననే ఎలక్షన్‌ కమిషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాం. అక్షరాల రాష్ట్రంలో 59 లక్షల 18 వేల దొంగ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేశాం. 59 లక్షల్లో 20 లక్షల ఓట్లు తెలంగాణ ఉంటే మరో 39 ఓట్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇలాంటి దొంగ ఓట్లను తొలగించే పనిచేయాలి`` అని పిలుపునిచ్చారు.

ఎన్నికలు రెండు నెలల్లో ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు రోజుకో స్కీమ్‌ ప్రకటిస్తాడని జ‌గ‌న్ తెలిపారు. ``చంద్రబాబు నైజం మీకంతా తెలుసు. అబద్ధాలు చెప్పడంలో ఆయన్ను మించినవాడు ఎవరూ లేరు. అబద్ధాలే కదా.. పోయేది ఏముంది ప్రజలే కదా నష్టపోయేది నేను కాదుకదా అని సులభంగా అబద్ధాలు వస్తాయి. మీరంతా అప్రమత్తంగా ఉండండి. చంద్రబాబు చెప్పే మోసాలు, అబద్ధాలు, ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబీఎన్, టీవీ–5 ఉంది. ఇంకా ఏమేమి ఉన్నాయో మీ అందరికీ తెలుసు. మనం యుద్ధం చేసేది చంద్రబాబు ఒక్కరితోనే కాదు. ఆయన్ను మోస్తున్న ఎల్లోమీడియాతో కూడా యుద్ధం చేయబోతున్నాం. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. చంద్రబాబు చెప్పే అబద్ధాలు, మోసాలు ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలి. ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలి. అమ్మా చంద్రబాబు మాటలు నమొద్దు. ఐదేళ్ల క్రితం ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తే ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని ఘరానా మోసం చేసేందుకు సినిమా చూపిస్తున్నాడని ప్రతి అక్కకు, చెల్లికి, సోదరుడికి, స్నేహితుడికి, అవ్వకు, తాతకు చెప్పండి`` అని కోరారు.

అన్న వస్తున్నాడు....అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మే మాసం వచ్చే సరికే ప్రతి రైతన్న చేతుల్లో రూ. 12,500లు పెట్టబోతున్నాడని చెప్పండ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ``చంద్రబాబు ఇచ్చే డబ్బుతో మోసపోవద్దని గట్టిగా చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయితాడు. వెంటనే రూ. 45 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు ఇంటికి వచ్చి నాలుగు సంవత్సరాల్లో రూ. 75 వేలు ఇస్తాడని చెప్పండి. అన్న వచ్చిన వెంటనే పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు మొత్తం నేరుగా నాలుగు దఫాలుగా మీ చేతులకే ఇస్తాడని చెప్పండి. రుణాలు ఇవ్వడమే కాదు. అన్న వడ్డీలేని రుణాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాడని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఇవాళ ఇస్తున్న రూ. 2 వేలు చూసి మోసపోవద్దని ప్రతి అవ్వా, తాతకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పాడు కాబట్టే చంద్రబాబు ఎన్నికల ముందు రూ. 2 వేలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు వెంటనే పెన్షన్‌ రూ. 2 వేల నుంచి పెంచుకుంటూ రూ. 3వేలకు తీసుకెళ్తాడని చెప్పండి. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి అన్న ముఖ్యమంత్రి అయితాడు. మన పిల్లలు అందరూ చదువుకోవడానికి అప్పులపాలు అయ్యే పరిస్థితి లేకుండా దగ్గరుండి చదివిస్తాడు. ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు చదివిస్తాడని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి నిరుపేదకు దగ్గరుండి ఇల్లు కట్టిస్తాడని చెప్పండి. వైద్యం అందక అప్పుల పాలయ్యే పరిస్థితిని మార్చేస్తాడు. అన్న ముఖ్యమంత్రి అయితే వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే చాలు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా దగ్గరుండి అన్న ఆపరేషన్‌ చేయిస్తాడని చెప్పండి. ప్రతి అమ్మ, అక్క, చెల్లి, అవ్వా, తాతలకు నవరత్నాల గురించి చెప్పండి``అంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.