Begin typing your search above and press return to search.

మార్పుల వెనుక జగన్ అసలు వ్యూహం ఇదేనట

By:  Tupaki Desk   |   25 Nov 2022 5:30 AM GMT
మార్పుల వెనుక జగన్ అసలు వ్యూహం ఇదేనట
X
'మరక మంచిదే' అంటూ అప్పట్లో వచ్చిన ఒక వాణిజ్య ప్రకటన అందరిని ఆకర్షించింది. ఆ యాడ్ ను చూసినప్పుడు.. నెగిటివిటీలో నుంచి పాజిటివిటీని తీయటం కనిపిస్తుంది. సరిగ్గా ఇదే సూత్రాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాటిస్తున్నట్లుగా చెప్పాలి. ఏ విషయంలో అయితే మిగిలిన పార్టీ అధినేతలు ఇబ్బందులు ఎదుర్కొంటారో.. సరిగ్గా అదే విషయాన్ని తన ఆయుధంగా మార్చుకోవాలన్నది ఆయన లెక్కగా కనిపిస్తోంది.

తాను అధికారంలోకి వచ్చిన వెంటనే.. మంత్రి వర్గాన్ని కొలువు తీర్చి.. అందరిని హ్యాపీ చేసిన వేళ.. వారందరికి మీ పదవి రెండున్నరేళ్లు మాత్రమే అంటూ షాకివ్వటం ద్వారా.. నేను దేనికి వెనుకాడను. ఎవరిని లెక్క చేయను. లెక్క తేడా వస్తే ఎవరైనా వేటు తప్పదన్న విషయాన్ని తన మాటతో స్పష్టం చేశారు. అదే సమయంలో.. పదవులు రాక బాధలో ఉన్న వారిలో కొత్త ఆశలు చిగురించేలా చేసి.. మరింత కమిట్ మెంట్ తో పని చేయాలన్న సందేశాన్ని పంపారు.

ఏదో చెబుతారు. చెప్పినవన్నీ చేస్తారా? మంత్రివర్గాన్ని మార్చటం అంత తేలికైన విషయమా? అందులోని అందులో జగన్ కు వీర విధేయులు.. సన్నిహితులు ఎంత మంది ఉన్నారు? వారి మార్పు సాధ్యమా? అని అందరూ సందేహిస్తున్న వేళ.. వారి సందేహాలు ఏవైతే ఉన్నాయో.. సరిగ్గా వాటినే తీర్చేస్తూ అందరిని మరింత సర్ ప్రైజ్ చేశారు.

ఎవరైతే సొంతవాళ్లుగా జగన్ కు ఉంటారో.. వారిపైనే వేటు వేస్తే? ఆలోచనకు కూడా ఇష్టపడని ఈ తీరును నిర్మోహమాటంగా అమలు చేసిన సత్తా జగన్ సొంతం.

అలా మంత్రి వర్గంలో తన అన్న వాళ్లను మార్చటం ద్వారా.. మిగిలిన వారికి బలమైన సంకేతాన్ని పంపారు. అయినోళ్లనే తీసి పక్కన పెడితే.. మిగిలినోళ్ల విషయంలో ఆయన అస్సలు లెక్క చేయరన్న భయాన్ని.. అంతకుమించి భక్తి పెరిగేలా చేశారు. దెబ్బకు అందరూ దారిలో ఉండేలా చేశారు.

అదే సమయంలో సన్నిహితంగా ఉండే వారి మనసులో బాధ ఉన్నా.. అప్పటికే ఉన్న సన్నిహితుడన్న ముద్ర కోసం నోరు మెదపకుండా ఉండిపోవటం కనిపిస్తుంది. ఇలా.. తనదైన వ్యూహంతో ముందుకెళుతున్న జగన్ వైనం రోటీన్ రాజకీయాలకు భిన్నంగా ఉంటుందని చెప్పాలి. తాజాగా చేపట్టిన మార్పులు.. త్వరలో చేపట్టే మార్పులు కూడా ఈ కోవలోకే వస్తాయని చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.