Begin typing your search above and press return to search.

వైఎస్ జగన్.. వెబ్‌ సైట్లనూ ఓ చూపు చూడొచ్చుగా!

By:  Tupaki Desk   |   2 Nov 2017 4:13 AM GMT
వైఎస్ జగన్.. వెబ్‌ సైట్లనూ ఓ చూపు చూడొచ్చుగా!
X

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొంత వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తున్నాడు. కొంతమంది ఇదేంటి..అంటున్నప్పటికీ జగన్ మోహన్ రెడ్డి మీడియా బాసులతో సమావేశం అయ్యాడు. తనను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న మీడియా వర్గాలకు స్నేహహస్తం చాచాడు జగన్ మోహన్ రెడ్డి. తన కన్నా వయసులో చాలా పెద్ద వాళ్లు అయిన మీడియా బాసులతో జగన్ స్వయంగా వెళ్లి మాట్లాడాడు. ఇక పిలిపించుకుని మాట్లాడదగిన వాళ్లను పిలిపించుకుని మాట్లాడాడు. ఇలా జగన్ మోహన్ రెడ్డి మీడియా బాసులతో ఫ్రెండ్షిప్ నేచర్ తో నడుచుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు.

ఇక్కడ ప్రధానంగా ఒక విషయం ఉంది. ఒకవేళ సదరు మీడియా బాసులు జగన్ కు ఇకపై ఎంతో కొంత సానుకూలంగా నడుచుకుంటే ఫర్వాలేదు. ఒకవేళ నడుచుకోకపోయినా కొత్తగా వచ్చే నష్టం లేదు. ఎలాగూ వాళ్లంతా వ్యతిరేకులే.. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే నష్టం లేదు. ఒకవేళ జగన్ లోని ఈ నేచర్ కు వాళ్లు సానుకూలంగా స్పందిస్తే.. అది వైకాపాకు ఎంతో కొంత సానుకూలత అవుతుంది.

మీడియా బాసుల విషయంలో ఎవరు తీవ్రమైన శత్రువులు - ఎవరు.. ఒక మోస్తరు శత్రవులు అనే అంశం గురించి జగన్ కు ఈ మీటింగులతో క్లారిటీ రానే వచ్చి ఉంటుంది. ఇది చక్కటి ఫార్వర్డ్ స్టెప్పే. మరి ఇదే రీతిన జగన్ మోహన్ రెడ్డి మరిన్ని అడుగులు వేయాల్సి ఉంది. ఇప్పుడు వెబ్ మీడియా ఎంత ప్రముఖమైనదో ఎవరికీ వివరించనక్కర్లేదు.

వార్తల కోసం విశ్లేషణల కోసం జనాలు వెబ్ మీద ఆధారపడుతున్నారు. ప్రింట్ ఎడిషన్లలో వార్తలు వచ్చే వరకూ ఎదురుచూడరు.. టీవీల ముందు కూర్చునేంత అవకాశమూ ఉండదు.. సో ఇప్పుడు జనాలకు వెబ్ సైట్లే ప్రధాన వార్తల వనరులు. తెలుగు వాళ్లలోనే కొన్ని లక్షల మంది ఇప్పుడు నెటిజన్లుగా అనునిత్యం సైట్లతో టచ్ లో ఉంటున్నారు, సైట్లను చూడటం వారందరికీ దినచర్య.

వెబ్ సైట్లు ఇప్పుడు ఒక పెద్ద మీడియా సామ్రాజ్యం. ఈ వెబ్ సైట్లలోని కంటెంటే సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అవుతూ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో వార్తలను చేరవేయడంలో ప్రధాన పత్రికలు.. టీవీ చానళ్లకు ధీటైన పాత్రను పోషిస్తున్న వెబ్ సామ్రాజ్యాన్ని కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవాల్సి ఉంది. మరీ అర్రీబుర్రీ సైట్లన్నింటినీ కాకపోయినా. . ప్రధాన సైట్లను గుర్తించి.. వాటి పోకడలను గమనించుకుని తమ దారికి తెచ్చుకోవాల్సిన అవసరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా ఉంది. వాళ్లెంత చిన్నవాళ్లైనా కావొచ్చు.. పిలిపించుకుని మాట్లాడితే అది మంచిదే అవుతుంది. వెబ్ మీడియాను ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. మంచినైనా చెడునైనా చాలా త్వరగా, ప్రభావంతంగా చేరవేసే శక్తిని కలిగిన మీడియా ఇది. దీన్ని కూడా ప్రధాన స్రవంతి మీడియాకు ధీటుగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది.

వైకాపా అధినేత ఈ విషయాన్ని గ్రహించాలి. ఇంటర్నెట్ ను అడ్డం పెట్టుకునే యూత్ ఓట్లను ఒకరేంజ్ లో ఆకర్షించగలిగాడు మోడీ అనే సత్యాన్ని మరవకూడదు.ఆ వర్గాన్ని ప్రభావితం చేయగల సైట్ల ను ఎలా డీల్ చేయాలో కూడా వైకాపా అధినేత - ఆ పార్టీ ముఖ్యులు ఆలోచించుకుని వ్యవహరిస్తే వారికే మంచిది!