Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. అచ్చెన్నాయుడికి జ‌గ‌న్ ఆఫ‌ర్ ఇదే!

By:  Tupaki Desk   |   15 Sep 2022 7:06 AM GMT
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. అచ్చెన్నాయుడికి జ‌గ‌న్ ఆఫ‌ర్ ఇదే!
X
ఏపీ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు సెప్టెంబ‌ర్ 15 గురువారం మొద‌ల‌య్యాయి. వీటిని ఐదు రోజుల‌పాటు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో శాస‌న‌స‌భ స‌మావేశాలు సెప్టెంబ‌ర్ 21 వ‌ర‌కు జ‌రుగుతాయి. 17, 18వ తేదీలు శ‌ని, ఆదివారం కావ‌డంతో ఆ రెండు రోజులు స‌మావేశాలు ఉండ‌వు. కాగా స‌మావేశాలు ఎన్ని రోజులు నిర్వ‌హించాల‌నే విష‌యంపై స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం అధికార‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌తో బీఏసీ స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ స‌మావేశంలో ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు జ‌రిగాయ‌ని తెలుస్తోంది. స్పీక‌ర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ బీఏసీ స‌మావేశానికి సీఎం వైఎస్ జ‌గ‌న్‌, ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌, మ‌రో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఈ నేప‌థ్యంలో స‌మావేశాల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం టీడీపీ చేస్తోంద‌ని.. ఇలా చేయొద్ద‌ని జ‌గ‌న్ అచ్చెన్నాయుడుకు సూచించారు. అంతేకాకుండా ఏ అంశంపైన అయినా చ‌ర్చ‌కు తాముకు సిద్ధంగా ఉన్నామ‌ని అచ్చెన్న‌కు సీఎం జ‌గ‌న్ తెలిపిన‌ట్టు స‌మాచారం.

ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్.. అచ్చెన్న‌కు ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. మీరు ఏ అంశంపైన కోరుకుంటే ఆ అంశంపైన చ‌ర్చ జ‌రుపుదామ‌ని సీఎం జ‌గ‌న్ అచ్చెన్నాయుడుకి ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. రాజ‌ధాని అంశంపై అయినా, లేదా ఈఎస్ఐ స్కామ్‌పైన అయినా (ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడును గ‌తంలో అరెస్టు చేశారు) చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని జ‌గ‌న్ చెప్పిన‌ట్టు స‌మాచారం.

తాము ఏ అంశంపైన అయినా చ‌ర్చ‌కు సిద్ధంగా ఉన్న నేప‌థ్యంలో స‌మావేశాల‌ను అడ్డుకోవ‌డానికి, ర‌చ్చ చేయ‌డానికి టీడీపీ ప్ర‌య‌త్నించ‌వ‌ద్ద‌ని సీఎం జ‌గ‌న్ కోరారు. చర్చకు సహకరించకుండా గొడవ చేయడం సమంజసం కాదని టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులు కూడా బీఏసీ స‌మావేశంలో అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. సీఎంను ఏదైనా అంటే ఊరుకునేది లేదని, చంద్రబాబే రెచ్చగొట్టి ఎమ్మెల్యేలను గొడవకు పంపిస్తున్నారని మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేల‌పై మండిప‌డ్డార‌ని అంటున్నారు.

మ‌రోవైపు టీడీపీ సభ్యులు 19 అంశాలను సభలో చర్చించాలని కోరార‌ని స‌మాచారం. కాగా ప్రభుత్వం 27 అంశాలపై చర్చించాలని నిర్ణ‌యించింద‌ని తెలుస్తోంది. వ్యవసాయరంగం, రాష్ట్ర ఆర్ధిక రంగ పరిస్థితి, వర్షాలు, వరదలపై నష్టాలు , నిరుద్యోగ సమస్య, పోలవరం ప్రాజెక్టు, విభజన అంశాలపై చర్చించాలని టీడీపీ పట్టుబ‌ట్టింది. ఈ అంశాలపై చర్చకు ప్రభుత్వం అంగీక‌రించింది. అదేవిధంగా జిల్లాల విభజన అంశం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైన కూడా ప్రధానంగా చర్చించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా మూడు రాజధానుల అంశంపై కూడా ప్రభుత్వం చర్చ పెట్టే అవకాశం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.