Begin typing your search above and press return to search.

పాద‌యాత్ర ముగింపు... ప్ర‌చార యాత్ర కొన‌సాగింపు

By:  Tupaki Desk   |   6 Jan 2019 9:36 AM GMT
పాద‌యాత్ర ముగింపు... ప్ర‌చార యాత్ర కొన‌సాగింపు
X
వంద‌లాది రోజుల పాద‌యాత్ర‌. వేలాది కిలోమీట‌ర్ల ఓదార్పు. ల‌క్ష‌లాది మందికి భ‌రోసా. నేనున్నాను అనే న‌మ్మ‌కం. ఇలా సాగింది వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌తిప‌క్ష నాయకుడు వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌. ఈ యాత్ర‌కు ఈ నెల తొమ్మిదో తేదీన ముగింపు ప‌లుకుతున్నారు యువ నాయ‌కుడు వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసే ఈ యాత్ర రానున్న శాస‌న‌స‌భ‌, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు ప్ర‌చార నాందీ యాత్ర‌గా సాగుతుంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక మూడు నాలుగు నెల‌ల్లోనే లోక్ స‌భ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. దీంతో ఈ మూడు నాలుగు నెల‌ల పాటు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి విజ‌య‌మే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. జ‌న‌వ‌రి నెలాఖ‌రులోగా అటు శాస‌న‌స‌భ‌కు, ఇటు లోక్ స‌భ‌కు కూడా అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించి ఎన్నిక‌ల శంఖారావం పూరించ‌నున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అన్ని స‌ర్వేలు త‌మ‌కు అనుకూలంగానే వ‌స్తూండ‌డంతో పార్టీ శ్రేణులు కూడా మ‌రింత ఉత్సాహంగా ఉన్నార‌ని అంటున్నారు. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల క‌ల‌యిక‌ను ప్ర‌జ‌లు వ్య‌తిరేకించారని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా అదే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా వై.ఎస్.జ‌గ‌న్మ‌హ‌న్ రెడ్డి చేసిన పాద‌యాత్ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని పార్టీ అధిష్టానం అంచ‌నా వేసింది. ఈ విష‌యంలో అధికార తెలుగుదేశం పార్టీ చేయించిన స‌ర్వేలు కూడా ఇదే ఫ‌లితాన్నిచ్చిన‌ట్టు చెబుతున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు వ‌చ్చిన స్పంద‌న కార‌ణంగానే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అద్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడిలో భ‌యం వెంటాడుతోంద‌ని, పాద‌యాత్ర‌కు వ‌చ్చిన వారంతా ప్ర‌తిప‌క్ష పార్టీకి ప‌ట్టం క‌ట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌ని రాజ‌కీయ పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబు నాయుడి నాలుగున్న‌రేళ్ల పాల‌న‌తో విసిగిపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు పాల‌న‌లో మార్పు కోరుకుంటున్నారంటున్నారు. అయితే ఇదే స‌మ‌యంలో తాను తిరిగి అధికారంలోకి రావ‌డం కోసం చంద్ర‌బాబు నాయుడు ఎలాంటి చ‌ర్య‌ల‌కైనా సిద్ధ‌మ‌వుతార‌ని, దీనిని ఎదుర్కొంటూ విజ‌యం సాధించేందుకు స‌రైన వ్యూహ ర‌చ‌న చేయాల‌ని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అధినేత పాద‌యాత్ర ముగిసిందంటే ప్ర‌చార యాత్ర ప్రారంభ‌మైన‌ట్లేన‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండుగ అనంత‌రం అభ్య‌ర్ధుల ఎంపిక‌ పై క‌స‌ర‌త్తు ప్రారంభ‌మ‌వుతుంద‌ని, అనంత‌రం ప్ర‌చార స‌ర‌ళిపై మంత‌నాలు, దాని ఆచ‌ర‌ణ వంటి అంశాల‌పై పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దృష్టి సారిస్తార‌ని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.