Begin typing your search above and press return to search.

పాద‌యాత్ర నినాదం:రావాలి జ‌గ‌న్‌..కావాలి జ‌గ‌న్

By:  Tupaki Desk   |   4 Nov 2017 6:02 PM GMT
పాద‌యాత్ర నినాదం:రావాలి జ‌గ‌న్‌..కావాలి జ‌గ‌న్
X
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్ట‌నున్న పాద‌యాత్ర‌కు ప్రారంభం అవుతున్న వేళ‌...కీల‌క అంశాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. వైఎస్ జ‌గ‌న్ మొద‌లుపెట్ట‌నున్న‌ యాత్ర‌కు సంబంధించిన స్లోగ‌న్ ఒక‌టి తాజాగా విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ``రావాలి జ‌గ‌న్...కావాలి జ‌గ‌న్`` స్లోగ‌న్‌తో వైఎస్ జ‌గ‌న్ యాత్ర సాగ‌నుంద‌ని స‌ద‌రు కీల‌క వ‌ర్గాల‌ స‌మాచారం. ఊహించిన‌ట్లుగానే...ఈ స్లోగ‌న్‌ను తీర్చిదిద్దింది రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌. 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌చారంలో పెట్టిన జాబు రావాలంటే..బాబు రావాల‌నే నినాదానికి పోటీగా అంతే ఆక‌ర్ష‌ణ‌తో ఉండేలా జ‌గ‌న్ పాద‌యాత్ర స్లోగ‌న్ ఉంద‌ని అంటున్నారు.

2019 ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ఇండియ‌న్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ క‌మిటీకి చెందిన ప్ర‌శాంత్ కిశోర్‌ను త‌న వ్యూహ‌క‌ర్త‌గా వైఎస్ జ‌గ‌న్ నియ‌మించుకోవ‌డ‌మే కాకుండా...ఇదే విష‌యాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను క్షుణ్ణంగా అధ్య‌య‌నం, స‌మ‌న్వ‌యం చేస్తున్న ప్రశాంత్ కిశోర్ ఈ క్ర‌మంలో తాజా స‌ల‌హా ఇచ్చార‌ని స‌మాచారం. రావాలి జ‌గ‌న్‌..కావాలి జ‌గ‌న్ నినాదం ద్వారా ప్ర‌జ‌ల్లో వైఎస్ జ‌గ‌న్ ప‌ట్ల ఉన్న ఆకాంక్ష‌ను ప్ర‌తిబింబించేందుకు ప్ర‌శాంత్ కిశోర్ ప్ర‌ణాళిక ర‌చించార‌ని చెప్తున్నారు.

వైఎస్ జ‌గ‌న్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతంగా ముందుకు తీసుకుపోవ‌డ‌మే ల‌క్ష్యంగా సాగుతున్న ప్ర‌శాంత్ కిశోర్ టీం ఈ నినాదాన్ని వాల్ పెయింటింగ్లు, హోర్డింగ్‌లు, బ్యాన‌ర్ల ద్వారా విస్తృతంగా ప్ర‌చారం చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో 3,000కు పైగా చోట్ల ఈ వాల్ పెయింట్లు రాసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశార‌ని స‌మాచారం. దీంతోపాటుగా జ‌గ‌న్ వ‌స్త్రాధ‌ర‌ణ‌పై సైతం ప్ర‌త్యేక దృష్టి సారించార‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ యూత్ లుక్‌లో డ్రెసప్ అయ్యేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశార‌ని తెలుస్తోంది. త‌ద్వారా తాను యువ‌త‌కు ప్ర‌తినిధి అనే సందేశాన్ని జ‌గ‌న్ చాటిచెప్పేలా చేయ‌నున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ దోతీ ధ‌రించ‌క‌పోయిన‌ప్ప‌టికీ....ఆయ‌న ఆహార్యం మాత్రం ఆక‌ట్టుకునేలా ఉండ‌టం ఖాయ‌మ‌ని చెప్తున్నారు.