Begin typing your search above and press return to search.

జగన్ సభకు ఆ జనం ఏంది ‘తమ్ముడూ’?

By:  Tupaki Desk   |   10 Dec 2015 3:36 PM GMT
జగన్ సభకు ఆ జనం ఏంది ‘తమ్ముడూ’?
X
కొద్ది రోజుల విరామం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చారు. విశాఖ జిల్లా చింతపల్లిలో ఆయన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో బాక్సైట్ తవ్వరాల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం సాయంత్రం సభకు వచ్చిన ప్రజానీకాన్ని చూసి జగన్ సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాల దిశగా ప్రయత్నాలు చేశారని.. అప్పట్లో గిరిజనుల నుంచి వ్యతిరేకత వచ్చిందన్నారు. అనంతరం వైఎస్ సర్కారు వచ్చిన తర్వాత ఈ విషయం మీద నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. మరి ఇప్పుడు అదే చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత బక్సైట్ అమ్మకాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవటం ఏమిటంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా తెలివిగా మాట్లాడిన జగన్.. బహిరంగ సభను కవర్ చేసేందుకు వివిధ వార్తా ఛానళ్లలో లైవ్ ఇచ్చారు.

ఈ విషయాన్ని గుర్తించి.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఛానళ్ల ద్వారా అందరికి అర్థమయ్యేలా చేశారు. ఛానళ్ల కెమెరాలన్నీ ప్రజల వైపుకు తిప్పాలన్న జగన్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అర్థమయ్యేలా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా రెండు చేతులు ఎత్తాలని కోరారు. ఒకటికి నాలుగుసార్లు జగన్ కోరటంతో మీడియా కెమరాలన్నీ ప్రజల మీదకు ఫోకస్ చేశాయి. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున నో అంటూ రెండు చేతులు ఎత్తటం గమనార్హం.

ఈ సందర్భంగా రెండు అంశాలు అందరికి తెలిసేలా చేశాయి. ఒకటి.. ప్రజలు బాక్సైట్ కు ఎంత వ్యతిరేకంగా ఉన్నారన్నది. రెండోది.. జగన్ సభకు ఎంతమంది వచ్చారన్న విషయం. కెమేరా కన్ను కనుచూపు మేరకు.. అన్నీ యాంగిల్స్ లో జనం పోటెత్తటం కనిపించింది. భారీ స్థాయిలో వచ్చిన జనాన్ని చూసిన అంశంపై ఓ తెలుగుదేశం సీనియర్ నేత మాట్లాడుతూ.. ‘‘జగన్ సభకు ఇంత జనమా? ఏమైనా మందిని తోలుకొచ్చారా? లేక.. నిజంగా వచ్చారా?’’ అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తే.. పక్కనున్న మరో తమ్ముడు రియాక్ట్ అవుతూ.. ‘‘ఇష్యూ తీవ్రత ఎక్కవగా ఉంటే ఇలానే వస్తారు. ఇది మనకు డేంజర్ బెల్ లాంటిది’’ అంటూ వ్యాఖ్యానించటం గమనార్హం. జగన్ సభకు వచ్చిన జన సందోహాన్ని చూసిన తెలుగుదేశం నేతలు సైతం విస్మయానికి గురి అవుతుండటం విశేషం.