Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఎఫెక్ట్‌.. ఆమంచి రాజ‌కీయం ఎటు?

By:  Tupaki Desk   |   22 Dec 2022 2:30 PM GMT
జ‌గ‌న్ ఎఫెక్ట్‌.. ఆమంచి రాజ‌కీయం ఎటు?
X
ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క నాయ‌కుడు. రాజ‌కీయాల్లోకి దివంగ‌త రోశ య్య శిష్యుడిగా ప్ర‌వేశించిన ఆయ‌న త‌ర్వాత కాలంలో త‌న‌కంటూ.. ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నారు. చీరాల నుంచి బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదిగారు. అయితే.. ఇప్పుడు ఆమంచికి పెద్ద సంక‌ట‌స్థితి ఎదురైంది. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నందున‌.. పార్టీ అధినేత సీఎం జ‌గ‌న్‌ మాట వినాలా? లేక‌.. త‌న రాజ‌కీయ భ‌విత‌వ్యం కోసం.. సొంత‌గా నిర్ణ‌యం తీసుకోవాలా? అనేది.. ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారింది.

కార‌ణం ఇదే..
రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు.. ఆమంచి కాంగ్రెస్‌లో ఉన్నారు. విభ‌జ‌న త‌ర్వాత ఆయ‌న‌కు ఇటు టీడీపీ, అటు వైసీపీ నుంచి కూడా ఆహ్వానాలు వ‌చ్చాయి. అయితే, రెండు పార్టీల‌కు దూరంగా ఉండి.. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా చీరాల నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అనంత‌రం.. టీడీపీలో చేరారు. మంత్రి ప‌ద‌విని ఆశించారు. అయితే, చంద్ర‌బాబు ఇవ్వ‌లేదు. దీంతో అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించి.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు.. అదే మంత్రి ప‌ద‌వి హామీ మేర‌కు వైసీపీలో చేరారు.

అయితే..ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ తెలివిగా వ్య‌వ‌హ‌రించి..బ‌ల‌మైన క‌ర‌ణం బ‌ల‌రాంను చీరాల నుంచి పోటీ చేయించింది. ఫ‌లితంగా.. ఆమంచి ఓడిపోయారు. త‌ర్వాత‌..ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని ఆయ‌న అడ‌గ‌లేదు.. పార్టీ కూడా ప‌ట్టించుకోలేదు. దీనికి కార‌ణం.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రావే..అనే వాద‌న కూడా ఆమంచి వ‌ర్గంలో ఉంది. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని.. మంత్రిగా పిలిపించుకోవాల‌నేది..ఆమంచి వ్యూహం.

కానీ, ఇదే ఇప్పుడు ఆయ‌న‌కు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే.. టీడీపీ త‌ర‌ఫున గెలిచిన క‌ర‌ణం.. ఇప్పు డు వైసీపీలో ఉన్నారు. టెక్నిక‌ల్‌గా టీడీపీ స‌భ్యుడే అయినా.. రాజ‌కీయంగా ఆయ‌న వైసీపీకి అనుకూలంగా మారారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌రణంకు చీరాల టికెట్ ఇవ్వ‌నున్నారనేది స్ప‌ష్టంగా తెలుస్తున్న విష‌యం. ఈ నేప‌థ్యంలో ఆమంచికి ప‌రుచూరు టికెట్ ఇవ్వాల‌ని పార్టీ అధిష్టానం నిర్ణ‌యించింది.

ఇది జ‌రిగి ఏడాది అయినా..ఆమంచి మాత్రం స‌సేమిరా అంటున్నారు. ఎందుకంటే.. చీరాల‌లో అయితే.. బీసీ వ‌ర్గం ఆయ‌న‌కు అనుకూలంగా ఉంది. అదే ప‌రుచూరులో అయితే.. క‌మ్మ వ‌ర్గం ఎక్కువ‌. పైగా.. ఈ ఓటుబ్యాంకు టీడీపీకి అనుకూలం. దీంతో ఆమంచి వంటి ఫైర్ బ్రాండ్ అక్క‌డ అడుగు పెట్టినా.. టీడీపీ ఓటు బ్యాంకును చీల్చి తాను ల‌బ్ధి పొంద‌డం అనేది సాధ్యం కాదు. అంటే.. గెలుపు అంత ఈజీకాదు.

మ‌రి ఇప్పుడు ఏం చేయాలి? అటు జ‌గ‌న్.. ప‌రుచూరుకు వెళ్లాల‌ని ఆదేశించడాన్ని తోసిపుచ్చ‌లేరు. అలాగ‌ని వెళ్ల‌లేరు. వెళ్లి మొత్తానికే త‌న ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంది. ఈ నేప‌థ్యంలో ఆమంచి ముందు.. ఉన్న ఆప్ష‌న్ ఏంటి? ఏం చేస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.